Movies

ఏపీలో సినిమా టిక్కెట్ ధరలు పెంపు – TNI తాజా వార్తలు

ఏపీలో సినిమా టిక్కెట్ ధరలు పెంపు – TNI తాజా వార్తలు

*సినిమా టికెట్ రేట్లు ఫైల్ పై సంతకం చేసిన సీఎం వైఎస్ జగన్..గత కొద్దరోజులుగా సినిమా పరిశ్రమ పెద్దలు ఎదురు చూస్తున్న సినిమా టికెట్ రేట్లు విషయం మరో ఒకటి రెండు రోజుల్లో గుడ్ న్యూస్ తెలియనున్నాయి.ఈ ఫైల్ కు సంబ0దించిన జీఓ. పై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు సంతకం చేసినారు.ఈ జీ ఓ కు చెందిన ఫైల్ ను హైకోర్టు లో సబ్మిట్ చేసిన తరువాత మీడియా ద్వారా ప్రకటన చేయనున్నారు.

*అసెంబ్లీకి వెళ్తున్న తెదేపా నేతల కాన్వాయ్‌లను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఆందోళనకు దిగటంతో.. పోలీసులు దారి వదిలారు.అసెంబ్లీకి వెళ్తున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వాహన కాన్వాయ్‌లను పోలీసులు అడ్డుకున్నారు. మందడం చెక్ పోస్ట్ దగ్గర తెదేపా నేతలను పోలీసులు నిలువరించారు. దాంతో పోలీసులు, తెదేపా నేతలు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల తీరుపై ప్రజా ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసులు తీరును నిరసిస్తూ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.

*టీటీడీ ఈవో జవహర్‌రెడ్డికి సోమువీర్రాజు లేఖ రాశారు. తిరుచానూరులో టీటీడీ నిధులతో నిర్మించిన పద్మావతి నిలయాన్ని నూతన కలెక్టరేట్‌గా మార్చడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందన్నారు. పద్మావతి నిలయాన్ని ప్రభుత్వ పరం చేయడం చట్టవిరుద్ధమని లేఖలో పేర్కొన్నారు. యాక్ట్‌ 30/1987 ప్రకారం టీటీడీ ఆస్తులను, ఆదాయాన్ని ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే ఉపయోగించాలని కోరారు.

*నిర్మ‌ల్ జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేసేందుకు సీయం కేసీఆర్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు అట‌వీప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి వెల్ల‌డించారు. బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా అసెంబ్లీలో సీయం కేసీఆర్ ను మంత్రి మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసారు. ఈ మేర‌కు నిర్మ‌ల్ జిల్లాలో మెడిక‌ల్ కాలేజీ ఏర్పాటు గురించి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్ళారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించార‌ని, నిర్మ‌ల్ జిల్లాలో కూడా మెడిక‌ల్ కాలేజ్ ఏర్పాటు చేస్తామ‌ని హామినిచ్చారని మంత్రి తెలిపారు. దీనికి సంబంధించిన ప్ర‌తిపాద‌న‌ల‌కు సీఎం కేసీఆర్ తుది ఆమోదం తెలిపిన‌ త‌ర్వాత కాలేజీ ఏర్పాటు ప్ర‌క్రియ ప్రారంభ‌మ‌వుతుంద‌ని మంత్రి చెప్పారు

*కృష్ణాజిల్లాలోని గుడివాడలో ఇద్దరు సీఐల బేరసారాల వ్యవహారం సంచలనం కల్గిస్తోంది. గుడివాడ వన్‌టౌన్, టూటౌన్ సీఐలపై అభియోగాలు వచ్చాయి. లోక్ అదాలత్‌లలో రాజీకి వచ్చిన పాత కేసుల్లో కక్షిదారులను సీఐలు బెదిరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గుడివాడలోని పలు సంస్థల నుంచి లంచాలు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ విచారణ చేపట్టారు. ఈ అంశంపై శాఖాపరమైన విచారణ జరుగుతోందని ఎస్పీ తెలిపారు
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యాయత్నం కేసులో బీజేపీ నేత జితేందర్ రెడ్డి పీఏ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. వచ్చే శుక్రవారం వరకు పీఏ రాజును ఇబ్బందులకు గురి చెయ్యొద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. అప్పటివరకు రాజుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు పేర్కొంది. పేట్ బషీరాబాద్ పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలయింది. పేట్ బషీర్ బాగ్ పోలీసులకు ఢిల్లీలో ఉన్న రాజును పిలిచి దర్యాప్తు చేసే అధికారం ఉందా అని హైకోర్టు ప్రశ్నించింది. శుక్రవారం వరకు పోలీసులు, అధికారులు కోర్టుకు తెలపాలని పోలీసులను హైకోర్టు అదేశించింది. అప్పటివరకు రాజుపై ఎలాంటి చర్యలు చేపట్టకూడదని హైకోర్టు అదేశించింది. తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి హైకోర్టు వాయిదా వేసింది.

