Devotional

మార్చి నెల‌లో శ్రీ‌వారి ఆల‌యంలో విశేష ఉత్సవాలు ఇవే! – TNI ఆధ్యాత్మిక వార్తలు

మార్చి నెల‌లో శ్రీ‌వారి ఆల‌యంలో విశేష ఉత్సవాలు ఇవే! – TNI ఆధ్యాత్మిక  వార్తలు

1.పవిత్ర పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో వచ్చే నెలలో విశిష్ట ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఆలయ అధికారులు వెల్లడించారు. మార్చి 1న మ‌హాశివ‌రాత్రి ఉత్సవాలు, మార్చి 13 నుంచి 17వ తేదీ వ‌రకు శ్రీ‌వారి వార్షిక తెప్పోత్సవాలను, మార్చి 18న శ్రీ ల‌క్ష్మీ జ‌యంతి, శ్రీ తుంబురు తీర్థ ముక్కోటిని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మార్చి 29న శ్రీ అన్నమాచార్య వర్ధంతిని జరుపుతామని వివరించారు.కాగా నిన్న శ్రీవారిని 68,095వేల మంది భక్తులు దర్శించుకోగా 29,050వేల మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించుకున్నారన్నారు. నిన్న స్వామివారి హుండీకి రూ.3కోట్ల 94లక్షల ఆదాయం వచ్చిందని వివరించారు.

2.ఘనంగా ముగిసిన శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలు
శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా చివరి రోజైన సోమ‌వారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. కరోనా నిబంధ‌న‌ల నేపథ్యంలో ఆల‌యంలో ప‌విత్ర జ‌లం నింపిన గంగాళంలో ఏకాంతంగా ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ముందుగా ఆల‌య అర్చ‌కులు శ్రీ బాలాజి రంగాచార్యులు ఆధ్వ‌ర్యంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించారు.
అనంత‌రం చ‌క్ర‌స్నానం జ‌రిగింది. ఇందులో విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమోక్తంగా స్నపనం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉపనిషత్తులు, దశశాంతి మంత్రాలు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రాలు, అభిషేక సమయంలో అనుసంధానం చేసే వేదాలను వేదపారాయణదారులు పారాయణం చేశారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్ప మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. రాత్రి 7 నుంచి 8 గంట‌ల‌ వరకు నిర్వహించే ధ్వ‌జావ‌రోహ‌ణంతో బ్ర‌హ్మోత్స‌వాలు ముగుస్తాయి. ఈ కార్యక్రమంలో జెఈవో వీర‌బ్ర‌హ్మం దంప‌తులు, డీఎఫ్ వో శ్రీనివాసులు రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, ఏఈవో గురుమూర్తి, సూపరింటెండెంట్ చెంగల్రాయలు పాల్గొన్నారు.

3.శివరాత్రి వేడుకలకు ముస్తాబైన కోటప్పకొండ
గుంటూరులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కోటప్పకొండ.. మార్చి 1న జరిగే శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. వేలాదిమంది భక్తులు తరలివచ్చే ప్రతిష్ఠాత్మక తిరునాళ్ల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తికావొచ్చాయి. ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదాన్ని పంచేలా.. కోటప్పకొండను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.శివరాత్రి వేడుకలకు ముస్తాబైన కోటప్పకొండశైవక్షేత్రాల్లో గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం కోటప్పకొండ త్రికోటేశ్వరాలయానిది ప్రత్యేకస్థానం. ఇక్కడ శివయ్య.. త్రికోటేశ్వరునిగా దర్శనమిస్తాడు. త్రికూఠాధిపతులుగా చెప్పుకునే 3 కొండల మధ్య శివుడు వెలిసినట్లు భక్తుల విశ్వాసం. ఈశ్వరుడు కైలాసాన్ని విడిచి.. ఈ కొండపైనే తపస్సు చేశాడని స్థలపురాణం చెబుతోంది. ఈ కొండలపైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తపస్సు చేశారని భక్తుల నమ్మకం. 3 కొండలపై త్రిమూర్తుల విగ్రహాలను అందంగా ఏర్పాటు చేశారు. దిగువ సన్నిధిలో వరసిద్ధి వినాయక దేవాలయం, కోటేశ్వరస్వామి ఆలయం, సోపాన మార్గాన భక్తురాలు ఆనందవల్లి ఆలయం, రుద్రశిఖరంపై పాత కోటేశ్వరస్వామి క్షేత్రం, విష్ణు శిఖరంపై పాప విమోచనేశ్వరస్వామి దేవాలయాలు ఉన్నాయి. ఎగువ సన్నిధిలో వినాయక విగ్రహం, మేధో దక్షిణమూర్తి ఆలయం, నాగేంద్రస్వామి పుట్ట, నవగ్రహ మండపం, సాలంకయ్య మండపం, శాంతి యాగశాల వంటి దర్శనీయ స్థలాలు భక్తులను కట్టిపడేస్తాయి.కోటప్పకొండ ఉత్సవాల్లో విద్యుత్ ప్రభలు ప్రత్యేకతను చాటుతాయి. రాష్ట్రంలో మరెక్కడా కన్పించని విధంగా 80 నుంచి 100 అడుగుల ఎత్తున భారీ విద్యుత్ ప్రభలు శివరాత్రి వేళ భక్తులకు కనువిందు చేస్తాయి. ఏటా శివరాత్రి ఉత్సవాలకు వివిధ జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు.కోటప్పకొండ ఆధ్యాత్మికంగానే కాదు… పర్యాటక, పర్యావరణ క్షేత్రంగానూ అభివృద్ధి చెందింది. సహజ అందాలు మరో ఎత్తు. భక్తుల తాకిడి దృష్ట్యా.. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. నరసరావుపేట, చిలకలూరిపేట నుంచి కోటప్పకొండకు వెళ్లే రోడ్డుమార్గాలను వెడల్పు చేశారు.
శివరాత్రి ఉత్సవాల సందర్భంగా కొండ మీదకు ఆర్టీసీ బస్సులు తప్ప ఎలాంటి వాహనాలను అనుమతించడం లేదు. ఆర్టీసీ 490 బస్సులను ఏర్పాటు చేసింది. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

