DailyDose

ఏ రంగు ఏం చెబుతోంది?

ఏ రంగు ఏం చెబుతోంది?

లోకంలోని అనంతమైన ప్రకృతిలో మనకు ఎన్నో రంగులు కనిపిస్తాయి. ఈ రంగులు మానవుల చైతన్యం మీద, ఆధ్యాత్మిక ప్రక్రియ మీదా ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయనేది ఆసక్తికరమైన ప్రశ్న.
**అసలు… రంగు అంటే ఏమిటి?
ఏదైనా పదార్థానికి రంగు ఆ పదార్థం వల్ల రాదు. అది దేన్ని తిరస్కరిస్తుందో, దేన్ని విడుదల చేస్తుందో, దేన్ని ప్రతిబింబిస్తుందో… దానివల్ల వస్తుంది. ఒక వస్తువు ఎరుపు రంగులో కనిపిస్తోంది అంటే… అది ఎరుపు రంగులో ఉందని కాదు. తెల్లటి కాంతిలో ఉండే మిగిలిన రంగులన్నిటినీ తనలో నిలుపుకొని… ఎరుపును మాత్రం వదిలేస్తుంది. కాబట్టి…. ఎరుపు రంగులో ఒక వస్తువు ఉందంటే… అది ఆ ఎరుపును వదిలేసిందని అర్థం. ప్రపంచం కోసం ఎరుపును అది విడుదల చేస్తోందన్నమాట. అలాగే ప్రపంచానికి మీరు ఏది ఇస్తారో అదే మీ గుణం అవుతుంది రంగులు, వాటి అంతరార్థాలను తెలుసుకుందాం.
*ఎరుపు:
మనం అడవిలో నడుస్తున్నప్పుడు అంతా ఆకుపచ్చగా కనిపిస్తుంది కానీ ఎక్కడో వికసించిన ఒక ఎర్రటి పువ్వు మనల్ని ఆకర్షిస్తుంది. ఎందుకంటే… మిగిలిన రంగులు అందంగా ఉండొచ్చు కానీ, ఎరుపు అత్యంత ఉత్తేజభరితమైనది. మానవ చేతనలోని ఆలోచనల మీద రంగులు ఎక్కువ ప్రభావం చూపుతాయి. మన రక్తం ఎర్ర రంగులో ఉంటుంది. ఉత్సాహభరితమైనది ఏదైనా ఆ రంగులోనే ఉంటుంది. ఎరుపు రంగులో ఉండే లింగభైరవి మాత ఉత్సాహానికి ప్రతిరూపం. అంటే… ఆమె శక్తి ఉత్తేజపూరితం, ఉత్సాహభరితం.
*నీలం:
అన్ని వర్ణాలనూ కలుపుకొనే తత్త్వం నీలం రంగులో ఉంటుంది. సృష్టిలో విస్తారమైనది, మన అవగాహనకు మించినది ఏదైనా ఆ రంగులోనే ఉంటుంది…. అది సముద్రం కావచ్చు, ఆకాశం కావచ్చు. అందుకే మన దేశంలో చాలామంది దేవుళ్ళ రంగులను. ఉదాహరణకు శివుడు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు… నీలం రంగులో వర్ణిస్తారు. అంటే వారి చర్మం ఆ రంగులో ఉందని కాదు… ఆ రంగు కాంతి (దివ్య) శరీరం ఉంది కాబట్టి వారిని ‘నీలం రంగులో ఉండే దేవతలు’ అని పేర్కొన్నారు. ఇందులో మరో అంశం కూడా ఉంది. మన సాధనలో ఆజ్ఞా చక్రానికి ప్రాధాన్యం ఇస్తే… ఇది నారింజ రంగు అవుతుంది. అది పరిత్యాగ క్రియా వర్ణం. ఎవరికైనా స్వచ్ఛమైన తెల్లటి కాంతి శరీరం ఉంటే… వారు స్వచ్చమైన జీవులని అర్థం. వారి ఉనికి అద్భుతంగా ఉంటుంది. కానీ క్రియాశీలంగా ఉండరు. ఎవరైనా అత్యున్నత స్థితికి చేరినప్పటికీ… ప్రపంచంలో చురుగ్గా ఉండాలనుకున్నప్పుడు… అతని కాంతి నీలం రంగులో ఉంటుంది. క్రియాశీలంగా ఉన్నవారందరూ నీలం రంగు కాంతితో ఉంటారు.