* ఏపీ అధికార భాషా చట్టం 1966 సవరణకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉర్దూను రెండో భాషగా గుర్తిస్తూ చట్ట సవరణ చేశారు. 35 అజెండా అంశాలపై ఏపీ కేబినెట్‌లో చర్చించారు. సీఎం జగన్మోహన్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తొలుత దివంగత మంత్రి, మంత్రివర్గ సహచరుడు గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతి పట్ల ఏపీ కేబినెట్ సంతాపం తెలిపింది. జిల్లాల విభజనకు సంబంధించి వచ్చిన అభ్యంతరాలపై మంత్రివర్గం చర్చించింది.అమరావతి విషయం రాష్ట్ర ప్రజల సమస్య కాదని చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. రాజధాని ఎక్కడ పెట్టాలనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే హక్కు అని పేర్కొన్నారు. ఎక్కడ నుండి పరిపాలించాలి అనేది ముఖ్య మంత్రికి ఉండే స్వేచ్చా హక్కు అన్నారు. జగన్‌కి కూడా రాజధాని మూడు చోట్లో..నాలుగు చోట్లో మూడు నెలలకిఆరు నెలలకి సీజనల్ గా రూల్ చేసే హక్కు ఉందన్నారు. దాన్ని కాదని చెప్పడానికి న్యాయ స్థానానికి ఉంటుందని నేను అనుకోవడం లేదు.

*తెలంగాణ శాస‌న‌స‌భ నుంచి భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎమ్మెల్యేల‌ను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి స‌స్పెండ్ చేశారు. బ‌డ్జెట్ ప్ర‌సంగానికి అడ్డుప‌డుతున్న ఈట‌ల రాజేంద‌ర్, రాజా సింగ్, ర‌ఘునంద‌న్ రావును సస్పెండ్ చేశారు. శాస‌న‌స‌భ స‌మావేశాలు ముగిసే వ‌ర‌కు ఈ ముగ్గురిని స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు స్పీక‌ర్ ప్ర‌క‌టించారు.

* బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సోమవారం ఆయన ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్తగా 1736 దేవాలయాలకు ధూప దీప నైవేద్య పథకం అమలు వర్తింపచేసేందుకు రూ. 12.50 కోట్లు , బ్రాహ్మణుల సంక్షేమం కోసం రూ. 177 కోట్లు, హరితహార కార్యక్రమానికి రూ.932 కోట్ల బడ్జెట్ లో కేటాయింపులు చేసినందుకు సీఎం కు కృత్ఞతలు తెలిపారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు ఉమ్మడి అదిలాబాద్ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ ను కలిశారు.

*Palestineలో భారత రాయబారి ముకుల్ ఆర్య హఠాన్మరణం
పాలస్తీనాలో భారత రాయబారి ముకుల్‌ ఆర్య హఠాన్మరణం చెందారు.దివంగత రాయబారి అయిన ఆర్య పారిస్‌లోని యునెస్కోకు భారతదేశ శాశ్వత ప్రతినిధి బృందంలో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించారు. 2008 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి అయిన ఆర్య గతంలో మాస్కో, కాబూల్‌లలో భారత రాయబారిగా, న్యూఢిల్లీలోని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో విదేశీ అధికారిగా పనిచేశారు.ఈయన ప్రతిష్ఠాత్మక ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థికశాస్త్రంలో పట్టభద్రుడయ్యారు. ఇండియన్ ఫారిన్ సర్వీస్‌లో చేరడానికి ముందు జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ కూడా అభ్యసించాడని పాలస్తీనా దేశంలోని రమల్లాలోని భారత ప్రతినిధి కార్యాలయం పేర్కొంది.