4.శివరాత్రికి ఎములాడ సిద్ధం
పేదల దేవుడిగా పేరుగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎములాడ రాజన్న ఆలయం శివరాత్రి శోభ సంతరించుకుంది. దక్షిణ కాశీగా వెలుగొందుతున్న ఈ క్షేత్రంలో సోమవారం నుంచి మార్చి రెండవ తేదీ వరకు మహాశివరాత్రి మహోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. జాతరకు రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి రెండు లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.భక్తులకు ఇబ్బంది లేకుండా రూ. 2 కోట్లతో ఏర్పాట్లు చేస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆలయాన్ని ఇప్పటికే రంగురంగుల విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. వేములవాడకు చేరుకునే 5 ప్రధాన రహదారుల్లో భక్తులకు స్వాగతం పలికేలా భారీ స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు.
*రాజన్న చెంతకు చేరుకోండిలా..
రాజధాని హైదరాబాద్‌కు 150 కిలోమీటర్లు.. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కేంద్రానికి 32 కిలోమీటర్ల దూరంలో వేములవాడ ఉంది. స్వామివారి సన్నిధికి చేరుకోవాలంటే రోడ్డు మార్గం ఒక్కటే. సికింద్రాబాద్‌ జూబ్లీ బస్టాండ్‌ నుంచి ప్రతి అరగంటకో బస్సు, కరీంనగర్‌ నుంచి ప్రతి 10 నిమిషాలకో బస్సు సౌకర్యం ఉంది. హైదరాబాద్‌ నుంచి వచ్చేవారు సిద్దిపేట మీదుగా.. వరంగల్‌ నుంచి వచ్చేవారు కరీంనగర్‌ మీదుగా వేములవాడ చేరుకోవచ్చు.
*మహాశివరాత్రి సందర్భంగా గుడి చెరువుకట్ట కింద ప్రత్యేక బస్టాండ్‌ ఏర్పాటు చేశారు. దాదాపు 770 ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచుతున్నారు. భక్తులకు ప్రసాదాలు అందించేందుకు ధర్మగుండం పక్కనే ఉన్న ప్రసాదాల కౌంటర్, దేవస్థానం దక్షిణ ద్వారం వద్ద, పూర్వపు ఆంధ్రాబ్యాంకులో కౌంటర్‌ ఏర్పాటు చేశారు. లడ్డూ రూ.20, పులిహోర ప్యాకెట్‌ రూ.15 చొప్పున విక్రయిస్తారు.
**రాజన్న జాతర పూజలు
మహాశివరాత్రి సందర్భంగా నిరంతర దర్శనాలు అందుబాటులో ఉంటాయి. ధర్మ దర్శనం, రూ.50తో స్పెషల్‌ దర్శనం, రూ.100తో శీఘ్రదర్శనం చేసుకోవచ్చు. రూ.100తో కోడె మొక్కులు, రూ.200తో స్పెషల్‌ కోడె మొక్కులు తీర్చుకోవచ్చు. మార్చి ఒకటిన ఉదయం 7 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం పక్షాన అక్కడి అర్చకుల ప్రత్యేక బృందం, 8 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ప్రభుత్వ ప్రతినిధిగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు శివస్వాములకు, 6 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు అద్దాల మంటపంలో మహాలింగార్చన, రాత్రి 11.35 గంటల నుంచి వేకువజాము 3.30 గంటల వరకు లింగోద్భవ సమయంలో స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం పూజలు (ఈ సమయంలో భక్తుల దర్శనాలకు అనుమతిస్తారు) నిర్వహిస్తారు. జాతరకు 1,600 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు

