DailyDose

విదేశీ విరాళాలు ‘హక్కు’ కాదు!

విదేశీ విరాళాలు ‘హక్కు’ కాదు!

విదేశీ విరాళాల స్వీకరణ.. భారత పౌరులకు సంపూర్ణ హక్కు కానేకాదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. వాటిని అనుమతించాలా వద్దా అనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయంగా పేర్కొంది. విదేశీ విరాళాలను పూర్తిగా నిషేధించే హక్కు సర్కారుకు ఉందని తేల్చిచెప్పింది. భారత్‌లోని ధార్మిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు విదేశీ విరాళాలు తీసుకోవడంపై ఆంక్షలు విధిస్తూ కేంద్రం తీసుకొచ్చిన విదేశీ విరాళాల క్రమబద్ధీకరణ సవరణ (ఎఫ్‌సీఆర్‌ఏ-2020) చట్టానికి రాజ్యాంగబద్ధత ఉందని ‘నోయల్‌ హార్పర్‌ వర్సెస్‌ కేంద్రప్రభుత్వం’ కేసులో శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. ‘విదేశీ విరాళాలను స్వీకరించే హక్కు దేశ పౌరులకు లేదు. స్వీకరించేందుకు అనుమతివ్వాలా వద్దా అనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం. విదేశీ విరాళాలను ప్రభుత్వాలు సంపూర్ణంగా నిషేధించవచ్చు.మనదేశంలో దాతలకు కొదవ లేదు. ధార్మిక సంస్థలు వారిపై దృష్టిపెట్టాలి. విదేశీ విరాళాలిచ్చి ఏదైనా దేశం మనల్ని ప్రభావితం చేయడాన్ని తద్వారా అడ్డుకోవచ్చు. పార్లమెంటు రూపుదిద్దిన ఫ్రేమ్‌వర్క్‌ వెలుపల విదేశీ విరాళాలు తీసుకునే హక్కు ఎవరికీ సంక్రమించలేదనేది నిర్వివాదం. విదేశీ విరాళాలు మన దేశ విధానాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అంతేకాదు విదేశీ రాజకీయ సిద్ధాంతాలను రుద్దడానికి దారితీయవచ్చు. అందుచేత వాటిని నియంత్రించాలి. రాజ్యాంగ నైతిక సిద్ధాంతం దృష్ట్యా వాటిని పూర్తిగా అడ్డుకోలేకున్నా.. కనిష్ఠ పరిమాణంలో ఉండేలా చూడాలి’ అని జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి, జస్టిస్‌ సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ చట్టంలోని సెక్షన్‌ 7 (విదేశీ విరాళాల బదిలీపై నిషేధం), సెక్షన్‌ 12ఏ (ముందస్తు అనుమతికి ఆధార్‌ నంబరును గుర్తింపు కార్డుగా చూపాలనడం), సెక్షన్‌ 17 (ఢిల్లీలో కేంద్రం నోటిఫై చేసిన ఎస్‌బీఐ బ్రాంచ్‌లో ఎఫ్‌సీఆర్‌ఏ ప్రాథమిక ఖాతా తెరవడం తప్పనిసరి)లను సవాల్‌ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది గోపాల్‌ శంకరనారాయణన్‌, న్యాయవాది గౌతమ్‌ ఝా.. ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, అదనపు సొలిసిటర్‌ జనరల్‌ సంజయ్‌ జైన్‌ వాదనలు వినిపించారు.