*తెలంగాణ అసెంబ్లీ వద్ద ఎన్‌ఎస్‌యూఐ మెరుపు ధర్నాకు దిగింది. బల్మూరి వెంకట్ నాయకత్వంలో అసెంబ్లీ ముట్టడికి ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు యత్నించారు. ఆర్టీసీ బస్‌లో వచ్చి అసెంబ్లీ ముందు దిగిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బల్మూరి వెంకట్ మాట్లాడుతూ కేజీ టు పీజీ ఉచిత విద్యను అమలు చేయాలని, ఉద్యోగ నోటిఫికేషన్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

*హయత్‌నగర్‌ నగర శివారు పెద్ద అంబర్‌పేట్‌లోని ఓ పెట్రోల్‌ బంక్‌లో డీజిల్‌కు బదులుగా నీళ్లు పోయడం కలకలం రేపింది. ఆ బంక్‌లో డీజిల్‌ పోయించుకున్న వాహనాలు ఆగిపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అధికారులు తనిఖీ చేసి డీజిల్‌ కల్తీ అయినట్లు గుర్తించి బంకును సీజ్‌ చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్ద అంబర్‌పేట్‌ ఔటర్‌ రింగు రోడ్డు సమీపంలోని మలక్‌పేట్‌ సర్వీస్‌ స్టేషన్‌ పెట్రోల్‌ బంక్‌లో ఆదివారం ఉదయం వాహనదారుడు బాబురావు రూ. 4 వేలతో కారులో డీజిల్‌ కొట్టించారు. కారు పది అడుగులు కదలగానే బంక్‌ పక్కనే ఇంజన్‌ ఆగిపోయింది. ఎంతకూ స్టార్ట్‌ కాకపోవడంతో అనుమానం వచ్చి డీజిల్‌ తనిఖీ చేయించారు.

* ఈ నెల 27 నుంచి విమాన సర్వీసుల పునరుద్ధరణ
విశాఖ, బెంగళూరుకు సైతం..కడప ఎయిర్‌పోర్టు నుంచి మళ్లీ విమానాలు ఎగరనున్నాయి. ఇండిగో సంస్థ ఈ నెల 27 నుంచి విమానాలు నడిపేందుకు సిద్ధమవుతోంది. కడప నుంచి హైదరాబాద్‌, విజయవాడ, చెన్నైతో పాటు తొలిసారిగా విశాఖపట్నం, బెంగళూరుకు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. గతంలో ఉడాన్‌ పథకంలో భాగంగా ట్రూజెట్‌ సంస్థ కడప నుంచి విమానాలను నడిపేది. అయితే పథకం గడువు ముగియడంతో హైదరాబాద్‌, చెన్నై, విజయవాడ సర్వీసులు నిలిచిపోయాయి. కొద్ది రోజుల పాటు కడప హైదరాబాద్‌, కడప బెల్గాంలకు సర్వీసు నడిపింది. చివరి సారిగా గత ఏడాది నవంబర్‌ 11న కడప నుంచి బెల్గాంకు సర్వీసు నడిపింది. తర్వాత సాంకేతిక కారణాల వల్ల నిలిపేసింది. అప్పటి నుంచి విమానాల రాకపోకలు లేవు. రాష్ట్ర ప్రభుత్వం ఇండిగోతో, ఏపీ ఎయిర్‌పోర్టు డెవలప్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌తో ఇప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఈ నెల 27 నుంచి విమాన రాకపోకలు మొదలు కానున్నాయి.