5. రావణ వాహనంపై మల్లన్న
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు శనివారం శ్రీశైలంలో భ్రమరాంబ సమేత మల్లికార్జునడు రావణ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చాడు. ముందుగా అక్కమహాదేవి అలంకార మండపంలో ఉత్సవమూర్తులను సుగంధ పరిమళ పుష్పాలతో ముస్తాబైన రావణ వాహనంపై అధిష్టింపజేశారు. పూజల అనంతరం ఉత్సవమూర్తులను ఆలయ రాజగోపురం నుంచి వెలుపలకి తీసుకువచ్చి క్షేత్రవీధుల్లో గ్రామోత్సవం జరిపారు. దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ప్రభుత్వం తరపున స్వామిఅమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. బ్రహ్మోత్సవాల ఆరో రోజు ఆదివారం సాయంత్రం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారికి పుష్పపల్లకి సేవ, గ్రామోత్సవం నిర్వహించనున్నారు

6. ఆ మూడు రోజులూ వారికి అనుమతి లేదు
సామాన్య భక్తులకు టీటీడీ అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. ఇకపై గురు, శుక్ర, శనివారాల్లో సిఫార్సు లేఖలు కలిగిన భక్తులను అలిపిరి తనిఖీ కేంద్రంలోనే గుర్తించి కొండపైకి అనుమతించబోమని టీటీడీ సీవీఎస్వో గోపీనాథ్జెట్టి స్పష్టం చేశారు. శనివారం ఆయన తిరుపతిలోని అలిపిరి, తిరుమలలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. టీటీడీ నిఘా, భద్రతా అధికారులకు, ఇతర శాఖల అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు.శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు దళారులను నమ్మవద్దని, దళారులెవరైనా ప్రలోభాలకు గురి చేస్తే టీటీడీ భద్రత, నిఘా అధికారులకు తెలియజేయాలని కోరారు. శ్రీవారి దర్శన టికెట్లను పెంచిన నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని టీటీడీ అధికారులకు సూచించారు. తిరుమలలో సూచిక బోర్డులు ఏర్పాటు చేయడంతోపాటు ట్రాఫిక్ నియంత్రణకు పార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలను తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు.

7.జాతరలో అశ్లీల నృత్యాలు.. అడ్డుకున్న పోలీసులు
అనంతగిరి మండలంలోని అమీనాబాద్ గ్రామంలో గంగమ్మ జాతరలో అశ్లీల డ్యాన్స్లు ప్రదర్శించారు. ప్రతీ ఏడాది గ్రామంలో వైభవంగా నిర్వహించే గంగమ్మ జాతర సందర్భంగా ‘సంగీత విభావరి’ పేరుతో ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అశ్లీల డ్యాన్స్లు ప్రదర్శించారు. అనాథాశ్రం ప్లెక్సీలు ఉన్న వాహనంపై కళాకారులు అశ్లీల నృత్యాలు చేశారు. ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే ఈ అశ్లీల డ్యాన్స్ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు సమాచారం. అయితే సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని అశ్లీల నృత్యాలను ఆపివేయించి జన సమూహాన్ని చెదరగొట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జాతరలో అర్ధనగ్న ప్రదర్శన ఏర్పాటు చేయడం చర్చాంశనీయంగా మారింది. విషయమై సర్పంచ్ ముత్తినేని కోటేశ్వరరావును వివరణ కోరాగా, సంగీత విభావరిని స్థానిక ఎమ్మెల్యేనే ప్రారం భించారని, ఇలాంటివి జాతరలోనే ఆహ్లాదకరంగా ఉంటాయని సర్పంచ్ ముత్తినేని కోటేశ్వరరావు సమర్థించుకున్నారు.

8. పుష్పపల్లకిపై ఆది దంపతుల విహారం
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆరో రోజు ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు భారీగా తరలి వచ్చారు. పుష్ప ప్రియుడు మల్లన్న భ్రామరీతో కలసి పల్లకిలో విహరించాడు. బ్రహ్మోత్సవాల ఏడో రోజు సోమవారం రాత్రి భ్రమరాంబ మల్లికార్జున స్వామివారికి గజ వాహన సేవ, గ్రామోత్సవం నిర్వహిస్తారు.

