Devotional

వేముల‌వాడ రాజ‌న్న‌కు కోడె మొక్కులు ఎందుకు చెల్లిస్తారు?

వేముల‌వాడ రాజ‌న్న‌కు కోడె మొక్కులు ఎందుకు చెల్లిస్తారు?

పరమశివుడు ప్రశాంతత కోసం వచ్చిన నెలవు. సూర్యుడు పునీతుడైన దివ్యక్షేత్రం. శ్రీకృష్ణుడు కోడెమొక్కు చెల్లించిన భవ్యస్థలి వేములవాడ  దక్షిణకాశిగా పేరొందిన వేములవాడ క్షేత్రంలో శివరాత్రి సంబురం మొదలుకానుంది. మేడారం జాతరతో మొదలైన భక్తుల రాక.. శివరాత్రి నాటికి రెట్టింపవుతుంది. అయ్యవారికి అభిషేకాలు, అమ్మవారికి అర్చనలతో రాజన్న సన్నిధి ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతుంది.

***రాజరాజేశ్వరుడు కొలువుదీరిన వేములవాడ క్షేత్రం శివరాత్రికి ముస్తాబవుతున్నది. పురాణాల్లో ‘లేంబాల వాటిక’గా పేర్కొన్న వేములవాడ స్థలపురాణం వినడంతో సర్వ దోషాలూ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. భోగభాగ్యాలకు నిలయమైన సుక్షేత్రాలను వెదుకుతూ పరమశివుడు భూలోకంలో తన నిత్య నివాసానికి వేములవాడను ఎన్నుకున్నాడని పురాణ కథనం. రాజరాజేశ్వరుడిగా శివయ్య కొలువుదీరితే, మహిషాసురుణ్ని ఇదే ప్రాంతంలో సంహరించిన ఆదిశక్తి రాజేశ్వరిగా నిలిచింది. సమస్త దేవతలూ అమ్మవారిని అభిషేకించారట. ఆ పవిత్ర జలంతో సకల తీర్థాల సంగమంగా ‘ధర్మగుండం’ పుష్కరిణి వెలిసింది.
t2

**కృష్ణుడు చెల్లించిన మొక్కు
వేములవాడ రాజన్న అనగానే గుర్తుకొచ్చేది కోడె మొక్కులు. యవ్వనంలో ఉన్న కోడెలను రాజన్నకు సమర్పిస్తే కోరుకున్నవి జరుగుతాయని నమ్మకం. ఈ సంప్రదాయానికి ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు శ్రీకారం చుట్టాడని స్థల పురాణం. శ్రీకృష్ణుడు, జాంబవతి దంపతులకు రాజరాజేశ్వరుడి అనుగ్రహంతో సాంబుడనే కొడుకు కలిగాడట. పుత్రుణ్ని వరంగా ప్రసాదించిన రాజన్నకు కోడెను మొక్కుగా చెల్లించుకున్నాడట శ్రీకృష్ణుడు. నేటికీ కోడె మొక్కు సంప్రదాయం కొనసాగుతుండటం విశేషం. పాండవులు ఈ క్షేత్రాన్ని సందర్శించి దక్షిణాపథం యాత్రకు వెళ్లినట్లు తెలుస్తున్నది. దీనికి నిదర్శనంగా రాజన్న క్షేత్రంలో సోమేశ్వర, ఉమామహేశ్వర, బాలరాజేశ్వర, భీమేశ్వర తదితర శివలింగాలు పాండవులు ప్రతిష్ఠించినవిగా చెబుతారు.
t3
**వైభవంగా జాతర
మహాశివరాత్రి సందర్భంగా మాఘ బహుళ త్రయోదశి నుంచి రాజన్న జాతర మొదలవుతుంది. మూడురోజుల పాటు వైభవంగా జరుగుతుంది. శివరాత్రి సందర్భంగా సాయంత్రం మహాలింగార్చన ఘనంగా నిర్వహిస్తారు. అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేస్తారు. ఈ సమయంలో స్వామివారిని దర్శించుకుంటే తమ జన్మ ధన్యమైనట్లుగా భావిస్తారు. రాజన్న జాతరకు ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. దాదాపు నాలుగు లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. 41 రోజులపాటు శివదీక్షలో ఉన్న భక్తులు శివరాత్రి నాడు వేములవాడ క్షేత్రంలో దీక్ష విరమణ చేస్తారు.