FoodHealth

మజ్జిగను సంస్కృతంలో ఏమంటారు? వేసవిలో ఎక్కువగా తాగుతున్నారా?

మజ్జిగను సంస్కృతంలో ఏమంటారు? వేసవిలో ఎక్కువగా తాగుతున్నారా?

కాఫీ, టీలు ప్రాచుర్యంలోకి రాకముందు మజ్జిగ మనవాళ్ల మర్యాద పానీయం. వేసవితాపం నుంచి తక్షణ ఉపశమం పొందడానికి మజ్జిగ ప్రశస్తమైన పానీయం. తోడుపెట్టిన పెరుగులో రెట్టింపు నీరు కలిపి, బాగా చిలికి మజ్జిగను తయారు చేస్తారు. చిలికిన తర్వాత వెన్నను వేరుగా తీసేసిన మజ్జిగ చాలామంచిది. రుచి కోసం ఇందులో తగినంత ఉప్పు, సన్నగా తురిమిన అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, సైంధవ లవణం వంటివి చేర్చి మరీ మజ్జిగ సేవించడం కొందరి అలవాటు. మజ్జిగను సంస్కృతంలో ‘తక్రం’ అంటారు.
‘తక్రం త్రిదోష శమనం రుచి దీపనీయం’ అని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. మజ్జిగ సేవించడం వల్ల శరీరంలోని త్రిదోషాలైన వాత, పిత్త, కఫ దోషాలు తొలగిపోతాయని, నోటికి రుచి పెరిగి, అన్నహితవు కలుగుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతారు. మజ్జిగలోని క్యాల్షియం, విటమిన్‌–డి, విటమిన్‌–బి6, సోడియం, పొటాషియం వంటి పోషకాలు శరీరాన్ని డీహైడ్రేషన్‌ నుంచి కాపాడతాయి. మజ్జిగ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వేసవిలో మజ్జిగను నేరుగా తీసుకోవడంతో పాటు మజ్జిగ పులుసు వంటి వంటకాల్లోనూ విరివిగా వినియోగిస్తారు.