NRI-NRT

బోస్టన్‌లో బిజీబిజీగా కేటీఆర్

KTR Tours Boston - Meets With Apple Ex CEO - బోస్టన్‌లో బిజీబిజీగా కేటీఆర్

తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమెరికాలోని మసాచుసెట్స్‌ రాష్ట్ర గవర్నర్‌ చార్లీ బేకర్‌ ప్రకటించారు. ఆరోగ్య రంగంపై బోస్టన్‌లో జరుగుతున్న ‘గ్లోబల్‌ ఇన్నోవేషన్‌-2022’ సదస్సులో భాగంగా తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చార్లీ బేకర్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌, బోస్టన్‌ నగరాల మధ్య అనేక సారూప్యతలు ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా హైదరాబాద్‌ మాదిరిగా బోస్టన్‌లోనూ అనేక ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌, ఐటీ రంగాలకు చెందిన పరిశ్రమలు ఉన్నాయని తెలిపారు. ఈ రెండు రాష్ట్రాల మధ్య పెట్టుబడులకు సంబంధించిన పరస్పర అంశాలను పరిశీలించడంతో పాటు లైఫ్‌ సైన్సెస్, ఫార్మా కంపెనీల మధ్య అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవాల్సిన అవసరం ఉందదని గవర్నర్‌ చార్లీ బేకర్‌ అభిప్రాయపడ్డారు. బోస్టన్‌లో హెల్త్‌ కార్డుల డిజిటలీకరణ కొనసాగుతోందని.. తద్వారా ఇక్కడి ప్రజలకు అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయని కేటీఆర్‌కు గవర్నర్‌ వివరించారు. ముఖ్యంగా కరోనా సంక్షోభ సమయంలో దీనివల్ల వేగంగా ప్రజలకు చికిత్స అందించే అవకాశం కలిగిందన్నారు.
KTR Tours Boston - Meets With Apple Ex CEO - బోస్టన్‌లో బిజీబిజీగా కేటీఆర్
అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌- బోస్టన్‌ నగరాల మధ్య అవగాహన కోసం చేపట్టే కార్యక్రమాలతో భవిష్యత్‌లో మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశముందన్నారు. బయో, లైఫ్‌ సైన్సెస్‌ రంగాలకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉన్న అవకాశాలు మంత్రి వివరించారు. హైదరాబాద్‌లో పెట్టుబడులకు ముందుకురావాలని ఈ సందర్భంగా కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐకా సొల్యుషన్స్ సీఈఓ ఐకా రవి, ప్రవాస ప్రముఖులు గుత్తికొండ శ్రీనివాస్, వల్లేపల్లి శశికాంత్, యాపిల్ మాజీ సీఈఓ జాన్ స్కల్లీ తదితరులు పాల్గొన్నారు.