DailyDose

కిలో మామిడిపండ్లు రూ.2.70 లక్షలు

కిలో మామిడిపండ్లు రూ.2.70 లక్షలు

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌లో ఓ పొలంలో పండే మామిడి ప్రత్యేకతే వేరు. అక్కడ ఓ కిలో పండ్లు కొనడానికయ్యే డబ్బుతో ఓ పాతకారును కొనుక్కోవచ్చు. అవును..! అవి ఆషామాషీ పండ్లు కాదు. మరో దుకాణానికి వెళ్లి కొనుక్కొందామంటే దేశంలో మరెక్కడా దొరకవాయె. అందుకే 24 గంటలూ పహారా కోసం నలుగురు సిబ్బందిని, సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అంతేకాదు ఆ తోటలో ఒక్క కాయకూడా మాయం కాకుండా చూడడానికి 12 విదేశీ జాతుల శునకాలు సహా 15 జాగిలాలను రంగంలో దించారు. ఇంత భారీ వ్యయంతో మామిడితోటను సాగుచేస్తున్న రైతు పేరు సంకల్ప్‌ సింగ్‌ పరిహార్‌. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌కు 25 కిలోమీటర్ల దూరంలో నానాఖేదా ప్రాంతంలో శ్రీ మహాకాళేశ్వర్‌ హైబ్రిడ్‌ ఫాం హౌస్‌ పేరుతో ఈ తోట ఉంది. ‘జంబో గ్రీన్‌ మ్యాంగో’గా పిలిచే ‘తలాల గిర్‌ కేసర్‌’ సహా నేపాల్‌ రకం కేసర్‌ బాదం, చైనాకు చెందిన ఐవరీ, అమెరికా ఫ్లోరిడాలో పండించే మాంగిఫెరా టామీ ఆట్కిన్స్‌ వంటి మామిడి రకాలను ఇక్కడ సాగుచేస్తారు. ఈ తోటలోనే కాదు దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రత్యేక మామిడి రకం మియాజాకి. వీటి ధర కిలో ఏకంగా రూ.2.70 లక్షలు. ఎనిమిది దేశాలకు చెందిన మామిడి రకాలు సహా భారత్‌కు చెందిన 20 రకాలను సంకల్ప్‌ పరిహార్‌ సాగు చేస్తున్నారు. ఈ తోటలోకి వెళ్లినవారు స్వీయచిత్రాలు తీసుకోవడానికి వీల్లేదు. కాయలను తాకకూడదు. మియాజాకి మామిడి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రకమని సంకల్ప్‌ అంటున్నారు. బ్లాక్‌ మ్యాంగో ఎంతో ఆరోగ్యకరమని, గ్లూకోజ్, చక్కెర స్థాయులు తక్కువగా ఉన్నందువల్ల మధుమేహులు కూడా వీటిని తినవచ్చని వివరించారు.