Politics

రేవంత్ ఛాలెంజ్ చేస్తే నేను రాజీనామ చేస్తా.. – TNI రాజకీయ వార్తలు

రేవంత్ ఛాలెంజ్ చేస్తే నేను రాజీనామ చేస్తా.. – TNI రాజకీయ వార్తలు

* తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వర్గంపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ షోకాజ్ నోటీస్ ఇస్తే సమాధానం చెబుతానన్నారు.మమ్మల్ని సస్పెండ్ చేసే దమ్ము ఎవరికీ లేదన్నారు. తనను సస్పెండ్ చేసినా కాంగ్రెస్‌కు, సోనియా, రాహుల్‌కు విధేయుడుగా ఉంటానని, రేవంత్ ఛాలెంజ్ చేస్తే తాను రాజీనామ చేస్తానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.తన నియోకవర్గంలో అభ్యర్థిని నిలబెట్టి గెలిపిస్తే రేవంత్ హీరో అని ఒప్పుకుంటానని జగ్గారెడ్డి అన్నారు. తాను గెలిస్తే హీరోనని, ఇద్దరం ఓడితే జీరోలమేనన్నారు. తనను సస్పెండ్ చేస్తే, రోజుకో బండారం బయట పెడుతానన్నారు. రేవంత్ పార్టీ లైన్‌లో పని చేయడం లేదని, పర్సనల్ షో చేస్తున్నారని, అందుకే తాను కూడా పర్సనల్ షో చేస్తున్నానన్నారు. తన కూమార్తె సమస్యపై వీహెచ్ మంత్రి హరీష్ రావును కలిస్తే తప్పేంటని జగ్గారెడ్డి ప్రశ్నించారు.

* కాంగ్రెస్‌లోని సంస్థాగత లోపాలు గుర్తించాలి: మర్రి శశిధర్‌రెడ్డి
కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం లక్డీకపూల్‌లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లోని సంస్థాగత లోపాలు గుర్తించాలని, మార్పులు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ బలోపేతం కోసమే తీసుకుంటుందని తెలిపారు.రేపటి ఎన్నికలు పార్టీ మనుగడకు చాలా కీలమని శశిధర్‌రెడ్డి తెలిపారు. ఐదు రాష్ట్రాల్లో ఓడిపోయాం, హుజురాబాద్‌లో కూడా ఓడామని, అటువంటి పరిస్థితి తెలంగాణలో రాకూడనే ఈ సమావేశం నిర్వహించామని తెలిపారు. ఇది అసమ్మతి సమావేశం కాదు.. బాధ్యత గల నేతలుగా తాము సమావేశమయ్యామని తెలిపారు. గత మూడేళ్లుగా సమావేశం అవుతూనే ఉన్నామని తెలిపారు. ఇది మొదటి, చివరి సమావేశం కాదని ఆయన గుర్తుచేశారు.

*ఫీజు రీయింబర్స్‌మెంట్ వైసీపీ పెద్దలకేనా?: అనగాని
ఫీజు రీయింబర్స్‌మెంట్ వైసీపీ పెద్దలకేనా?.. పేద విద్యార్థులకు లేదా? అని టీడీపీ నేతలు అనగాని సత్యప్రసాద్, డోలా బాలవీరాంజనేయ స్వామి ప్రశ్నించారు. ఆదివారం టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ జగన్‌ విద్యాదీవెనను నిలిపివేస్తూ జీవో 77 తేవడం దుర్మార్గమని తప్పుబట్టారు. జీవో 77తో విద్యార్థులను కూలీలుగా మారుస్తున్నారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేద విద్యార్థుల ఉన్నత చదువుల కలను చెరిపివేశారని తప్పుబట్టారు. 5.18 లక్షల మంది విద్యార్ధులకు రీయంబర్స్‌మెంట్ దూరం చేసి.. వారి భవిష్యత్ నాశనం చేశారని సత్యప్రసాద్, బాలవీరాంజనేయ మండిపడ్డారు.

*వాస్తవాలను ప్రభుత్వం దుర్మార్గంగా కప్పిపుచ్చుతోంది: రామకృష్ణ
కల్తీ సారా తాగి 25 మంది జంగారెడ్డిగూడెంలో చనిపోయారని, వాస్తవాలను దుర్మార్గంగా ప్రభుత్వం కప్పిపుచ్చుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో సీఎం జగన్ అబద్దాలు చెప్పి దిగజారారన్నారు. స్ధానికంగా బాధితుల ఇళ్ళ వద్దకు వెళ్ళి మేము 25 మంది మృతుల లిస్టు సేకరించామన్నారు. ఎక్సైజు మంత్రిని, సజ్జలను జంగారెడ్డిగూడెంకు పంపాలని సూచించారు. వారిపై తమకు నమ్మకం ఉందన్నారు. సహజమరణాలని ప్రభుత్వం అబద్ధాలు చెపుతోందన్నారు. కల్తీసారా అమ్ముతున్నారని ప్రభుత్వమే చెపుతోందని, 148 కేసులు.. 156 మందిపై కేసు పెట్టారని, 39,700 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసినట్లు ఎక్సైజుశాఖ అధికారులు చెపుతున్న ఈ లెక్కలు తప్పా?.. సీఎం జగన్ చెప్పేది తప్పా?… అని ప్రశ్నించారు. అవాస్తవాలు చెప్పినందుకు ముఖ్యమంత్రి అసెంబ్లీలో క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గత బ్రాండ్లకు సీఎం నిషేధం పెట్టారని, సొంత మద్యం అమ్మించిన ఏకైక వ్యక్తి సీఎం జగన్ అని అన్నారు. ప్రభుత్వ మద్యం రేటు పెట్టలేక.. ఈ మందు తాగి చనిపోయారని, దీనికి కారణమైన వారిపై ఐపీసీ 302 కింద కేసులు నమోదు చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

