Politics

అప్పుడే యుద్ధం మొదలు పెడతా!- TNI రాజకీయ వార్తలు

అప్పుడే యుద్ధం మొదలు పెడతా!- TNI రాజకీయ వార్తలు

*పవర్‌లో లేని తనను పవర్ స్టార్ అని పిలవొద్దు అని టాలీవుడ్ హీరో, జనసేనాని పవన్ కల్యాణ్ పలుమార్లు ఫ్యాన్స్‌ ను రిక్వెస్ట్ చేశారు. అయితే ఫ్యాన్స్ మాత్రం ఆయన్ను అలానే పిలిచేందుకు ఇష్టపడతారు. ఇటీవలే భీమ్లా నాయక్ మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు పవన్ కల్యాణ్. వరుసగా మూవీస్ అనౌన్స్ చేసిన పవన్.. ఆయా సినిమాల షూటింగ్స్‌తో బిజీగా గడుపుతున్నారు. మరోవైపు పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు కూడా సమయాన్ని కేటాయిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ఏపీ లో టికెట్ రేట్ల గురించి అటు పవన్ మద్దతుదారులకు, వైసీపీ నేతలకు మధ్య డైలాగ్ వార్ నడుస్తూనే ఉంది. ఈ క్రమంలోనే పవన్ ట్విట్టర్‌లో పెట్టిన పోస్ట్ చర్చనీయాంశమైంది. అందులో ఏదో రాస్తున్నట్లు కనిపిస్తున్నారు పవన్. ‘ఒక మార్పు కోసం యుద్ధం చేయాల్సి వస్తే.. తొంభై తొమ్మిది సార్లు శాంతియుతంగా ప్రయత్నిస్తాను, నూరనసారి మాత్రమే యుద్ధం చేస్తాను’ అన్న కొటేషన్ ఆ పోస్ట్‌ లో రాసి ఉంది.పవన్ ఎక్కువగా పుస్తకాలు చదువుతారన్న విషయం తెలిసిందే. పలు పుస్తకాలు తనను కదిలించిన సందర్భాలు ఉన్నాయని కూడా ఆయన పేర్కొన్నారు. గుంటూరు శేషేంద్ర శర్మ ప్రభావం పవన్‌లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన పుస్తకంలోని ‘నేనంతా పిడికెడు మట్టే కావొచ్చు.. కానీ తల ఎత్తితే దేశపు జెండాకి ఉన్నంత పొగరు ఉంది’ అన్న కొటేషన్‌ను జనసేనాని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. పవన్ స్పీచుల్లోనూ, ఆయన మాటల్లోనూ ఈ ధోరణే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. తాజాగా పవన్ పెట్టిన ట్విట్టర్‌ పోస్ట్‌లోని కొటేషన్‌ సైతం ఎంతో లోతైన అర్థాన్ని పంపుతుంది.

* పిరికిదాన్ని కాదు, ఫైటర్‌ని: మమతా బెనర్జీ
ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ అధికారం కోల్పోతోందని, దీనికి తనపై జరిగిన ఆ పార్టీ కార్యకర్తల దాడే సాక్ష్యమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ అన్నారు. సమాజ్‌వాదీ పార్టీకి మద్దతుగా ప్రచారం నిర్వహింంచేందుకు ఆమె బుధవారం వారణాసికి వచ్చారు. అయితే మమత రాకను వ్యతిరేకిస్తూ రైట్ వింగ్‌ గ్రూపులకు చెందిన కొంతమంది ఆందోళన నిర్వహించారు. మమతాను అడ్డుకునే ప్రయత్నం చేశారు