*చారిటీ ఓ వ్యాపారం!
చారిటీ కార్యకలాపాలు ఓ వ్యాపారమేనని సుప్రీంకోర్టు పేర్కొంది. ‘ఇందుకోసం భారత్‌లోనే విరాళాలు స్వీకరిస్తే వాటిని వేరే విధానంలో నియంత్రిస్తున్నారు. నియంత్రించాలి కూడా.. అయితే విదేశీ విరాళాల విషయంలోనూ అలాగే చేయడం సాధ్యం కాదు’ అని తెలిపింది. విదేశీ విరాళాలకు, విదేశీ పెట్టుబడులకు తేడా ఉందని పేర్కొంది. విదేశీ విరాళాలపై ఆధారపడి ఏ దేశ ఆకాంక్షలనైనా నెరవేర్చలేమని.. పౌరుల సంకల్పం, దృఢనిశ్చయం, పరిశ్రమల కఠోర కృషి ద్వారా మాత్రమే లక్ష్యాలను సాధించగలమని స్పష్టం చేసింది. సెక్షన్లు 12ఏ, 17ల చట్టబద్ధతను సమర్థించింది. విరాళాలకు అనుమతులు తీసుకునేవారి విషయంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సరైన వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత పార్లమెంటుదేనని తెలిపింది. అయితే 12ఏ విషయంలో కాస్త ఔదార్యం చూపింది. ఎఫ్‌సీఆర్‌ఏ క్లియరెన్స్‌కు ఆధార్‌ నంబర్‌ అక్కర్లేదని.. ధార్మిక సంఘాలు/స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు (భారత పౌరులు) తమ గుర్తింపు కోసం పాస్‌పోర్టులు సమర్పించేందుకు అనుమతించాలని ధర్మాసనం సూచించింది. ఎఫ్‌సీఆర్‌ఏ చట్టం కింద.. విదేశీ విరాళాల స్వీకరణకు ముందస్తు అనుమతి తీసుకున్నవారు గానీ.. రిజిస్టర్‌ చేసుకున్నవారు గానీ.. ధ్రువపత్రం పొందినవారు గానీ.. వచ్చిన మొత్తాన్ని సదరు సంస్థ ద్వారానే ఖర్చుపెట్టాలని.. ఇతరుల ద్వారా వ్యయం చేయకూడదని సెక్షన్‌ 7 చెబుతోంది. అయితే సాంస్కృతిక, ఆర్థిక, విద్య, సామాజిక కార్యక్రమాల కోసం తీసుకున్న విరాళాలను అందుకోసమే బదిలీచేస్తే ఆమోదయోగ్యమేనని ధర్మాసనం తెలిపింది. ఎఫ్‌సీఆర్‌ఏ ప్రాథమిక ఖాతాను ఢిల్లీ బ్యాంకులో తెరవాలనడాన్ని సమర్థించింది. ఆ ఖాతా ద్వారానే నిధుల వినియోగం జరగాలన్న నిబంధన ఏదీలేదని.. ఇతర షెడ్యూల్డ్‌ బ్యాంకుల్లో ఖాతాలు నిర్వహించుకోవచ్చని పేర్కొంది. 2010నాటి ఎఫ్‌సీఆర్‌ఏ చట్టంలోని సవరించని సెక్షన్‌ 7 మెరుగ్గా ఉందని.. ఎక్కువ నియంత్రణలు లేవన్న వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కేవలం అసౌకర్యం కలిగినంత మాత్రాన చట్టం రాజ్యాంగబద్ధతను సవాల్‌ చేయడానికి అది ప్రాతిపదిక కాదని స్పష్టం చేసింది. సవరించిన నిబంధన ఏ విధంగా రాజ్యాంగవిరుద్ధమో తమకు అర్థం కావడం లేదని పేర్కొంది. ‘విదేశీ విరాళాల సేకరణ ఔషధ గుణాలున్న మత్తు పదార్థం లాంటిది. అది అమృతంలా పనిచేయొచ్చు. కానీ పరిమితంగా.. విచక్షణతో వాడినంతవరకు అది బాగానే ఉంటుంది. మానవాళి విస్తృత ప్రయోజనాలకు తోడ్పడుతుంది. అపరిమితంగా, విచక్షణరహితంగా వాడితే చెప్పలేనంత బాధ, దుఃఖం కలిగించే సామర్థ్యం దానికి ఉంది. అదేవిధంగా నియంత్రణ లేకుండా విదేశీ విరాళాలు వెల్లువెత్తితే.. దేశ సార్వభౌమాధికారానికి, సమగ్రతకు.. శాంతిభద్రతలకు ముప్పు ఏర్పడుతుంది. ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుంది’ అని స్పష్టం చేసింది. స్వచ్ఛంద సంస్థల విదేశీ విరాళాలను నియంత్రించేందుకే ఈ సవరణలను ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపింది. విదేశీ నిధుల దుర్వినియోగం, గత అనుభవాల దృష్ట్యా కఠిన నిబంధనలు అవసరమని తేల్చిచెప్పింది.