*ఉక్రెయిన్‌ నుంచి వేలాది మంది భారతీయ విద్యార్థులను ఆపరేషన్‌ గంగ ద్వారా విజయవంతంగా ఇండియాకు తరలిస్తున్నామని, ప్రపంచ వ్యాప్తంగా భారత్‌కు పెరుగుతున్న పలుకుబడి వల్లే ఇది సాధ్యమైందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పుణెలోని సింబయాసిస్‌ యూనివర్సిటీ 50వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, పుణె మునిసిపల్‌ కార్పొరేషన్‌లో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆదివారం ఆవిష్కరించారు

*ఉక్రెయిన్‌లో మృతిచెందిన కర్ణాటక వైద్య విద్యార్థి నవీన్‌.. ఆహారం తీసుకొచ్చేందుకే బయటకు వెళ్లి ప్రాణాలు కోల్పోయాడని.. వైద్య విద్యార్థిని, ప్రత్యక్ష సాక్షి హీనాఫాతిమా చెప్పారు. దక్షిణ కన్నడ జిల్లా ఉజిరెకు చెందిన ఫాతిమా ఉక్రెయిన్‌లో మెడిసిన్‌ చేస్తున్నారు. తాజాగా స్వస్థలానికి వచ్చారు. ‘బంకరులో ఉన్నప్పుడు మా సీనియర్‌ నవీన్‌ మాకు ఆహారం తీసుకొచ్చేందుకే బయటకు వెళ్లాడు. రష్యా సైనికులు చేసిన షెల్‌దాడిలో ప్రాణాలు కోల్పోయాడు’ అని తెలిపారు.

*విశాఖ, గుంటూరు, కృష్ణాజిల్లాల్లో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఆదివారం సోదాలు నిర్వహించారు. విశాఖ జిల్లాలో అదనపు ఎస్పీ జి.స్వరూపరాణి ఆధ్వర్యంలో ఐదు బృందాలుగా ఏర్పడి సూపర్‌మార్కెట్లలో తనిఖీలు జరిపారు. పీఎంపాలెంలోని విజేత సూపర్‌మార్కెట్‌లో వంట నూనెలను ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నట్టు గుర్తించి కేసు నమోదుచేశారు. గుంటూరు జిల్లాలో రీజనల్‌ విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి మాధవరెడ్డి పర్యవేక్షణలో గుంటూరు, తెనాలి, సత్తెనపల్లి, చిలకలూరిపేట, నరసరావుపేటలో దాడులు నిర్వహించి, వంట నూనెలను అక్రమంగా నిల్వ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారని గుర్తించారు. కృష్ణా జిల్లావ్యాప్తంగా 30 షాపులు, రిటైల్‌, హోల్‌సేల్‌ డీలర్ల సంస్థల్లో దాడులు నిర్వహించారు.

*మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అసలైన దోషులను శిక్షించాలని మాజీ మంత్రి పరిటాల సునీత డిమాండ్‌ చేశారు. సొంత బాబాయ్‌ని హత్య చేస్తే, దానిని రాజకీయంగా వాడుకున్న చరిత్ర సీఎం జగన్‌దని ధ్వజమెత్తారు. పులివెందులలో, అందులోనూ వైఎస్‌ కోటలో వివేకాను హత్య చేసే ధైౖర్యం బయటి వ్యక్తులకు ఎలా వస్తుందని ప్రశ్నించారు.

*నిబంధనల పేరుతో చిన్న పత్రికలకు కష్టాలు కలిగించవద్దని ఐజేయూ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. స్సామ్నా(రాష్ట్ర చిన్న, మధ్యతరహా వార్తా పత్రికల సంఘం) రాష్ట్ర ప్రఽథమ మహాసభలను ఆదివారం విజయవాడలోని ఓ హోటల్‌లో నిర్వహించారు. ముఖ్యఅతిఽఽథి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అక్రెడిటేషన్లు జర్నలిస్టుల హక్కు అని, ఆ హక్కును కాలరాసేలా ప్రభుత్వం వ్యవహరించడం సహేతుకం కాదన్నారు. జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు రాకుండా జీఎస్టీ పేరుతో, సర్క్యులేషన్‌ నిబంధనలతో అడ్డుకోవడం సమాచార-పౌర సంబంధాల శాఖ అధికారి అహంకారానికి నిదర్శనమన్నారు. ఐజేయూ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు మాట్లాడుతూ ప్రభుత్వం చిన్న పత్రికలను చిన్నచూపు చూడటం తగదన్నారు. స్సామ్నా రాష్ట్ర అధ్యక్షుడిగా నల్లి ధర్మారావు, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సి.వెంకటరెడ్డి, ప్రధానకార్యదర్శిగా సీహెచ్‌.రమణారెడ్డి తదితరులతో సంఘం నూతన కార్యవర్గం ఎన్నికైంది. ఐఅండ్‌పీఆర్‌ కమిషనర్‌ను వెంటనే బదిలీ చేయాలని మహాసభలో తీర్మానించారు. ఐజేయూ కార్యవర్గ సభ్యులు సురేశ్‌, డి.సోమసుందర్‌, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు సుబ్బారావు, ఫొటో జర్నలిస్టుల యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు సాంబశివరావు పాల్గొన్నారు.

*జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఈ నెల 14న మంగళగిరిలో నిర్వహించనున్నారు. సభ నిర్వహణ కోసం పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ 12 కమిటీలను నియమించారు. ఈమేరకు పార్టీ కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. జిల్లాల సమన్వయ కమిటీలో పంతం నానాజీ, ముత్తా శశిధర్‌, నేమూరి శంకర్‌ గౌడ్‌, పెదపూడి విజయకుమార్‌, జి.ఉదయ్‌ శ్రీనివాస్‌, సుందరపు విజయ్‌కుమార్‌, వడ్రాణం మార్కండేయ బాబులను నియమించారు. ఆహ్వాన కమిటీలో టి.శివశంకర్‌తో పాటు మరో ఐదు మంది సభ్యులున్నారు.

*‘నన్ను మా లెక్కల మాస్టారు కొడుతున్నాడు’ అంటూ ముద్దు ముద్దుగా పోలీసులకు ఫిర్యాదు చేసిన మూడో తరగతి బాలుడు గుర్తున్నాడా..! రెండు రోజులుగా సోషల్‌మీడియాలో వైరలయిన ఈ ఘటనలో.. ‘అయ్యో.. ఆ బాలుడికి ఎంత కష్టం వచ్చింది’ అంటూ నెటిజన్లంతా తెగబాధపడ్డారు. ఇప్పుడు అదే బాలుడి ఫొటో.. అదే సోషల్‌ మీడియాలో మరో విధంగా చక్కర్లు కొడుతోంది. మహబూబాబాద్‌ జిల్లా బయ్యారంలో ఆ బాలుడు ఆదివారం ఓ తాటి వనంలో కనిపించడం అందరినీ షాక్‌కు గురిచేసింది. అది కూడా తన బాబాయ్‌తో కలిసి కల్లు సీసా చేతిలో పట్టుకుని కనిపించాడు. 8ఏళ్ల ఆ బాలుడిని కొందరు గుర్తుపట్టారు. వెంటనే ఫొటో తీసి సోషల్‌మీడియాలో పెట్టేశారు. అంతే.. క్షణాల్లో వైరలైంది. ఇది చూసిన నెటిజన్లు కంగుతిన్నారు. ‘నిన్నటి బుడ్డోడేనా ఈ చిన్నోడు’ అంటూ ఆశ్చర్యపోయారు. ఈవిషయమై బాలుడు బాబాయ్‌ను ప్రశ్నించ గా.. సరదాగా తనతో తాటి వనానికి వచ్చాడని, ఎవరో ఫొటో తీసి సోషల్‌ మీడియాలో పెట్టారని చెప్పడం గమనార్హం.

*త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల్లో జరగబోయే జాతీయ సాంస్కృతిక ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాల ఖ్యాతిని ఈ ఉత్సవాల ద్వారా ప్రపంచానికి చాటి చెప్పేందుకు ప్రతి ఒక్క రూ సిద్ధపడాలన్నారు. ఈ ఉత్సవాల్లో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ముఖ్యమంత్రులతో పాటు సీనీ ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే జాతీయ సాంస్కృతిక ఉత్సవాల ఏర్పాట్లపై హైదరాబాద్‌లో ఆదివారం ఆయన బీజేపీ కార్యకర్తలతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. తొలుత ఈనెల 26, 27 తేదీల్లో ఏపీలోని రాజమహేంద్రవరంలో ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

*ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా చివరి విడుత పోలింగ్‌ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్‌ కొనసాగనుంది. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల పరధిలో 54 శాసనసభ స్థానాల్లో పోలింగ్‌ జరుగుతుంది. మొత్తం 613 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 2.6 కోట్ల మంది ఓటర్లు వారీ భవితవ్యం తేల్చనున్నారు.