* మహిళా బంధు కేసీఆర్ పేరిట సంబురాలు: మంత్రి ఎర్రబెల్లి
తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కె.తారక రామారావు పిలుపు మేరకు ఈ నెల 6, 7, 8 తేదీలలో మహిళా బంధు కేసీఆర్ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు నిర్వహించాలని, అలాగే, తన పాలకుర్తి నియోజకవర్గంలో కూడా ఈ సంబురాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన అరుదైన, అద్భుతమైన సంక్షేమ, సంరక్షణ పథకాల అమలు నేపథ్యంలో మహిళా దినోత్సవ సంబురాలు ఘనంగా చేపట్టాలని పార్టీ ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులకు మంత్రి తెలిపారు.6వ తేదీన సంబురాల ప్రారంభం సందర్భంగా కేసిఆర్కి రాఖీ కట్టడం, పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లు, ఎఎన్ఎంలు, డాక్టర్లు, ప్రతిభ కలిగిన విద్యార్థినిలు, స్వయం సహాయక సంఘాల నాయకురాళ్లు తదితర మహిళలకు గౌరవపూర్వక సన్మానం చేయాలన్నారు

* రూ. 25 కోట్లతో నారాయణఖేడ్‌ పట్టణ అభివృద్ధి : ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి
పలు అభివృద్ధి పనుల నిమిత్తం నారాయణఖేడ్‌ మున్సిపాలిటీకి సీఎం కేసీఆర్‌ మంజూరు చేసిన రూ.25 కోట్ల నిధులతో నారాయణఖేడ్‌ పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే అవకాశం ఉందని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. మంజూరైన నిధులతో చేపట్టబోయే పనులను గుర్తించేందుకు గురువారం ఎమ్మెల్యే మున్సిపాలిటీ పరిధిలోని 1,2,3 వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. అవసరమైన చోట సీసీ రోడ్లు, మురికి కాల్వలు, నీటి సరఫరాను క్రమబద్ధీకరించడం, వీధి లైట్లు, తదితర అవసరాలు ఎమ్మెల్యే దృష్టికి వచ్చాయి.

*ఇంతకాలానికి అమరావతి రైతులకు న్యాయం జరిగింది:భాజపా
రాజధాని అంశంలో రాష్ట్ర హైకోర్టు తీర్పుపై భాజపా నేత విష్ణుకుమార్ రాజు స్వాగతించారు. అమరావతి రైతుల కృషికి అభినందనలు తెలిపారు. రాజధాని అంశంలో హైకోర్టు తీర్పుపై ఎంపీ పురందేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. అమరావతే రాజధానిగా ఉండాలని భాజపా తొలి నుంచి కోరుకుంటోందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి అన్నారు. అందుకు అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందని తెలిపారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుతోనైనా… రాజధాని వివాదాలకు ముగింపు పలకాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.

* వెంటనే అమరావతి నిర్మాణం చేపట్టాలి: తెదేపా
తెదేపా కేంద్ర పార్టీ కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన పొలిట్ బ్యూరో సమావేశం కొనసాగుతోంది. రాజధాని అమరావతిపై హైకోర్టు తీర్పుపై చర్చించిన పొలిట్ బ్యూరో.. హైకోర్టు తీర్పును స్వాగతించింది. హైకోర్టు తీర్పుననుసరించి వెంటనే రాజధాని నిర్మాణం చేపట్టాలని నేతలు డిమాండ్ చేశారు. రాజధాని అమరావతిపై హైకోర్టు తీర్పును తెదేపా పొలిట్ బ్యూరో స్వాగతించింది. తెదేపా కేంద్ర పార్టీ కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న పొలిట్ బ్యూరోలో హైకోర్టు తీర్పుపై స్పందించారు.జగన్ ఇప్పటికైనా మూడు రాజధానులు అనే మోసాన్ని కట్టిపెట్టాలని పొలిట్బ్యూరోలో నేతలు డిమాండ్ చేశారు. ‘ఒకే రాష్ట్రం – ఒకే రాజధాని’ అని ప్రకటించి వెంటనే అమరావతి నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. మూడు రాజధానులు పేరుతో ఇతర ప్రాంతాలను సీఎం మోసం చేశారని తెదేపా నేతలు ఆరోపించారు. కోర్టు తీర్పును స్వాగతిస్తూ.. రాజధాని నిర్మాణం ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ పోలిట్ బ్యూరో తీర్మానం చేసింది.

