Devotional

శ్రీమహాలక్ష్మీ ఆవిర్భావ ప్రాశస్త్యమిదే! – TNI ఆధ్యాత్మికం

శ్రీమహాలక్ష్మీ ఆవిర్భావ ప్రాశస్త్యమిదే! - TNI  ఆధ్యాత్మికం

శ్రీమహాలక్ష్మీ ఆవిర్భావ ప్రాశ్చాత్యమీదే! – TNI ఆధ్యాత్మికం
లక్ష్మీదేవి ఒక్కో మన్వంతరంలో ఒక్కొక్క రూపంలో అవతరించినట్టు పురాణాలు చెప్తున్నాయి. స్వయంభువ మన్వంతరంలో భృగువు, ఖ్యాతి దంపతుల పుత్రికగా లక్ష్మీదేవి జన్మించింది. సారోచిష మన్వంతరంలో లక్ష్మీదేవి అగ్నినుంచి అవతరించింని చెపుతారు.జౌత్తమ మన్వంతరంలో జలరాశి నుండి, తామస మన్వంతరంలో భూమినుండి, రైతవ మన్వంతరంలో బిల్వవృక్షం నుండి, చాక్షుస మన్వంతరంలో సహస్రదళ పద్మం నుండి వైవస్వత మన్వంతరంలో క్షీరసాగరంలో నుండి ఆవిర్భవించినట్లు పురాణాల ప్రకారం వెల్లడవుతోంది. ప్రస్తుతం వైవస్వత మన్వంతరంలో లక్ష్మీదేవి జన్మించిన రోజు ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి.
వైవస్వతంలో శ్రీమహాలక్ష్మీదేవి ఆవిర్భావం ఈ విధంగా సంభవించింది.పూర్వం ఒకసారి దూర్వాస మహా ముని కల్పవృక్షమాలను దేవేంద్రునికి బహూకరించగా దేవేంద్రుడు ఆ మాలను తన వాహనమైన ఐరావతానికి ధరింపచేస్తాడు. ఆ ఏనుగు ఆ మాలను కిందపడేసి, కాళ్ళతో తొక్కి ముక్కలు చేస్తుంది. అది చూసిన దూర్వాస మహాముని కోపోద్రిక్తుడై ౖౖ”నీ రాజ్యం నుండి లక్ష్మి వెళ్ళిపోవుగాక” అని శపిస్తాడు. శాపఫలితంగా స్వర్గలోకంలో ఐశ్వర్యం నశించిపోతుంది. రాక్షసులు స్వర్గంపైకి దండయాత్రలు చేస్తారు. స్వర్గాన్ని స్వాధీనం చేసుకుంటారు.దీంతో దేవేంద్రాది దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి జరిగిన వృత్తాంతాన్ని తెలిపి శరణువేడతారు. బ్రహ్మదేవుడు ఇంద్రాది దేవతలను వెంటపెట్టుకుని విష్ణువువద్దకు వెళ్ళి పరిస్థితిని వివరిస్తాడు. క్షీరసాగర మధనం ద్వారా అమృతాన్ని ఉద్బవింపచేసి, ఆ అమృత బలంతో రాక్షసులను సంహరించాలని విష్ణుమూర్తి సూచిస్తాడు.క్షీరసాగరమధనంలో ముందుగా ఉద్భవించిన హాలాహలాన్ని ఈశ్వరుడు సేవించగా, తరువాత సురభి అనే కామధేనువు, ఉచ్ఛ్వైశ్రవం అనే అశ్వం, పిమ్మట ఐరావతం, కల్పవృక్షం, వీటన్నింటి తరువాత క్షీరాబ్ధి నుంచి ఉత్తరఫల్గుణి నక్షత్రంలో శ్రీమహాలక్ష్మి ఉద్భవించింది. ఇది వైవస్వత మన్వంతరంలో శ్రీ మహాలక్ష్మీ జననం వెనుక ఉన్న గాధ. భక్తిశ్రద్ధలతో మహాలక్ష్మిని ఆరాధిస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. సిరిసంపదలతో పాటు కీర్తి దక్కుతుంది. బుద్ధి వికాసం కలుగుతుంది. అన్నింటా జయం లభిస్తుంది. బలము, మేధస్సు, ఆరోగ్యం ఇత్యాదివి సంప్రాప్తిస్తాయి.