9. ఘనంగా పుష్పయాగం
కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తాడిగడపలోని.. శ్రీలక్ష్మి వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో.. పుష్పయాగం ఘనంగా జరిగింది. 18 రకాల పుష్పాలు, 108 పూల బుట్టలతో.. తిరుమల శ్రీనివాసుని సన్నిధిలో నిర్వహించినట్లుగానే ఈ పుష్పయాగం వైభవంగా జరిపించారు.కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తాడిగడపలోని… శ్రీలక్ష్మి వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో.. పుష్పయాగం ఘనంగా జరిగింది. 18 రకాల పుష్పాలు, 108 పూల బుట్టలతో.. తిరుమల శ్రీనివాసుని సన్నిధిలో నిర్వహించినట్లుగానే ఈ పుష్పయాగం వైభవంగా జరిపించారు. తాడిగడప కూడలి నుంచి పుష్పాల బుట్టలతో గ్రామోత్సవం నిర్వహించారు. కోలాటాల ప్రదర్శన నడుమ స్వామి వారి పుష్పాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. పుష్పాల అభిమంత్రణ అనంతరం యాగం కన్నులపండువగా జరిపారు

10. సర్వభూపాల వాహ‌నంపై శ్రీదేవి, భూదేవి స‌మేత కళ్యాణ శ్రీనివాసుడు
శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు ఆదివారం స్వామి వారు ఉభయ దేవేరులతో కలిసి భక్తులకు దర్శనమిచ్చారు. రథోత్సవానికి బదులుగా సర్వభూపాల వాహనంపై ఉదయం 7.35 నుంచి 8.30 గంటల వ‌ర‌కు స్వామివారు ఉభయదేవేరులతో కలిసి విహరించారు. కొవిడ్ నిబంధ‌న‌ల కారణంగా స్వామి వారి వాహ‌న సేవ‌ల‌ను ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హిస్తున్నారు.సర్వభూపాల అంటే రాజుల‌కు రాజు అని అర్థం. ఈ ప్ర‌పంచాన్ని మొత్తం పాలించే రాజు తానేనని భ‌క్త లోకానికి చాటి చెప్తూ స్వామివారు ఈ వాహ‌నాన్ని అధిష్టించారు. ఇలాఉండగా, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు అశ్వ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉదయం వాహ‌న సేవ‌లో జేఈఓ వీర‌బ్ర‌హ్మం దంప‌తులు, ఆలయ డిప్యూటీ ఈఓ శ్రీమతి శాంతి, ఏఈఓ గురుమూర్తి, సూపరింటెండెంట్లు చెంగ‌ల్రాయులు, రమణయ్య, ఆలయ అర్చకులు బాలాజీ రంగ‌చార్యులు, తదితరులు పాల్గొన్నారు.

11.శివన్నాస్మరణతో మార్మోగిన శ్రీగిరులు
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీగిరులపై ఘనంగా జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారలను దర్శించుకునేందుకు తరలివచ్చిన వారితో ఆలయ పరిసరాలు, దారులన్నీ కిటకిటలాడాయి. వేకువ జాము నుంచే భక్తులు పాతాళగంగలో స్నానాలు చేసి క్యూలైన్లలో బారులు తీరారు. శివన్నామస్మరణ చేస్తూ మల్లికార్జునుడి దర్శించుకున్నారు. ఆ తర్వాత భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేశామని ఈవో లవన్న తెలిపారు. ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు పొందిన భక్తులు, ప్రత్యేక కంకణాలతో కాలినడకతో వచ్చే వారికి, దీక్షాపరులకు ప్రత్యేక కూలైన్ల ద్వారా దర్శనాలు కల్పిస్తున్నట్లు చెప్పారు.

12. అప్పన్నను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తులు
సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామిని ఆదివారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు ఏవీ శేషసాయి, చీమలపాటి రవికుమార్‌ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన వీరికి దేవస్థానం ఈవో ఎంవీ సూర్యకళ స్వాగతం పలికారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని బేడా మండప ప్రదక్షిణ చేశాక న్యాయమూర్తుల గోత్రనామాలతో అంతరాలయంలో అర్చకులు పూజ చేసి శేషవస్త్రాలను పర్యవేట్టంగా చుట్టారు. గోదాదేవి అమ్మవారి దర్శనానంతరం పండితులు ఆశీర్వదించగా, ఈవో స్వామివారి ప్రసాదాలను అందజేశారు.