*అమరావతి రాజధానికి బీజేపీ కట్టుబడి ఉంది: Purandeshwari అమరావతి రాజధానిపై హైకోర్ట్ ఇచ్చిన తీర్పును బీజేపీ స్వాగతిస్తుందని కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి తెలిపారు. అమరావతి రాజధానికి బిజెపి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అమరావతే రాజధానిగా వేల కోట్ల రూపాయలను కేంద్రం నిధులు కేటాయించిందన్నారు. తీర్పు ప్రకారం రైతులకు భూములను అభివృద్ధి చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రాజధాని భూములను తాకట్టు పెట్టుకుంటుందని విమర్శించారు. కోర్ట్ దానికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని పురంధేశ్వరి అన్నారు

*పట్టుదలకు పోకుండా అమరావతిని రాజధానిగా కొనసాగించాలి: Dhulipalla మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటీషన్లపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని టీడీపీ సీనియర్ నేత ధూళి పాళ్ళ నరేంద్రకుమార్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… సీఆర్డీఏ చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని, ఒప్పందం ప్రకారం 6 నెలల్లో అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పట్టుదలకు పోకుండా అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ, అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. రాజధాని వివాదాలకు ముఖ్యమంత్రి స్వస్తి పలకాలన్నారు. రాజధాని రైతులపై కక్షపూరిత చర్యలను ఆపాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ తప్పును తెలుసుకుని నిర్మాణంలో ఉన్న భవన నిర్మాణాలను పూర్తిచేయాలని ధూళిపాళ్ల నరేంద్ర డిమాండ్ చేశారు

*మతాల మధ్య చిచ్చుపెడుతున్న పార్టీ బీజేపీ: Harish rao దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ అభివృద్ధి చెందుతోందని మంత్రి హరీష్ రావు అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ దేశంలో బీజేపీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో కూడా ఇలాంటి సౌకర్యాలు లేవన్నారు. మతాల మధ్య చిచ్చుపెట్టి స్వార్థం కోసం పని చేస్తున్న పార్టీ బీజేపీ అని మండిపడ్డారు. గ్రామాలలో టీఆర్ఎస్ కార్యకర్తలు చర్చలు పెట్టి కాంగ్రెస్, బీజేపీ నాయకులను నిలదీయాలని మంత్రి పిలుపునిచ్చారు. పక్కన ఉన్న మహారాష్ట్రలో పింఛన్ రూ.500 ఉంటే తెలంగాణలో రూ.2016 ఇస్తున్నామని తెలిపారు.

*హైకోర్టు తీర్పును పరిశీలిస్తాం.. ఏపీ మంత్రి వెల్లంపల్లి
ఆంధ్రప్రదేశ్‌ మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్టంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వం తదుపరి నిర్ణయాలు తీసుకుంటుందని ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ వెల్లడించారు. కోర్టు తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు ఉంటే వాటిని పరిశీలించి అప్పిళ్లకు వెళ్తామని ఆయన పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిందని భావించడం లేదని వివరించారు. రాష్ట్రప్రభుత్వం మూడు ప్రాంతాలు, 13 జిల్లాలను అభివృద్ధి చేసేందుకు అభివృద్ధి చేసేందుకు నిర్ణయం తీసుకుందన్నారు. అయితే కోర్టును పూర్తిగా పరిశీలించిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రప్రజలకు ఏది మంచి జరుగుతుందో అదే విధంగా ముందుకు వెళ్తుతుందన్నారు.