*వైసీపీని గద్దె దింపేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నాం: సోము వీర్రాజు
రాబోయే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నాం బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్ సోము వీర్రాజు అన్నారు. బీజేపి జనసేన కలసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని సోము వీర్రాజు స్పష్టం చేశారు. టీడీపీతో పొత్తువుంటుందని మేము చెప్పలేదు మీరనుకుంటున్నారు అంటూ మీడియానుద్దేశించి అన్నారు.రాష్ట్రానికి కేంద్రం ఏమిచ్చిందో వైసీపీ మంత్రులతో బహిరంగ చర్చకు తాము సిద్ధమని ఆయన సవాల్ చేశారు.వైసీపీ నవరత్నాలు కేంద్రం నిధులతో అమలు చేస్తున్నారు. ఏపీ పై ప్రత్యేక ప్రేమతో కేంద్రం ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులు ఇస్తుందన్నారు. ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజి తో ఎక్కువ నిధులు వచ్చాయని ప్రకటించిన చంద్రబాబు జగన్ మాయలో పడి యూ టర్న్ తీసుకున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు కేంద్రం నిధులతోనే నిర్మిస్తామని ఆయన స్పష్టం చేశారు.

*బీజేపీపై రాహుల్ గాంధీ విమర్శలు
బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఉక్రెయిన్ యుద్ధానికి ముందు కూడా “రికార్డ్ ధరల పెరుగుదల”తో భారతదేశంలోని పేద, మధ్యతరగతి ప్రజలు నలిగిపోయారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ విమర్శించారు. “ద్రవ్యోల్బణం అనేది భారతీయులందరిపై పన్ను.. భారత పౌరులను రక్షించడానికి జీవోఐ తప్పక చర్య తీసుకోవాలని రాహుల్ గాంధీ అన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైన కొద్ది రోజులకే ఆయన విమర్శలు గుప్పించారు.

*యోగి ప్రమాణస్వీకారానికి సోనియా వెళ్లొద్దు: రషీద్ అల్వీ
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ దూరంగా ఉండాలని, ఆమె హాజరయితే మైనారిటీ వర్గాలకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశాలున్నాయని ఆ పార్టీ సీనియర్ నేత రషీద్ అల్వీ శనివారంనాడు అన్నారు.యోగి ఆదిత్యనాథ్ ఈనెల 25న సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి విపక్షాల నుంచి సోనియాగాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, ఎస్‌పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, బీఎస్‌పీ చీఫ్ మాయవతి తదితరులను బీజేపీ ఆహ్వాస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోనియాతో పాటు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి దూరంగా ఉండటం మంచిదని అల్వీ పేర్కొన్నారు. ”అదిత్యనాథ్ గత ఐదేళ్ల పాలనలో విద్వేష వ్యాప్తి చేస్తూ వచ్చారు. 80 వెర్సన్ 20 నినాదంతోనే ఆయన ఎన్నికల్లో గెలిచారు. బుల్‌డోజర్లు నడపడంపైనే మాట్లాడారు. సంప్రదాయాలు, విలువలు, దేశ సంస్కృతిని నమ్మే ఏ నేత అయినా ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారానికి దూరంగా ఉండటం మంచిది” అని ఆయన అన్నారు.

*ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న వైసీపీ: మనోహర్‌
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాలరాసే విధంగా వైసీపీ పాలన సాగుతోందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. ‘అధికారంలో ఉన్నాం.. ఏం మాట్లాడినా.. ఏం చేసినా చెల్లిపోతుంది’ అనుకుంటే పొరపాటేనని హితవు పలికారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలే ఓటుతో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వం కచ్ఛితంగా మళ్లీ అధికారంలోకి రాదని చెప్పారు. ‘ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి మాటలు చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఇంత అహంకారం ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావడం లేదు. పవన్‌ కల్యాణ్‌ను వ్యక్తిగతంగా టార్గెట్‌ చేస్తున్నారు. మా నాయకత్వాన్ని చులకన చేసి మాట్లాడితే సహించేది లేదు’ అన్నారు. పవన్‌ కల్యాణ్‌ సూచన ఆదివారం నుంచి 27వరకూ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కొనసాగిస్తామని తెలిపారు.

