Business

ధర తక్కువలో ఎలక్ట్రిక్ బైక్ – TNI వాణిజ్యం

ధర తక్కువలో ఎలక్ట్రిక్ బైక్ – TNI వాణిజ్యం

*ప్రముఖ వాహన తయారీ సంస్థ ఇగ్నీట్రాన్ మోటోకార్ప్’కు చెందిన స్వదేశీ ఈవీ స్టార్టప్ సైబోర్గ్ తన 3 ఎలక్ట్రిక్ బైకుల(యోడా, జీటీ 120, బాబ్-ఈ)కు సంబంధించిన ధరలను ఆవిష్కరించింది. ఈ బైక్ ధరలు వరుసగా ₹1,84,999(యోడా), ₹1,64,999(జీటీ 12), ₹1,14,999(బాబ్-ఈ)గా ఉన్నాయి. వివిధ రాష్ట్రాల్లో లభించే అదనపు సబ్సిడీల వల్ల వినియోగదారులకు ఈ ఎలక్ట్రిక్ బైక్ మరింత తక్కువ ధరకు లభించే అవకాశం ఉంది. కంపెనీ త్వరలో మోటార్ సైకిళ్ల బుకింగ్ తేదీని కూడా ప్రకటించనుంది. ప్రస్తుతం రూ.999 మీకు ఇష్టమైన బైకును రిజర్వ్ చేసుకునే అవకాశం ఉంది.

* దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం తర్వాత లాభాల్లో పయనించాయి. రియాల్టీ, ఐటీ, ఫార్మా షేర్లు రాణించడంతో సూచీలు లాభాలలో ముగిశాయి. అలాగే, కనిష్ట ధరల వద్ద షేర్లు అందుబాటులో ఉండటంతో మదుపరులు కొనుగోలుకు మొగ్గుచూపారు. ముగింపులో, సెన్సెక్స్ 581.34 పాయింట్లు(1.10%) పెరిగి 53,424.09 వద్ద ఉంటే, నిఫ్టీ 150.30 పాయింట్లు(0.95%) లాభపడి 16,013.50 వద్ద ఉన్నాయి. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.92 వద్ద ఉంది.

*హైదరాబాద్‌ కేంద్రంగా పని చేసే విజయా డయాగ్నోస్టిక్‌ నుంచి ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ కారకోరం లిమిటెడ్‌ తప్పుకుంది. కంపెనీ ఈక్విటీలో తనకు ఉన్న 73 లక్షల షేర్లను ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా దాదాపు రూ.332 కోట్లకు విక్రయించింది. గత ఏడాది డిసెంబరు నాటికి విజయా డయాగ్నోస్టిక్‌ ఈక్విటీలో కారకోరం లిమిటెడ్‌కు 9.64 శాతం వాటా ఉంది. సోమవారం ఈ షేర్లను సగటున ఒక్కో షేరు రూ.425.75 చొప్పున విక్రయించింది.

*చర్మ రక్షణ ఉత్పత్తుల రంగంలో తన పట్టు మరింత పెంచుకునేందుకు డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ రెడీ అవుతోంది. ఇందులో భాగంగానే చెన్నై కేంద్రంగా ఉన్న స్కిన్‌కేర్‌ ఉత్పత్తుల కంపెనీ క్యురేషియో హెల్త్‌కేర్‌ను దక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. ఇప్పటికే ఈ కంపెనీ కొనుగోలు కోసం బిడ్‌ దాఖలు చేసింది. మరోవైపు డాక్టర్‌ రెడ్డీస్‌తో పాటు అరబిందో ఫార్మా, బయోకాన్‌, జేబీ కెమికల్స్‌, టొరంట్‌ ఫార్మా, జైడస్‌ హెల్త్‌కేర్‌ కంపెనీలు కూడా క్యురేషియో కోసం పోటీపడుతున్నాయి. ఈ సంస్థలతో పాటు మూడు ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థలు కూడా క్యురేషియో ఆస్తులపై ఆసక్తితో ఉన్నాయి. దాదాపు రూ.2,000 కోట్ల విలువైన ఈ కంపెనీ కొనుగోలు కోసం ఈ నెలాఖరుకల్లా కంపెనీల నుంచి రెండో విడత బిడ్స్‌ ఆహ్వానించే అవకాశం ఉంది

*టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) రూ. 18 వేల కోట్ల విలువైన షేర్ బైబ్యాక్ ఆఫర్ 9 వ తేదీన ప్రారంభమై, 23 న ముగియనుంది. కిందటి(ఫిబ్రవరి) నెల 12 న… కంపెనీ 4 కోట్ల షేర్లను… రూ. 4,500 చొప్పున షేర్ బైబ్యాక్ కార్యక్రమాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ మేరకు… టీసీఎస్ ఏప్రిల్ ఒకటిన… స్టాక్ ఎక్స్ఛేంజీల్లో… బిడ్ల సెటిల్మెంట్ కోసం చివరి తేదీగా నిర్ణయించింది.2017లో కూడా ఇలాంటి కసరత్తు జరిగింది.

*నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణను ఏడు రోజుల సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కో-లొకేషన్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న చిత్రను సీబీఐ ఆదివారం ఢిల్లీలో అరెస్ట్ చేసింది.

*ఉద్యోగ మార్కెట్‌కు కరోనా వైరస్‌ గండం దాదాపుగా తొలిగినట్టేనని ఓ సర్వే పేర్కొంది. భవిష్యత్‌లో పుట్టుకొచ్చే కొవిడ్‌ కొత్త వేరియంట్లు ఉద్యోగ నియామకాలపై అంతగా ప్రభావం చూపకపోవచ్చని మెజారిటీ (73 శాతం) ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. 27 శాతం మాత్రం భవిష్యత్‌ స్థితిగతులపై ఖచ్చితంగా లేమని అన్నారని జీనియస్‌ కన్సల్టెంట్స్‌ తాజా సర్వే నివేదిక వెల్లడించింది. ఐటీ, ఐటీఈఎస్‌, బీపీఓ, లాజిస్టిక్స్‌, మాన్యుఫాక్చరింగ్‌, మీడియా, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, ఫార్మా, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, ఇంజనీరింగ్‌, ఎడ్యుకేషన్‌, ఎఫ్‌ఎంసీజీ, ఆతిథ్యం, హెచ్‌ఆర్‌ సహా పలు రంగాలకు చెందిన 1,468 మంది ఉద్యోగులు, ఎగ్జిక్యూవ్‌లను ఆన్‌లైన్‌లో సర్వే చేసినట్లు జీనియస్‌ కన్సల్టెంట్స్‌ తెలిపిం.

*రష్యా-ఉక్రెయిన్‌ మధ్య ఉద్రిక్తతల కారణంగా స్టాక్‌ మార్కెట్లో నెలకొన్న తీవ్ర ఒడుదుడుకులను ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ డిపార్ట్‌మెంట్‌ (దీపమ్‌) కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే అన్నారు. ఈ నేపథ్యంలో ఎల్‌ఐసీ మెగా ఐపీఓ ప్రారంభంపై పెట్టుబడిదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి (మార్చి 31) ఎల్‌ఐసీ ఐపీఓను పూర్తి చేయాలని ప్రభుత్వం కోరుకుంటున్నప్పటికీ, ప్రస్తుతం మార్కెట్లో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. దాంతో కంపెనీ పబ్లిక్‌ ఇష్యూ ప్రారంభ సమయంపై ప్రభుత్వం పునరాలోచించవచ్చని శుక్రవారం ఆయన పేర్కొన్నారు