13. తిరుమల వెళ్లే భక్తులకు ఉచిత వాహన సేవలు
తిరుపతి వెంకటేశ్వరస్వామి ని గంటలో భక్తులు దర్శించు కొనేలా ఉచిత వాహన సేవలు ప్రారంభమ య్యాయి. ఈ విషయమై టీటీడీ ట్రస్ట్‌బోర్డు సభ్యు డు, ఆనైకట్టు ఎమ్మెల్యే నందకుమార్‌ మాట్లా డుతూ, టీటీడీ ట్రస్టీ సభ్యునిగా ఎంపికైన తాను, స్వామి దర్శనానికి వెళ్లే భక్తుల సౌకర్యార్ధం తన సొంత ఖర్చుతో వాహనం ఏర్పాటు చేశా నన్నారు. వారం లో ఆరు రోజులు ఈ వాహనాన్ని భక్తులు వినియో గించు కోవచ్చని, 12 సీట్ల సామ ర్ధ్యం కలిగిన ఈ వాహనం వచ్చే మంగళ వారం ఉదయం 7.30 గంటలకు డీఎంకే జిల్లా కార్యా లయం నుంచి బయల్దేరు తుందని తెలిపారు. స్వామి దర్శనం అనంతరం తిరిగి సాయంత్రం 5 గంట లకు వేలూరు చేరుకుంటుందన్నారు. తిరుమలలో రూ.300 టిక్కె ట్టుపై గంటలోపు స్వామి దర్శనంతో పాటు, అన్నదాన భవనంలో మధ్యాహ్న భోజన వసతి కల్పించామని తెలి పారు. ఈ యాత్రకు వెళ్లగోరు భక్తులు డీఎంకే జిల్లా కార్యాలంయలో ఆధార్‌ నెంబరుతో తమ పేర్లను ముందుగానే నమోదుచేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. అనంతరం పళ్లికొండ రంగనాథ పెరుమాళ్‌ ఆలయం నుంచి తిరుమల శ్రీవారిని దర్శించుకు నేందుకు మొదటి వాహన సేవలను ఎమ్మెల్యే ప్రారంభించారు

14. దైవం ‘నైవేద్య’ రూపేణా..
నిర్మలమైన నీలాకాశానికి మబ్బుతునకలు చుట్టపు చూపుగా వచ్చే వేళ.. నెర్రెలిచ్చిన నేలకు నింగి నుంచి మేఘ సందేశం అందే వేళ.. ఆ ఊరిలో టకోరం మోగుతుంది. సన్నాయికి జతగా డోలు లయబద్ధంగా ఉరుముతుంది. పడతుల చేతుల్లో కడవలు, ఆ కడవల్లో పసుపు నీరు ఎదురు చూస్తూ ఉండగా.. ఆ సందడిలో అమ్మ ఊరేగింపు మొదలవుతుంది. అనంతమైన ఆకాశాన్ని చూస్తూ అందమైన గజముద్ద ముత్తైదువుల నెత్తిపై అమ్మవారి ప్రతి రూపంగా కొలువై ఉంటుంది. ముత్తైదువుల పాదాలను పసుపు నీళ్లు తాకుతూ ఉంటే తల్లి ఊరేగింపు కన్నుల పండువగా సాగుతుంది. ఊరుఊరికీ అమ్మ పేరు మారినా ఉత్తరాంధ్రలో జాతర జరిగే తీరు మాత్రం ఇదే. ఉత్సవంలో ఊరేగింపు.. ఆనక ఆరగింపు ఇక్కడి ప్రత్యేకత. ఇంకాస్త లోతుల్లోకి వెళితే..