*రాష్ట్ర మంత్రిపై హత్యకు కుట్ర చేయడం దారుణం: Jeevan reddy
ఒక రాష్ట్ర మంత్రిపై హత్య కుట్ర చేయడం దారుణమని టీఆర్ఎస్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి అన్నారు. కుట్రలోని పాత్ర దారులు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంట్లో ఎలా ఉన్నారని ప్రశ్నించారు. జితేందర్ రెడ్డికి వారికి సంబంధం ఏంటన్నారు. కిడ్నప్‌ల గురించి మాజీ మంత్రి డీకే అరుణకు ముందే ఎలా తెలుసని నిలదీశారు. తమ ప్రభుత్వం ఇలాంటి చర్యలను కుట్రలను ఉపేక్షించదని, దోషులు ఎంతటి వారు అయిన శిక్ష తప్పదని హెచ్చరించారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి పనులు చేయడం సిగ్గు చేటని మండిపడ్డారు. సెక్షన్ 212 ప్రకారం నిందితులకు షెల్టర్ ఇచ్చిన వారూ కూడా దోషులే అని అన్నారు. డీకే అరుణ, జితేందర్ రెడ్డిలపై కేసులు పెట్టాలని డీజీపీ, సీపీలను కోరుతున్నామన్నారు.

*రాజధాని అంశం పై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం: Yanamala
రాజధాని అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… ముందు నుంచి టీడీపీ మూడు రాజధానులు బిల్లు చెల్లదని చెబుతూనే ఉందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయం తీసుకొని, మూడు రాజధానులపై ముందుకు వెళ్ళిందని మండిపడ్డారు. హైకోర్టు తీర్పుతో నైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని ఆయన హితవుపలికారు. హైకోర్టు తీర్పును గౌరవించి ప్రభుత్వం ముందుకు వెళ్లాలని… మరో అప్పీల్‌కు వెళ్ళకూడదన్నారు. హైకోర్టు చెప్పిన విధంగా రాజధాని భూములు అభివృద్ధి చేసి ప్రభుత్వం రైతులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. మూడు రాజధానుల ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల ఇప్పటికే రాష్ట్ర అభివృద్ధి నాశనమైందని యనమల రామకృష్ణుడు అన్నారు

*కేసు వెనుక రాజకీయ కుట్ర: డీకే అరుణ
మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌పై హత్యకు కుట్ర పన్నారంటూ సైబరాబాద్‌ పోలీసులు మహబూబ్‌నగర్‌ యువకులపై తప్పుడు కేసు పెట్టారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అరోపించారు. ఈ కేసు వెనుక రాజకీయ, ప్రభుత్వ కుట్ర దాగి ఉందన్నారు. కొంతమంది పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆమె నేడొక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల్లో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తప్పుడు అఫిడవిట్‌ సమర్పించారని కొందరు వ్యక్తులు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారని, మహబూబ్‌నగర్‌లో మంత్రి అవినీతి, కబ్జాలపై సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారని, దీన్ని తట్టుకోలేని మంత్రి వీళ్లపై కక్షగట్టి వారం కిందట కిడ్నాప్‌ చేయించారని తెలిపారు. ఇది పూర్తిగా రాజకీయ కుట్రతో పెట్టిన కేసని, మహబూబ్‌నగర్‌లో అరాచకం చేస్తున్న మంత్రి తనపై సానుభూతి తెచ్చుకునేందుకు హత్యకు కుట్ర అని కేసు పెట్టించుకున్నారని ఆరోపించారు

*అరెస్టు చేసి హత్య చేయడానికి కుట్ర: రఘురామ
‘నన్ను హైదరాబాద్‌లో అరెస్టు చేయడానికి తెలంగాణలోని ఓ పోలీసు అధికారితో ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి మాట్లాడారు. ఆయన ఎవరితో మాట్లాడారో నాకు తెలుసు. నన్ను అరెస్టు చేసి హత్య చేయడానికి కుట్ర చేశారు’’ అని వైసీపీ ఎంపీ రఘురామరాజు ఆరోపించారు. బుధవారం ఢిల్లీలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఏపీ డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి నియామకంపై తాను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు లేఖ రాశానని వెల్లడించారు. ఆయనపై తనకు కోపం లేదని తెలిపారు. రాష్ట్రాన్ని కుదిపేస్తున్న వివేకానందరెడ్డి హత్య అంశాన్ని కొన్ని టీవీ చానెళ్లు ఎందుకు చూపించడం లేదని ఆయన ప్రశ్నించారు.