*నారింజ:
ఆధ్యాత్మిక మార్గంలో నడిచే వ్యక్తులు…. ప్రధానంగా మన దేశంలో… నారింజను తమ రంగుగా ఎందుకు ఎంచుకుంటారు? ఎందుకంటే, ఈ రంగు అనేక విషయాలను సూచిస్తుంది. అది సహజమైనది, సజీవమైనది. కొన్ని ధ్యానాల్లోకి వెళ్ళినప్పుడు… ఆజ్ఞా చక్రం నారింజ లేదా కాషాయ రంగులో ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. నిజానికి అది కాషాయ రంగు కాదు. జేగురు మన్ను రంగు. ఆజ్ఞా చక్రం ఎరుక లేదా జ్ఞానోదయానికి సంబంధించింది. దీన్ని ‘మూడవ కన్ను’ అని కూడా అంటారు. మానవ శరీరంలో నూట పధ్నాలుగు చక్రాలు ఉంటాయి. వీటిలో ఏ రెండిటికీ ఒక రంగు ఉండదు. సాధారణంగా నారింజ రంగు కాంతిని సంతరించుకున్న వ్యక్తి… తన పేరు, గుర్తింపు, కుటుంబం… ఇలా తనకు సంబంధించిన ప్రతి విషయాన్నీ వదిలేస్తాడు. భిన్నమైన జీవితంలోకి మారుతాడు. అతను కొత్తగా ప్రారంభమవుతున్నాడు. అతని జీవితంలో కొత్త సూర్యుడు ఉదయించాడు. సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు నారింజ రంగులో ఉంటాడు. మీ జీవితంలో కొత్త కాంతి వచ్చిందని, మీలో కొత్త ఉదయం జరిగిందని సూచించడానికి ఈ రంగును ధరిస్తారు. మరో అంశం ఏమిటంటే… పండు పరిపక్వమైనప్పుడు… అది నారింజ రంగులోకి మారుతుంది. ఒక వ్యక్తి నిర్దిష్ట స్థాయి పరిణతి లేదా పరిపక్వత చెందినప్పుడు… ఈ రంగు ఉపయోగిస్తాడు.
*తెలుపు:
మనకు ఏడు రంగులు ఉన్నాయి. తెలుపు ఎనిమిదో రంగు. అందుకే దీన్ని ‘ఆట్వారంగ్‌’… అంటే ఎనిమిదో వర్ణం అంటారు. నిజానికి తెలుపు ఒక రంగు కాదు. ఏ రంగూ లేనప్పుడు… తెలుపు మాత్రమే ఉంటుంది. రంగు లేకపోవడం వల్ల అది తెల్లగా కనిపిస్తుంది. అదే సమయంలో, అది అన్నిటినీ కలుపుకొంటుంది. మీరు చూసే తెల్లని కాంతి ఏడు రంగులు కలిగి ఉంటుంది. ఆ తెల్లటి కాంతిని వక్రీభవనం చేసి… ఆ ఏడు రంగులనూ వేరు చేయవచ్చు. తెలుపు మనమీద మంచి ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా ఉష్ణమండల ప్రాంతాల్లో నివసించేవారు ధరించడానికి ఈ రంగు అత్యుత్తమం. వాతావరణపరంగానూ సౌకర్యంగా ఉంటుంది. నారింజ రంగు ధరించే వ్యక్తి కుటుంబ, సామాజిక పరిస్థితుల నుంచి తనను తాను విడదీసుకుంటాడు. తెలుపును ఎంచుకొనేవారు ఆద్యాత్మిక మార్గంలో నడుస్తారు… అయినప్పటికీ జీవితంలోని ఇతర అంశాల్లో కూడా నిగమ్నమై ఉంటారు. అయితే తమ చుట్టూ ఉన్నవాటిని సేకరించడానికి ఇష్టపడరు.
