DailyDose

హైదరాబాద్ సమీపంలో మరో గ్రీన్ సిటీ

హైదరాబాద్ సమీపంలో మరో గ్రీన్ సిటీ

రాజధానిలో మరో మహానగరం రూపుదిద్దుకోబోతోందా.. అది పూర్తి పర్యావరణహితంగా పచ్చని చెట్లతో.. సువిశాలమైన రహదారులతో కళకళలాడనుందా? ఈ దిశగా రంగం సిద్ధమవుతోందంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. 111 జీవోను ఎత్తివేయాలని మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించిన నేపథ్యంలో.. కోర్టు చిక్కులు వీడితే ఈ ప్రాంతం ఎలా అభివృద్ధి చెందబోతోందంటే..

హైదరాబాద్‌ మహానగరం ప్రస్తుతం 1.54 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉంది. జంట జలాశయాల కింద 111 జీవో పరిధిలోకి వచ్చే 84 గ్రామాల్లో ఉన్న భూముల విస్తీర్ణం 1.32 లక్షల ఎకరాలు. ఇప్పటివరకు ఈ భూముల్లో 70 శాతం ఖాళీగానే ఉన్నాయి. ఈ 84 గ్రామాల పరిధిలో మరో కొత్త మహా నగరం నిర్మించాలన్న యోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నారని అధికారవర్గాలు తెలిపాయి. దీనిపై ఇటీవల జరిగిన సమీక్ష సమావేశాల్లో సీఎం తన ఆలోచనలు వెల్లడించినట్లు తెలిసింది. ఇక్కడ ప్రధాన రహదారులన్నింటినీ కౌలాలంపూర్‌ తరహాలో 200 అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలనుకుంటున్నారు. రోడ్డుకు రెండువైపులా పచ్చని వనాలను అభివృద్ధి చేయాల్సి ఉంటుందని సీఎం అన్నట్లు తెలిసింది.

**ఇదీ అసలు కథ..
హైదరాబాద్‌ శివారులోని ఉస్మాన్‌సాగర్‌ (గండిపేట), హిమాయత్‌సాగర్‌ జలాశయాల పరిరక్షణకు జీవో 111 అమల్లో ఉంది. నిపుణుల కమిటీ సూచనల మేరకు వీటికి పది కిలోమీటర్ల పరిధిలో కాలుష్యకారక పరిశ్రమలు, భారీ హోటళ్లు, నివాస కాలనీలు, ఇతర నిర్మాణాలపై నిషేధం విధిస్తూ 1994లో తొలుత జీవో 192ను తీసుకువచ్చారు. దీనికి కొన్ని సవరణలు చేస్తూ 1996 మార్చి 8న అప్పటి ప్రభుత్వం జీవో 111 జారీ చేసింది. ఈ జీవో పరిధిలో 84 గ్రామాల్లోని 1.32 లక్షల ఎకరాల (538 చ.కి.మీ.) విస్తీర్ణం ఉంది. ఇందులో నిర్మాణాలపై ఆంక్షలున్నాయి. దీనిపై నిపుణులైన అధికారులతో సర్కారు 2016లోనే కమిటీ వేసింది. ఈ కమిటీ అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాల్సి ఉంది.

*వందల లే అవుట్లు..
వేలాది కట్టడాలు111 జీవో అమల్లో ఉన్నా ఈ ప్రాంతాల్లో విచ్చలవిడిగా నిర్మాణాలు వచ్చాయి. గ్రామకంఠం పరిధిలోనే నిర్మాణాలు చేయాలనే నిబంధన ఉన్నా.. దాన్ని దాటుకుని కట్టడాలు నిర్మించారు. వందల లే అవుట్లు వచ్చాయి. రెండేళ్ల కిందట 303 లేఅవుట్లను ధ్వంసం చేసినట్లు పంచాయతీ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం 84 గ్రామాల పరిధిలో 700కు పైగా అనధికారిక లే అవుట్లు, దాదాపు 30 వేలకు పైగా అక్రమ కట్టడాలు వెలిసినట్లు అంచనా. కొత్త కార్యాచరణ రూపొందిస్తే వీటిన్నింటిపై తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది.