** ఫిబ్రవరి నుంచి జూలై వరకు.. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం నుంచి ఒడిశా ఆంధ్రా సరిహద్దు గ్రామాల్లో చల్లదనం ఉత్సవాలు మొదలవుతాయి. గ్రామదేవతలను ఇష్టంగా అర్చించుకుని సంబరం జరుపుకునే సంప్రదాయాలు కనిపిస్తుంటాయి. వందల ఏళ్లుగా జరుగుతున్న ఈ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణ అమ్మవారు.. అవును అచ్చంగా అమ్మవారే. నైవేద్యాన్ని దేవత రూపంలో కొలిచే అపురూప సంస్కృతి ఈ పల్లెలు మనకు పరిచయం చేస్తాయి. నెయ్యిలు లేదా పేలాలుగా పిలిచే ఆహార పదార్థంతో అమ్మవారి రూపాన్ని తయారు చేసి ఉత్సవ విగ్రహంలా పూజించి ఉత్సవం అయ్యాక ప్రసాదంలా ఆరగించే విశిష్టమైన పద్ధతి సిక్కోలు పల్లెల సొంతం.
**ఊరి అమ్మోరికి..
ప్రతి పల్లెను ఓ అమ్మవారి అంశ కాపాడుతూ ఉంటుందని స్థానికుల నమ్మిక. కాళీమాత, చింతామణి, భూలోకమాత, బాలామణి, అసిరిపోలమ్మ, నూకాలమ్మ, ధనరాజులమ్మ, స్వేచ్ఛావతి వంటి పేర్లతో గ్రామ దేవతలను పూజించుకుని ఏటా సంబరం చేస్తారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రతి రూపంగా నెయ్యిలతో తయారు చేసిన ‘గజముద్ద’ను పుష్పాలు, బంగారం, కరెన్సీ నోట్లతో అందంగా, ప్రత్యేకంగా అలంకరించి మేళతాళాలతో ఊరేగిస్తారు.
**పాకంతో పసందు
ధాన్యం నుంచి సేకరించిన పేలాలతో తయారు చేసే ఈ పదార్థం రుచి చెప్పనలవి కానిది. ముందుగా కట్టెల పొయ్యిపై పెద్ద కళాయిని వేడి చేసి అందులో నీటిని వేడి చేస్తారు. అందులో పంచదార లేక బెల్లంను వేసి పాకం రూపం ఎర్రగా వచ్చే వరకు వేడి చేస్తారు. అనంతరం సమకూర్చిన పేలాలను పాకంలో వేసి ప్రత్యేకంగా తయారు చేసిన తెడ్డు(గరిటె)తో జిగురుగా వచ్చే వరకు కలుపుతారు. పొయ్యిపై నుంచి కిందకు దించి వేడిగా ఉన్న పాకం ముద్దను చేతులకు మంచి నూనెను పూసుకొని వివిధ ఆకృతుల్లో గజముద్దను తయారు చేస్తారు. అచ్చం అమ్మవారి పోలికల్లో నేత్రాలు, చేతులు, హారం, కిరీటాన్ని తయారు చేస్తారు. ఇందులో బెల్లంతో తయారుచేసే ప్రతిమల ధర ఎక్కువ. పాకం పక్కాగా ఉంటే నెల వరకు ఇది నిల్వ ఉంటుంది. నైవేద్యం సులువుగా జీర్ణమయ్యేందుకు అందులో నిమ్మ, జీలకర్ర, వాము వంటి పోపులను వేస్తుంటారు. సైజును బట్టీ చక్కెరతో తయారు చేసిన గజముద్దలు రూ.1,000 నుంచి రూ.6వేల వరకు ధర పలికితే, బెల్లంతో తయారు చేసిన గజముద్ద రూ.2వేల నుంచి రూ.8వేల వరకు పలుకుతుంది.
**గజముద్దలకు కేరాఫ్‌ ఉద్దానం
నెయ్యిలతో ప్రత్యేకంగా తయారు చేసే గజముద్ద ప్రసాదానికి కేరాఫ్‌ ఉద్దానం. ఇక్కడి పల్లెల్లో వీటిని అధికంగా తయారు చేస్తారు. గ్రామాల్లో చిన్నపాటి హొటళ్లు నడిపే గుడియాలు ఈ గజముద్దలను తయారుచేస్తారు.