1. కన్నులపండువగా నృసింహుని కళ్యాణం
గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీ నృసింహుని సన్నిధిలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 12 గంటలకు స్వామి వార్ల కల్యాణం నేత్ర పర్వంగా జరిగింది. కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో భక్తులు భారీగా చేరుకున్నారు. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో కొక్కిరిసిపోయాయి. ఆలయం ఎదుట ఉన్న ఉత్సవ మైదానంలో సుందరంగా కళ్యాణ వేదికను అలంకరించారు. ఆలయ ప్రధాన అర్చకులు దివి అనంత పద్మనాబాచార్యులు, ఉప ప్రధాన అర్చకులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు గుంటూరు హిందు కాలేజ్ ప్రిన్సిపాల్ దివి నరసింహ దీక్షితులు స్వామి వారి కల్యాణాన్ని వైభవంగా జరిపారు. కైంకర్యపరులుగా శాశ్వత కల్యాణం కైంకర్య పరులు వాసిరెడ్డి కోటయ్య కుమారులు నాగేంద్ర ప్రసాద్ వ్యవహరించగా, మంగళగిరి పద్మశాలీయ బహుత్తమ సంఘం వారి తరపున అవ్వారు వాచ్ కంపెనీ అధినేత శరత్ బాబు మధు పర్కములు, మంగళద్రవ్యములు సమర్పించారు. ఆలయ ఉత్సవంలో అధికారులు భక్తులకు పెద్దపీట వేశారు. స్వామివారి ముందు అందరూ సమానమే అని పాల్గొన్నారు.
2. ద్వారకా తిరుమల వేంకటేశ్వరస్వామి నిత్యాన్నదానానికి రూ.4లక్షల విరాళం
ద్వారకా తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి రూ.4 లక్షలు విరాళం అందజేసినట్లు వేలేరుకు చెందిన వేంకటేశ్వర అవిర్నేని తారకబ్రహ్మం, దోనవల్లి పుష్పావతి ట్రస్ట్‌ అధ్యక్షుడు అవిర్నేని రాధాకృష్ణ తెలిపారు. దేవస్థానం ఏఈవో లక్ష్మణస్వామికి గురువారం నగదును అందజేశామని ఆయన తెలిపారు. ట్రస్ట్‌ కార్యదర్శి నందిగం వెంకటేశ్వరరావు, స్వామి పాల్గొన్నారు.
3. వైభవంగా శ్రీఅష్టలక్ష్మీ పుండరీక మహాయాగం
శ్రీఅష్టలక్ష్మీ పుండరీక మహాయాగం వైభవంగా సాగుతుంది. బుధవారం తెల్లవారు జాము నుంచి సాయంత్రం పది గంటల వరకూ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సుప్రభాత సేవతో ప్రారంభమైన ఉత్సవాలు గజవాహన సేవతో ముగిశాయి. మధ్యాహ్నం స్వామివారి కల్యాణ వైభవంగా నిర్వహించారు. రాత్రి ఎనిమిది గంటల నుంచి స్వామివారిని గజవాహనంపై తిరుమాఢవీధుల్లో ఊరేగించారు. శ్రీసిరిమహోత్సవాల్లో భాగంగా ఈనెల 18న ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఉత్సవాల నిర్వాహకుడు అంగర రాంబాబు తెలిపారు. శుక్రవారం అమ్మవారి జన్మదినోత్స వాన్ని పురస్కరించుకొని పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.
4. తిరుపతమ్మకు రూ.1.72 కోట్ల ఆదాయం
తిరుపతమ్మ ఆలయానికి సబంధించి నిర్వహించిన పలు బహిరంగ వేలంల ద్వారా రూ.1,72,25,488లు ఆదాయం వచ్చినట్లు ఈవో కె.శోభారాణి తెలిపారు. ఆలయం వద్ద వ్యాపారాలు నిర్వహించుకునే లైసెన్స్‌ హక్కులకు బుధవారం బహిరంగ వేలం ఆలయ వేద మండపంలో నిర్వహించారు. దీనిలో భక్తులు అర్పించిన తలనీళాలు పోగు చేసుకునే లైసెన్స్‌ హక్కును పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన శ్రీనివాస హెయిర్‌ ఇండస్ట్రీస్‌, రూ.1,69,75,188లకు హెచ్చు పాటదారుడిగా నిలిచారు. పలు వ్యాపారాలు నిర్వహించుకునేందుకు మిగిలిన సొమ్ము ఆదాయంగా లభించిందన్నారు. కార్యక్రమంలో చైర్మన్‌ ఇంజం చెన్నకేశవరావు, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు వైకుంఠరావు, ధర్మకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు.
5. 20న ఆన్‌లైన్‌లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల
ఏప్రిల్, మే, జూన్‌ లకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ ఈ నెల 20న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. భక్తులు www.tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌లో బుక్‌ చేసుకోవచ్చు. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన, నిజపాద దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌ ఎలక్ట్రానిక్‌ డిప్‌ విధానంలో కేటాయిస్తారు. ఈ సేవలకు మార్చి 20వ తేదీ ఉదయం 10 గంటల నుండి మార్చి 22వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. టికెట్లు పొందిన వారి జాబితాను మార్చి 22న ఉదయం 10 గంటల తరువాత వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. టికెట్లు పొందిన భక్తులు 2 రోజుల్లోపు వాటి ధర చెల్లించాల్సి ఉంటుంది. కల్యాణో త్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను భక్తులు నేరుగా బుక్‌ చేసుకోవచ్చు.