*దీనిపై సీఎం ఎందుకు దృష్టి సారించారంటే..
ప్రస్తుతం జంట జలాశయాలను తాగునీటి అవసరాలకు ఉపయోగించడం లేదు. కృష్ణా, గోదావరి, మంజీరా నదుల నుంచి నగర అవసరాలకు సరిపడా నీటిని తీసుకుంటున్నారు.హైదరాబాద్‌ నగరంలో దాదాపు భూములు, ఖాళీ స్థలాలు దాదాపుగా లేవు. నార్సింగ్‌, కోకాపేటతో పాటు నగర శివార్లలో మాత్రమే కొన్ని ప్రాంతాల్లో స్థలాలున్నాయి. స్థిరాస్తి రంగంలో హైదరాబాద్‌ విపరీతంగా అభివృద్ధి చెందుతోంది. దీంతో రిజిస్ట్రేషన్ల రూపేణా ప్రభుత్వానికి భారీగా రాబడి సమకూరుతోంది.ఈ నేపథ్యంలో 84 గ్రామాల పరిధిలో మరో కొత్త నగరంగా తీర్చిదిద్దితే ఇది రాష్ట్రాభివృద్ధిలో కీలక భూమిక పోషించే అవకాశం ఉందని, ఆదాయార్జనలో దేశంలోని మిగిలిన రాష్ట్రాల కంటే దీటుగా ఎదిగే అవకాశం ఉందని ప్రభుత్వ యోచన.ఈ క్రమంలో ముఖ్యమంత్రి నాలుగైదు సార్లు ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించారు. రెండు జలాశయాలకు కిలోమీటరు దూరంలోనే ఆంక్షలు విధించి మిగిలిన వాటిలో నిర్మాణాలకు అనుమతి ఇవ్వాలని కొందరు, గ్రీన్‌ జోన్‌, రెడ్‌ జోన్‌ ఇలా ఏర్పాటు చేయాలని మరికొందరు అధికారులు సూచించారు. కానీ ఈ రెండింటికీ సీఎం అంగీకరించలేదని సమాచారం.ఒక్కసారిగా 84 గ్రామాల పరిధిలో నిర్మాణాలకు అనుమతి ఇస్తే, రియల్‌ ఎస్టేట్‌ పరంగా హైదరాబాద్‌ నగరంపై ప్రభావం భారీగా పడే అవకాశం ఉందని కొంతమంది అధికారులు ప్రస్తావించారు. ‘ఇప్పటికే ఫ్లాట్ల ధరలు మధ్యతరగతికి అందుబాటులో లేకుండా పోయాయి. 84 గ్రామాల పరిధిలో అపార్టుమెంట్ల నిర్మాణానికి అనుమతి ఇస్తే ఫ్లాట్ల ధరలు కొంతమేర తగ్గి సామాన్యుల ఇంటి కల కూడా నెరవేరుతుంది కదా’ అని సీఎం పేర్కొన్నట్లు తెలిసింది.ఈ జీవోపై గ్రీన్‌ ట్రైబ్యునల్‌, హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు కేసులున్నాయి. వాస్తవ పరిస్థితిని కోర్టులకు వివరించి జీవో ఉపసంహరణకు అనుమతి తీసుకోవాలని సర్కారు భావిస్తోంది.

*దిగువ ప్రాంతాల్లో నిర్మాణాలకు.. 15 ఏళ్లుగా అనుమతులు..-ఆచార్య ఎం.అంజిరెడ్డి, జేఎన్‌టీయూ
జీవో 111ను ఎత్తివేయాలని మంత్రివర్గం నిర్ణయించిన నేపథ్యంలో.. ఆ ప్రాంత ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాంతంలో అధికారిక నిర్మాణాలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 15 ఏళ్ల కిందటే బీజం పడింది. 2007 నుంచి 2013 కాలంలో కేంద్ర పర్యావరణ, వాతావరణ మార్పులు, అటవీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసిన రాష్ట్ర నిపుణుల అప్రైజల్‌ కమిటీ ఛైర్మన్‌గా జేఎన్‌టీయూ పర్యావరణ విభాగం ఆచార్యుడు ఎం.అంజిరెడ్డి వ్యవహరించారు.”అప్పట్లో జంట జలాశయాల దిగువ ప్రాంతాల్లో పూర్తిస్థాయి అధ్యయనం చేశాం. ఎక్కడా నీటి ప్రవాహానికి ఇబ్బంది లేకుండా అనుమతులిచ్చాం. 20 చదరపు మీటర్లు దాటిన నిర్మాణాలే కమిటీ దృష్టికి వచ్చేవి. వ్యర్థాల నిర్వహణకు మురుగుశుద్ధి కేంద్రాలు (ఎస్టీపీ) ఉంటేనే అనుమతులిచ్చేవాళ్లం. మున్సిపల్‌ శాఖాధికారుల నుంచి ఆమోదం పొందాకే మా కమిటీ ముందుకు అనుమతుల కోసం పంపించేవారు. జీవోను ఎత్తివేయాలని నిర్ణయించినందున దాని పరిధిలోని ప్రతి ప్రాంతాన్ని అధ్యయనం చేయాలి. ప్రతి సర్వే నంబరును క్షుణ్నంగా పరిశీలించాలి. డ్రైనేజీ వ్యవస్థలు, ప్రాంత ఆకృతి, భౌగోళిక పరిస్థితులు, నీటి ప్రవాహంపై అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాలి” .