Devotional

శ్రీశైల మల్లన్నకు పట్టు వస్త్రాలు.. సమర్పించిన దేవస్థానాలు.- TNI ఆధ్యాత్మిక వార్తలు

శ్రీశైల మల్లన్నకు పట్టు వస్త్రాలు.. సమర్పించిన దేవస్థానాలు.- TNI ఆధ్యాత్మిక వార్తలు

* ద్వాదశ లింగాల్లో ఒకటైన శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని కాణిపాకం, విజయవాడ దేవస్థానాల తరుపునుంచి పట్టువస్త్రాలను స్వామి అమ్మవార్లకు సమర్పించారు. ద్వాదశ లింగాల్లో ఒకటైన శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం తరఫున చైర్మన్ మోహన్ రెడ్డి, సభ్యులు రామసుబ్బమ్మ, ఈవో వెంకటేష్ పట్టు వస్త్రాలు తీసుకొచ్చి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లకు సమర్పించారు.శ్రీశైల మల్లన్నకు పట్టు వస్త్రాలు.. సమర్పించిన దేవస్థానాలు…విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం తరఫున ఈవో భ్రమరాంబ స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. వారికి శ్రీశైల దేవస్థానం ఈవో లవన్న, అర్చకులు సాదర స్వాగతం పలికారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వేద ఆశీర్వచనం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు

1. మార్చి 4న యాదాద్రికి అఖండ జ్యోతి
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మార్చి 4న స్వామివారి అఖండజ్యోతి యాదగిరిగుట్టకు రానున్నట్లు అఖండ జ్యోతి యాత్ర చైర్మన్‌ ఎం.ఎస్‌.నాగరాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వామివారి అఖండజ్యోతి ఉత్సవ విగ్రహాలు హైదరాబాద్‌లోని ధూల్‌పేటలో గణేశ్‌ అనే కళాకారుడు తయారు చేస్తున్నారని చెప్పారు. ఈనెల 28న సాయంత్రం అఖండ జ్యోతి పూజ జరుగుతుందని, అదే రోజు రాత్రి బర్కత్‌పురాలోని యాదగిరి భవన్‌కు యాత్ర చేరుకుంటుందని వెల్లడించారు.మార్చి 1న ఉదయం 10 గంటలకు బర్కత్‌పురా చౌరస్తాలోని యాదగిరి భవన్‌ నుంచి అఖండజ్యోతి యాత్ర ప్రారంభమై అదే రోజు రాత్రి ఉప్పల్‌ చౌరస్తాకు చేరుకుంటుందని తెలిపారు. 2న ఉప్పల్‌ నుంచి బయల్దేరి రాత్రి ఘట్‌కేసర్‌ కేఎల్‌ఆర్‌ గార్డెన్‌కు, 3న ఉదయం ఘట్‌కేసర్‌ నుంచి బయల్దేరి రాత్రి భువనగిరిలోని నల్లగొండ క్రాస్‌రోడ్‌కు వస్తుందన్నారు. అక్కడ రాత్రి బస చేసి 4న ఉదయం భువనగిరి నుంచి బయల్దేరి రాత్రి యాదగిరిగుట్ట చేరుకుంటుందని వివరించారు. యాదాద్రిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ అధికారులకు అఖండ జ్యోతిని అప్పగిస్తామని పేర్కొన్నారు.

2. గజ వాహనంపై వెంకన్న దర్శనం
శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను ఆరో రోజైన శుక్రవారం ఏకాంతంగా నిర్వహించారు. ఉదయం కోదండరామస్వామిగా హనుమంతు వాహనంపై.. రాత్రి అభయమూర్తిగా గజ వాహనంపై స్వామివారు ఆశీనులై భక్తులకు దర్శనమిచ్చారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆలయ ప్రాగణంలోని కల్యాణ మండపంలో ఉత్సవర్లకు వసంతోత్సవం నిర్వహించారు. సాయంత్రం 4.20 గంటలకు స్వర్ణ రథానికి బదులు ఆలయ ఆవరణలో బంగారు తిరుచ్చి ఉత్సవం జరిగింది. ఆయా కార్యక్రమాల్లో డిప్యూటీ ఈవో శాంతి, కంకణభట్టర్ శేషాద్రిచార్యులు, ఏఈవో గురుమూర్తి, అర్చకులు బాలాజిరంగాచార్యులు, పార్థసారధి, నారాయణాచార్యులు, సూపరింటెండెంట్లు ముని చెంగ్రాయులు, రమణయ్య, ఆలయ, ఆర్జితం ఇన్స్పెక్టర్లు శ్రీనివాసులు, యోగానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

3. తిరుమలలో శని, ఆదివారాల్లోనూ వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
సామాన్య భక్తులకు తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనంలో మరింత ప్రాధాన్యం ఇచ్చేలా శని, ఆదివారాల్లో కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్టు టీటీడీ తెలిపింది. శుక్రవారం వారాంతపు సేవైన అభిషేకం జరిగే క్రమంలో ఇప్పటికే ఆ రోజు వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే గురువారం సిఫారసు లేఖలను టీటీడీ స్వీకరించడం లేదు. కాగా, కరోనా తర్వాత శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో శని, ఆదివారాల్లో కూడా బ్రేక్ దర్శనాలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.

4. మయూర వాహనంపై మల్లన్న
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీశైలంలో నాలుగో రోజు శుక్రవారం భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు మయూర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చాడు. కాణిపాకం, విజయవాడ ఇంద్రకీలాద్రి, టీటీడీ తరపున భ్రమరాంబ, మల్లికార్జుస్వామికి పట్టువస్త్రాలను సమర్పించారు.

5. 1 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
*జూబ్లీహిల్స్ వేంకటేశ్వరుడి ఆలయంలో నిర్వహణ మార్చి 9న ముగింపు
జూబ్లీహిల్స్లోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో మార్చి 1నుంచి 9వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ ప్రజా సంబంధాల అధికారి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28న సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. తొమ్మిది రోజుల పాటు ఉదయం 8 నుంచి 9గంటల వరకు, సాయంత్రం 8 నుంచి 9గంటల వరకు వివిధ వాహన సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

6. సోమస్కందమూర్తిగా దర్శనమిచ్చిన తిరుమలేశుడు..
తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు శ్రీనివాసుడు శ‌నివారం ఉదయం శ్రీ సోమస్కంధమూర్తి అవతరంలో భక్తులకు దర్శనం ఇచ్చాడు. కొవిడ్‌ నిబంధ‌న‌ల మేర‌కు వాహ‌న సేవ‌లు ఆల‌యంలో ఏకాంతంగా కొనసాగుతున్నాయి.వాహ‌న సేవ‌లో ఆలయ డిప్యూటీ ఈవో సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ రెడ్డిశేఖ‌ర్‌, ఆల‌య అర్చకులు పాల్గొన్నారు.

7.వేములవాడ రాజన్నను దర్శించుకున్న విజయశాంతి
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని మాజీ ఎంపీ, బీజేపీ నేత విజయశాంతి శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి విజయశాంతి ప్రత్యేక పూజలు చేశారు. రాజన్న ఆలయానికి ఏటా ఇస్తానన్న వంద కోట్ల నిధుల హామీపై బీజేపీ దీక్షకు శ్రీకారం చుట్టింది. స్వామి దర్శనం అనంతరం విజయశాంతి దీక్షలో పాల్గొన్నారు.