NRI-NRT

డిపెండెంట్‌ వీసాదారులకు శుభవార్త

డిపెండెంట్‌ వీసాదారులకు శుభవార్త

హెచ్‌-4 వీసాతో డిపెండెంట్లుగా అమెరికా వెళ్లినవారికి శుభవార్త. ఇలాంటివారు అమెరికాలో ఉద్యోగం చేయాలంటే… ప్రత్యేకంగా అనుమతి తీసుకునే అవసరం లేకుండా ఒక బిల్లును ఆ దేశంలోని ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ఆమోదిస్తే… హెచ్‌-1బి వీసాతో అమెరికా వెళ్లినవారి జీవిత భాగస్వాములకు ప్రయోజనం ఉంటుంది. హెచ్‌-4 వీసా ఉన్నవారందరూ ఆటోమ్యాటిగ్గా ఉద్యోగం చేసుకోవడానికి అర్హులవుతారు. భారత్‌ నుంచి హెచ్‌-1బి వీసాతో అమెరికా వెళ్లేవారు… హెచ్‌-4 వీసాతో తమ జీవిత భాగస్వాములను డిపెండెంట్లుగా తీసుకెళ్తుంటారు. ఇలా వెళ్లిన డిపెండెంట్లు అక్కడ ఉద్యోగం చేయాలంటే ఎంప్లాయ్‌మెంట్‌ ఆథరైజేషన్‌ డాక్యుమెంట్‌ (ఈఏడీ) కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తవడానికి కనీసం ఆరు నుంచి ఎనిమిది నెలల వరకు పడుతుంది. కొన్ని దరఖాస్తులను ప్రాసెస్‌ చేయడానికి ఏడాది, అంతకంటే ఎక్కువ సమయం కూడా తీసుకుంటారు. ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ వద్ద బ్యాక్‌లాగ్‌ దరఖాస్తులు ఎక్కువగా ఉంటే ఆథరైజేషన్‌ పూర్తవడానికి మరింత సమయం పట్టవచ్చు. తాజాగా ప్రవేశపెట్టిన బిల్లును అనుసరించి… ఆథరైజేషన్‌ ప్రక్రియ అవసరం ఉండదు. అమెరికాలో స్కిల్డ్‌ వర్కర్స్‌ కొరతను అధిగమించడానికి ఈ బిల్లును ప్రవేశపెట్టామని ప్రతినిధుల సభ సభ్యులు చెప్పారు. మరోవైపు… నిరుపయోగంగా ఉన్న 3.8 లక్షల ఫ్యామిలీ స్పాన్సర్డ్‌ వీసాలు, ఎంప్లాయ్‌మెంట్‌ ఆధారిత వీసాలను ఉపయోగించుకోవడానికి అమెరికా కాంగ్రె్‌సలో ఇంకో బిల్లును ప్రవేశపెట్టారు. దీంతో పెండింగ్‌ గ్రీన్‌కార్డుల సంఖ్యను తగ్గించవచ్చని కాంగ్రెస్‌ సభ్యులు పేర్కొన్నారు.