*ఎక్కడ పోటీ చేసినా పవన్‌ ను ఓడిస్తాం: ద్వారంపూడి
‘‘పవన్‌ కల్యాణ్‌ కాకినాడలోగానీ, జిల్లాలోగానీ ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తాం. ఆయన కాకినాడలో పోటీ చేస్తే సంతోషమే. జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా అక్కడ ఇన్‌చార్జిగా వేయించుకుని మరీ ఓడి ంచడానికి సిద్ధంగా ఉన్నాం’’ అని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అన్నారు. 15 రోజులు మేకప్‌, 15 రోజులు విశ్రాంతి, 2 రోజులు రాజకీయాలు… ఆయన దైనందిన జీవితమని ఎద్దేవా చేశారు. ‘‘పవన్‌కల్యాణ్‌ నిజాలు తెలుసుకుని మాట్లాడాలి. నన్ను విమర్శించినంత మాత్రాన కుంగిపోను. నా జోలికొస్తే నూరు శాతం తిరగబడతా. జ్యోతుల నవీన్‌, వనమాడి కొండబాబు వారి లిమిట్స్‌లో వారుండి మాట్లాడాలి. కొండబాబు హయాంలోనే కాకినాడ దోపిడీకి గురైంది. గంజాయి, గుట్కా వ్యాపారాలు సాగాయి. ఏటిమొగను అడ్డాగా మార్చుకుని సారా కాస్తున్నారు’’ అని ద్వారంపూడి ఆరోపించారు.

*రైతు సమస్యలను పట్టించుకోరేం?: షబ్బీర్‌ అలీ
యాసంగి వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేది లేదని అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం చెబుతుండటంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ మండిపడ్డారు. ప్రభుత్వాల వైఖరితో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యాసంగి పంటకు సంబంధించి నిజాంసాగర్‌ ఆయకట్టు కింద మరో 10 రోజుల్లో వరి కోతలు ప్రారంభమవుతాయని, సుమారు 83 వేల టన్నుల ధాన్యం రాబోతుందని చెప్పారు. రైతుల ధాన్యాన్ని ఎవరు కొంటారో ప్రభుత్వాలే చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే రైతుల పక్షాన కాంగ్రెస్‌ ఉద్యమిస్తుందని హెచ్చరించారు.

*బీజేపీ నేతలు ఒక్కరూ మిగలరు: గంగుల
‘‘టీఆర్‌ఎస్‌ అభివృద్ధి అజెండాతో ముందుకు వెళ్తోంది. బీజేపీ మాత్రం విధ్వంస బాట పడుతోంది. ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, బిహార్‌లో బడుగు, బలహీన వర్గాలపై దాడులు చేసిన విధంగా తెలంగాణాలోనూ బుల్డోజర్లతో తొక్కించే ప్రయత్నం చేస్తోంది. మా సహనం నశిస్తే బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కరూ మిగలరు’’ అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఆగయ్య ఇంటిపై బీజేపీ నాయకులు దాడి చేయడం దారుణమని మండిపడ్డారు. శనివారం ఆగయ్యను పరామర్శించిన అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడారు. ఈ దాడులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పందించాలని, లేదంటే దాడుల్లో ఆయన ప్రమేయం ఉందని భావిస్తామని అన్నారు. కాగా టీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు పోలీస్‌స్టేషన్‌లో ఈ నెల 18న బాహాబాహీకి దిగడంతో ఇరువర్గాల ఫిర్యాదు మేరకు.. రెండు పార్టీలకు చెందిన పలువరు నేతలపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై శేఖర్‌ తెలిపారు.

*ఆ పథకంతో ప్రతి దళితుడు ఆర్థికాభివృద్ధి సాధించాలి : మంత్రి గంగుల
దళితబంధు పథకంతో ప్రతి దళితుడు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన కరీంనగర్ నియోజకవర్గ దళిత బంధు సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం దేశం గర్వించేలా తెలంగాణలో అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెడుతుందని పేర్కొన్నారు.దాదాసాహెబ్ డా. బి.ఆర్. అంబేడ్కర్ ఒక కులానికి, వర్గానికి చెందిన వ్యక్తి కాదని, వారు ఈ దేశ సంపదని మంత్రి కొనియాడారు. అంబేద్కర్ కన్న కలలను నిజంచేయాలన్నారు. సమానత్వం, సమసమాజ నిర్మాణానికి అనేక మంది పోరాడారని గుర్తు చేశారు. అమెరికా వంటి అభివృద్ది చెందిన దేశాలలో రైతులు, టీచర్లను మాత్రమే సర్ అని సంబోధిస్తారని, మిగిలిన వారందరిని సమానంగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు.దళితులు, బీసీలు ఆర్థికంగా వెనుకబడి ఉండరాదనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని అన్నారు. దళితబందు పథకం ద్వారా పెట్టుబడి పెట్టి కొనుగోలు చేసిన వాటిని కొనుగోలు చేయడం, అమ్మడం చేసినట్లయితే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, నగర మేయర్ వై. సునీల్ రావు, ఆర్డీవో ఆనంద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.