DailyDose

అక్కడ చర్చలు ప్రారంభం.. ఇక్కడ రష్యా సైన్యానికి కీలక సూచనలు..

అక్కడ చర్చలు ప్రారంభం.. ఇక్కడ రష్యా సైన్యానికి కీలక సూచనలు..

బెలారస్‌ వేదికగా ఉక్రెయిన్‌-రష్యా బృందాల మధ్య శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. సోమవారం మధ్యాహ్నం నుంచి ఇరు దేశాల విదేశాంగ శాఖ అధికారుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్‌.. రష్యా తక్షణమే యుద్ధం విరమించుకోవాలని డిమాండ్‌ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు నాటోలో ఉక్రెయిన్‌ చేరబోమని లిఖితపూర్వక హామీ ఇ‍వ్వాలని రష్యా కోరుతున్నట్టు సమాచారం. 

అంతకు ముందు రష్యా బలగాలను ఉద్దేశించి ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ మాట్లాడుతూ.. మీ ప్రాణాలు కాపాడుకోండి.. ఉక్రెయిన్‌కు వదిలి వెళ్లిపోండి అంటూ వారిని విజ్ఞప్తి చేశారు. తమ దేశ రక్షణ కోసం ప్రతీ పౌరుడు ఓ యోధుడిలో పోరాడుతున్నారని ప్రశంసించారు. ఈ యుద్ధంలో 4,500 మంది రష్యా సైనికులు మృతి చెందినట్టు జెలెన్‌ స్కీ వెల్లడించారు. మరోవైపు కీవ్‌లో పరిస్థితులు కంట్రోల్‌లోనే ఉన్నట్టు ఉక్రెయిన్ ఆర్మీ ఓ ప్రకటనలో పేర్కొంది. 
ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌లో రష్యా దాడులతో మృత్యుల సంఖ్య పెరుగుతోంది. ఈ దాడుల్లో మొత్తం 102 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్యసమితి (UN) సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.