*పసుపు:
బౌద్ధ సంప్రదాయంలో… అర్హతా స్థాయిని చేరుకున్న సన్న్యాసులు జేగురు రంగు దుస్తులు ధరిస్తారు. మిగిలిన వారు పసుపు రంగు దుస్తులే ధరిస్తారు. ఎందుకంటే… బౌద్ధ సన్న్యాసులకు ప్రారంభ దశలో గౌతముడు అందించిన ప్రక్రియ చాలా ప్రాథమికమైనది. వారికోసం ఈ ప్రక్రియను ఆయన ఎంచుకోవడానికి కారణం ఏమిటంటే… ఆయన ఎక్కువకాలం ఒకే చోట ఉండలేదు. నిరంతరం సంచారంలో ఉండేవాడు. ప్రజలను ఏ విధమైన అభ్యాసానికయినా సిద్ధం చెయ్యడానికి సమయం లేదు. కాబట్టి, వారికి ప్రాథమికమైన ప్రక్రియను ఆయన అందించాడు. వారిని సన్న్యాసులుగా మారుస్తున్నా, వారి జీవితాలను సరి చేస్తున్నా… వారికి తగినంత సాధన సామగ్రి ఇవ్వలేదు. కాబట్టి పసుపు వస్త్రాన్ని ధరించమని చెప్పాడు. ఎందుకంటే… పసుపు మూలాధార చక్రం రంగు. అది శరీరంలో అత్యంత ప్రాథమికమైన చక్రం. వారు స్థిరంగా ఉండాలని గౌతముడు కోరుకున్నాడు.
**కొన్ని జీవితకాలాలపాటు కొనసాగే ఆధ్యాత్మిక ప్రక్రియను రూపొందించేటప్పుడు ఇలాంటి ప్రక్రియను నేర్పిస్తారు. బౌద్ధ జీవన విధానంలో ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. వాళ్ళు మళ్ళీ, మళ్ళీ పని చేయడానికి ఇక్కడికి వస్తారు. కారణమేమిటంటే… ఈ ప్రక్రియ వారిని వారు స్థిరపరుచుకోవడానికి తప్ప… తమను తాము తెలుసుకోవడానికి కాదు. కాబట్టి వారిని పసుపు దుస్తులు ధరించాలని గౌతముడు చెప్పాడు.
*నలుపు:
శక్తిమంతమయిన ఒక నిర్దిష్టమైన స్థలంలో మనం ఉండి.. ఆ శక్తిని మనం గ్రహించాలనుకుంటే… నల్ల రంగు మంచిది. నల్ల రంగు అన్నిటినీ తనలో ఇముడ్చుకుంటుంది. దేన్నీ బయటకు ఇవ్వదు. ఆ రంగు ధరించి మీరు మంచి చోటికి వెళ్తే మంచి గ్రహిస్తారు. చెడ్డ చోటుకు వెళితే చెడు గ్రహిస్తారు. కాబట్టి దాన్ని ధరించడానికి ప్రతి ఒక్కరూ అర్హులు కాదు. నిరంతరం నల్ల దుస్తులు ధరించి… వివిధ పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు… మీ శక్తులు హెచ్చుతగ్గులకు గురి కావడం గమనించవచ్చు. అది మీ నుంచి భావోద్వేగాలన్నిటినీ పీల్చేసి, మీ మనసును చాలా అస్థిరమైన, అసమతుల్యమైన స్థితిలోకి తీసుకువెళ్తుంది. అనిర్వచనీయమైన బాధకు గురి చేస్తుంది. అయితే, సకారాత్మకమైన, ఉత్సాహభరితమైన సందర్భాల్లో నల్ల రంగు ధరిస్తే… దాని నుంచి చాలా మంచి చేసే అద్భుతమైన శక్తిని మీరు గ్రహిస్తారు. మీరు వెళ్ళే స్థలం సరైనదని తెలిసినప్పుడు మాత్రమే నల్ల రంగు ధరించాలి.
**రాగం – వైరాగ్యం
‘వైరాగ్యం’ అనే పదంలో… ‘రాగం’ అనే మాటకు రంగు అని, ‘వై’ అంటే ‘అంతకు మించి’, ‘అతీతంగా’ అని అర్థం. ‘వైరాగ్యం’ అంటే రంగులకు అతీతమైనది. మీరు పారదర్శకంగా ఉన్నట్టయితే… మీ వెనుక ఏ రంగు ఉంటే ఆ రంగంలోకి మారుతారు. పక్షపాతం లేనివారైతే మీరు ఎక్కడ ఉన్నా దానిలో భాగం అవుతారు. కానీ మీకు ఏదీ అంటదు.. మీరు ఆ వైరాగ్య స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే… జీవితంలోని అన్ని కోణాలనూ అన్వేషించే ధైర్యం చెయ్యగలరు.