15. మనోహరం.. మహిమాన్వితం
సర్వజనులకు శుభాలనిచ్చేవాడు శుభంకరుడైన శివుడు. దేవతలకూ దేవుడై మహాదేవుడయ్యాడు. క్షీరసాగర మధనంలో విషాన్ని తన గళంలో నిలిపిన శివుడు నిద్రిస్తే విషం ఒళ్లంతా వ్యాపిస్తుందని దేవతలు ఐదు జాముల పాటు ఆడిపాడి, శివుణ్ని మేల్కొనేలా చేసిన రోజే శివరాత్రి. శివపార్వతుల కల్యాణం, శివలింగోద్భవం కూడా ఇదే రోజున జరిగినట్టు శాస్త్రం చెబుతోంది. శివరాత్రి వేళ అభిషేకం, అర్చన, ఉపవాసం, జాగరణతో మంత్రాక్షరిని పఠిస్తే శివానుగ్రహం కలుగుతుందన్నది భక్తుల నమ్మకం. మార్చి 1న జరిగే శివరాత్రి పూజలకు విజయనగరం జిల్లాలోని శైవక్షేత్రాలన్నీ ముస్తాబవుతున్నాయి. మారేడుదళపతికి మనసారా అర్చనలు జరిపేందుకు భక్తలోకం సన్నద్ధమవుతోంది.
**భక్తసిరి ‘పుణ్య’గిరి
ఎస్‌.కోట పట్టణానికి కూతవేటు దూరంలో ఉంది పుణ్యగిరి. జలపాతాల నుంచి జాలువారే నీటి సవ్వడి, మర్కట మూకల సందడి, çపురాణాలతో ముడిపడి, ఉమాకోటిలింగేశ్వరుడు కొలువుదీరిన క్షేత్రం పుణ్యగిరి. విరాటరాజ్య రక్షకుడైన కీచకుడు కొలువుదీరిన శృంగారపుకోట కాలక్రమంలో శృంగవరపుకోటగా మారింది. సైరంధ్రి పేరుతో ఉన్న ద్రౌపదిని బలాత్కరించబోయి భీముని చేతిలో నిహతుడైన కీచకునికి ముక్తి ప్రసాదించమని సోదరి సుదేష్ణ కోరిక మేరకు ధర్మరాజు శివుని ప్రార్థించగా, శివుని శిరోపాయల నుంచి వెలువడిన ధార నేటికీ భూగర్భంనుంచి వస్తూ శివలింగాన్ని స్పృశిస్తుంది. అదే పుట్టుధార, శివధారగా వాసికెక్కింది.
*కొండ శిలకు అంటిపెట్టుకుని భూమికి అథోముఖంగా ఉన్న లింగాల నుంచి నీటి బిందువులు పడుతుంటాయి. పూర్వం ఈ నీరంతా ఒకే చోట పడేందుకు గొడుగులు కట్టడంతో దీనిని గొడుగులధారగా భక్తులు పిలవనారంభించారు. కీచకుని అస్థికలను ఇక్కడే నిమజ్జనం చేశారని, ఇక్కడ అస్థినిమజ్జనం చేస్తే చనిపోయిన వారికి సద్గతులు కలుగుతాయన్న నమ్మకం ప్రబలంగా ఉంది. పుణ్యగిరిలో ఉమాకోటిలింగేశ్వరుడు, పుట్టుధార, పార్వతీదార, కోటిలింగాల రేవు, త్రినాథగుహ, ధారగంగమ్మలోయ, బూరెలగుట్ట వంటి స్థలాలు ఉన్నాయి. శివరాత్రి వేళలో రెండురోజుల పాటు జరిగే జాతరలో పుణ్యగిరికి పొరుగు జిల్లాలు, రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తుతారు.
**చరిత్రాత్మకమైన చాతుర్లింగేశ్వరాలయం
బలిజిపేట మండలంలోని నారాయణపురం గ్రామంలో ఉన్న చాతుర్లింగేశ్వర దేవాలయం అపురూప శిల్ప సంపద, రాతికట్టడాలకు నెలవు. 11వ శతాబ్దంలో ఆలయాన్ని నిర్మించారు. రాతి కట్టిన నీలకంఠేశ్వర, సంగమేశ్వర, మల్లికార్జున, శ్రీనీలేశ్వర ఆలయాలు ఒకే ప్రాంగణంలో ఉండడం ఇక్కడ ప్రత్యేకత. దేవాలయ స్తంభాలపై ఉండే శాసనాలు, ఆలయాలపై ఉండే చెక్కడాలు ఆనాటి చరిత్రకు ఆధారాలుగా నిలిచాయి. గళావళ్లి గ్రామంలో కామలింగేశ్వర ఆలయం 11వ శతాబ్దపు నిర్మాణశైలికి ప్రతీకగా నిలిచింది. తూర్పుగాంగరాజులలో అగ్రగణ్యుడైన అనంతవర్మ చోడగంగ (కీ.శ 1176–1174), కస్తూరీ కామోదినుల కుమారుడైన కామఖ్కవుని (కీ.శ 1147–1156) పేరున ఈ ఆలయం నిర్మించినట్టు శాసనాలు చెబుతున్నాయి.
Yadadri-22
16. యాదాద్రిలో భక్తుల కోలాహలం
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆదివారం భక్తుల కోలాహలం కన్పించింది. వారాంతం సెలవురోజు, ఏకాదశి పర్వదినం కావడంతో ఇష్టదైవాలను దర్శించుకుని, మొక్కులు చెల్లించుకునేందుకు అధికసంఖ్యలో భక్తులు యాదాద్రికి తరలివచ్చారు. దీంతో కొండపైన బాలాలయ పరిసరప్రాంతాలు, ఆర్జిత సేవా మండపాలు, తిరువీధుల్లో యాత్రాజనుల రద్దీ వాతావరణం నెలకొంది. బాలాలయంలో కొలువుదీరిన కవచమూర్తుల దర్శనానికి దర్శన క్యూలైన్లలో గంటలకొద్దీ నిరీక్షించారు. స్వామివారి ధర్మదర్శనాలకు మూడు గంటలు, ప్రత్యేక దర్శనాలకు గంట సమయంపాటు నిరీక్షించినట్లు భక్తులు తెలిపారు. కొండకింద పాత గోశాలలోని వ్రత మండపంలో సత్యనారాయణస్వామి వ్రతపూజల్లో యాత్రికులు కుటుంబసమేతంగా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామికి వేకువజామునే సుప్రభాతంతో నిత్య పూజలు ఆరంభించిన ఆచార్యులు బాలాలయంలో ఉత్సవమూర్తులను అభిషేకించి తులసీదళాలతో అర్చించారు.

