Kids

KIDS: జిత్తులమారి నక్క!

జిత్తులమారి నక్క!

ఒక అడవిలో సింహం, ఎలుగుబంటి నివసించేవి. అవి రెండు ప్రాణస్నేహితులుగా ఉండేవి. వాటి స్నేహం చూసి అడవిలోని మిగతా జంతువులు కుళ్లుకునేవి. కొంతకాలం తరువాత వర్షాలు లేక అడవి మొత్తం ఎండిపోయింది. తీవ్ర కరువు కాటకాలతో చాలా జంతువులు ఆహారం లేక చనిపోయాయి. ఎలుగుబంటి, సింహం సైతం ఆకలికి తట్టుకోలేక ఏదైనా ఆహారం దొరకపోతుందా అని తమ ప్రాంతాన్ని వదిలి బయలుదేరాయి. అడవంతా గాలిస్తుండగా ఒకచోట నక్క చనిపోయిన దుప్పి మాంసం తింటోంది. ఎలుగుబంటి అది చూసి నక్కను తరిమేసింది. దుప్పి మాంసం తినమని సింహాన్ని ఆహ్వానించింది. సింహం, ఎలుగుబంటి ఆ దుప్పి మాంసం తినసాగాయి. అది చూసిన నక్కకు ఒళ్లు మండిపోయింది. వాటిమధ్య ఉన్న స్నేహాన్ని చెడగొట్టాలని అనుకుంది. నెమ్మదిగా ఎలుగుబంటిని సమీపించి ‘‘దుప్పి మాంసం ఇక్కడ ఉందని మొదట చూసింది నువ్వు. చూసినవాళ్లకే హక్కు ఉంటుంది కదా! కానీ ఆ సింహం మొత్తం తనే తినేస్తోంది. ముందుగా నువ్వు తిను. మిగిలింది తనను తినమను’’ అని ఎలుగుబంటితో అంది. ఆ మాటలు విన్న ఎలుగుబంటి నిజమే ఇక్కడ మాంసం ఉన్నదని చూసింది నేనే కదా! అని మనసులో అనుకుని సింహంతో ‘‘నువ్వు పక్కకు జరుగు. ముందుగా నేను తినని. మిగిలితే నువ్వు తిందువు’’ అని అంది. ఆ మాటలకు కోపగించుకున్న సింహం ‘‘నేను ఈ అడవికి రాజుని. నన్నే పక్కకు జరగమంటావా? నీ సంగతి చూస్తాను’’ అంటూ తన పంజాతో ఎలుగుబంటిపై ఒక్కవేటు వేసింది. ఆ దెబ్బకు ఎలుగుబంటి విలవిల్లాడింది. నక్క మాటలు విని మంచి స్నేహాన్ని పోగొట్టుకుంది. చివరకు తన ప్రాణాలు విడిచింది.