*పర్వదినాల్లో పలు ఆర్జిత సేవలు రద్దు..
ఏప్రిల్‌ 2న ఉగాది సందర్భంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఏప్రిల్‌ 10న శ్రీరామనవమి సందర్భంగా తోమాల, అర్చన, సహస్రదీపాలంకార సేవ, వసంతోత్సవాల సందర్భంగా ఏప్రిల్‌ 14 నుండి 16వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, స హస్రదీపాలంకార సేవలను, ఏప్రిల్‌ 15న నిజ పాద దర్శనం సేవలను టీటీడీ రద్దు చేసింది. శ్రీ పద్మావతి పరిణయోత్సవాల సందర్భంగా మే 10 నుండి 12వ తేదీ వరకు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు, జూన్‌ 14న జ్యేష్టాభిషేకం మూడో రోజున అష్టదళపాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కోవిడ్‌ నెగిటివ్‌ సర్టిఫికెట్‌ రెండు డోసుల వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ కానీ తప్పనిసరిగా తీసుకురావాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
6. శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్న స్వరూపానందేంద్ర
శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వార్లను శ్రీ శ్రీ శ్రీ స్వరూపనందేంద్ర సరస్వతి స్వామి శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర స్వామికి ఆలయ రాజగోపురం వద్ద పూర్ణకుంభంతో అర్చకులు వేద పండితులు ఈవో లవన్న, ఎమ్మెల్యే శిల్పచక్రపాణి రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వేద ఆశీర్వచనం మండపంలో స్వామీజీని అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.
7. ఏప్రిల్ 10న సీతారాముల క‌ల్యాణ మ‌హోత్స‌వం
ఫాల్గుణ శుద్ధ‌ పౌర్ణ‌మి సంద‌ర్భంగా భ‌ద్రాద్రి రామాల‌యంలో విశేష పూజ‌లు ప్రారంభ‌మ‌య్యాయి. ఇవాళ సీతారాముల‌ను వ‌ధూవ‌రుల‌ను చేసే వేడుక‌ను నిర్వ‌హించ‌నున్నారు. ల‌క్ష్మ‌ణ స‌మేత సీతారాముల‌కు డోలోత్స‌వం, వ‌సంతోత్స‌వం నిర్వ‌హించ‌నున్నారు. ఉత్స‌వం సంద‌ర్భంగా ఇవాళ నిత్య క‌ల్యాణాన్ని, మూల‌మూర్తుల‌కు స్వ‌ర్ణ క‌వ‌చ అలంక‌ర‌ణ నిలిపివేశారు. ఇవాళ మూల‌మూర్తుల‌కు విశేస స్న‌ప‌న తిరుమంజ‌నం నిర్వ‌హించ‌నున్నారు. ఏప్రిల్ 9న సీతారాముల‌కు ఎదుర్కోలు మ‌హోత్స‌వం, ఏప్రిల్ 10న సీతారాముల క‌ల్యాణ మ‌హోత్స‌వం, 11న శ్రీరామ ప‌ట్టాభిషేక మ‌హోత్స‌వానికి ఏర్పాట్లు చేస్తున్నారు.శ్రీరామ‌నవ‌మి వేడుక‌ల్లో భాగంగా ఆలయ ప్రధాన అర్చకుడు పవిత్ర పుణ్య జలాలను గోటి తలంబ్రాలపై చల్లుతారు. రోలు, రోకలిలో లక్ష్మి, సరస్వతి అమ్మవార్లను ఆవాహన చేసి రోకలికి కంకణధారణ చేస్తారు. తొమ్మిది మంది ముత్తయిదువలు పసుపు కొమ్ములు దంచుతారు. స్వామివారిపై బుక్కా, గులాల్‌, అత్తరు, పన్నీరు చల్లుతారు. పసుపు, కుంకుమతోపాటు ఇతర ద్రవ్యాలు కలిపి 1,108 మంది మహిళలు తలంబ్రాలను కలుపుతారు. దీంతో రామయ్య పెండ్లి పనులు మొదలైనట్టు పరిగణిస్తారు. అనంతరం అర్చకులు వసంతుడిని ఆవాహన చేసి తొమ్మిది పసుపు ముద్దలను సిద్ధం చేస్తారు. మంత్రాలను జపిస్తూ వసంతాన్ని ప్రోక్షిస్తారు. పసుపు ముద్దల్లో ఒక ముద్దను రామయ్య శిరస్సుపై, రెండోది అమ్మవారి మంగళసూత్రం వద్ద, మూడో ముద్దను లక్ష్మణస్వామి వారిపై ఉంచుతారు. అప్పటి నుంచి సీతారాములు పెండ్లికొడుకు, పెండ్లి కుమార్తెగా భావిస్తారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి గోటి తలంబ్రాలు తెచ్చిన భక్తులు ఆలయ అధికారులకు అందజేస్తారు.