17. వేంకటేశ్వరస్వామికి బంగారు ఊయల
ద్వారకా తిరుమల వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి రూ.17లక్షలు విలువైన బంగారు తాపడంతో తయారు చేసిన పవళింపు సేవకు వినియోగించే ఊయలను హనుమాన్జంక్షన్కు చెందిన పారిశ్రామికవేత్త పర్వతనేని పాండురంగారావు శనివారం సమర్పించారు. గతంలోనూ స్వామికి బంగారు గొలుసు, నిత్యకల్యాణంలో వాడే దర్బారు కంపెనీ సింహా సనం అందించారు. దేవస్థానం అధికారులు, అర్చకులు స్వామి ఆశీర్వచనాలు అందజేశారు.

18. మార్చి 4 నుంచి యాదాద్రి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవములు మార్చి 4వ తేదీన ప్రారంభం కానున్నాయి. మార్చి 14 వ‌ర‌కు 11 రోజుల పాటు నవాహ్నిక దీక్షతో పాంచరాత్ర ఆగమ సిద్దాంతానుసారముగా, భగవద్రామానుజ సాంప్రదాయ సిద్దముగా బ్రహ్మోత్సవములు నిర్వహించుటకు ఏర్పాట్లు చేసిన‌ట్లు ఆలయ ఈవో ఎన్ గీత తెలిపారు.స్వామి బాలాలయం నందు 4వ తేదీన ఉదయం 10 గంట‌ల‌కు విష్వక్సేన ఆరాధన, స్వస్తివాచనము, రక్షాబంధనంతో బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభం కానున్నాయి. 14న‌ ఉదయం 10 గంట‌ల‌కు శ్రీ స్వామి వారి అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి 9 గంట‌ల‌కు శృంగార డోలోత్సవంతో బ్ర‌హ్మోత్స‌వాలు ముగియ‌నున్నాయి.మార్చి 11న ఉద‌యం 11 గంట‌ల‌కు బాలాల‌య‌ములో నిర్వ‌హించే శ్రీ స్వామి వారి తిరు క‌ళ్యాణ మ‌హోత్స‌వానికి రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పు, టీటీడీ త‌ర‌పున‌, పోచంప‌ల్లి చేనేత సంఘం త‌ర‌పున శ్రీ స్వామి, అమ్మ‌వార్ల‌కు ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించ‌నున్నారు. ఈ వేడుక‌లో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేల‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు పాల్గొనే అవ‌కాశం ఉంది.

19. కాళేశ్వరంలో మహాశివరాత్రి వేడుకలు ప్రారంభం
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని శ్రీ కాళేశ్వర- ముక్తీశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు ఉదయం 11 గంటల 20 నిమిషాలకు మంగళవాయిద్యాలతో దీపారాధన, గణపతి పూజ రక్షాబంధనం, దీక్ష గ్రహణం తదితర పూజలు చేసి మహా శివరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు. మహాశివరాత్రి ఉత్సవాలలో మొదటి రోజులో భాగంగా ఉదయం నుంచే భక్తులు గోదావరిలో స్నానం చేసి గోదావరి మాతకు ప్రత్యేక దీపాలు వెలిగించి కాళేశ్వర- ముక్తీశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు

20. శ్రీరామనవమికి గోటి తలంబ్రాలను తాయారు చేస్తున్న భక్తులు
శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణానికి గోటి తలంబ్రాలను భక్తులు సిద్ధం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్ కార్పొరేషన్ శివసాయినగర్‌కు చెందిన భక్తులు గోటి తలంబ్రాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. భద్రాచలంలో ఏప్రిల్ 10న నిర్వహించే సీతారాముల కల్యాణానికి ఈ గోటి తలంబ్రాలను పంపిస్తామని శ్రీ లక్ష్మి గణపతి ఆలయ పూజారి కృష్ణారావు చెప్పారు. భద్రాచలం నుంచి తెప్పించిన వడ్లతో గోటి తలంబ్రాలు తయారు చేశామని ఆలయ కమిటీ ప్రతినిధులు వివరించారు

21. శ్రీవారిని దర్శించుకున్న 56,559 మంది భక్తులు
దాదాపు రెండేళ్ల తర్వాత తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. కొవిడ్ ప్రభావం తగ్గుతున్న క్రమంలో టీటీడీ ఇటీవల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనంతో పాటు తిరుపతిలో ఆఫ్లైన్ ద్వారా ఇచ్చే టైంస్లాట్ సర్వదర్శనాల టోకెన్ల సంఖ్యను పెంచింది. రూ.300 దర్శన టికెట్లు 25 వేలు, సర్వదర్శన టోకెన్లు దాదాపు 30 వేలు ఇస్తుండంతో స్వామి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ పెరిగింది. పైగా శని, ఆదివారాలు కావడంతో శ్రీవారి ఆలయంతో పాటు క్యూకాంప్లెక్సులు, మాడవీధులు, అన్నదాన భవనం, అఖిలాండం, బస్టాండ్ వద్ద భక్తుల సందడి నెలకొంది. శుక్రవారం 56,559 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరిగిన క్రమంలో అలిపిరి చెక్ పాయింట్, అలిపిరి కాలినడక మార్గంలో భక్తులను అనుమతిస్తున్న సమయాన్ని పొడిగించింది.