Politics

వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయం – TNI రాజకీయ వార్తలు

వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయం – TNI రాజకీయ వార్తలు

*మూడేళ్ల జగన్ పాలనలో ప్రజలు చాలా నష్టపోయారని, అన్ని రంగాల్లో ఇబ్బంది ఏర్పడిందని టీడీపీ నేత కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన కర్నూలు జిల్లా, కోడుమూరులో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని, శ్రీలంక పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. ప్రతి గ్రామానికి తాగు సాగు నీరందిస్తామన్నారు. ఫ్లెక్సీలపై వైసీపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని, ఆ పార్టీలో మంత్రులు కేవలం ప్రొటోకాల్ కొరకే వున్నారని విమర్శించారు. కాంగ్రెస్ తర్వాత టీడీపీకే క్యాడర్ వుందని, వైసీపీకి క్యాడర్ లేదన్నారు. కేవలం రాజశేఖర్ రెడ్డి హవా ఉందని, ఆ హవాతోనే జగన్ గెలిచారన్నారు. ప్రజలు రాజశేఖర్ రెడ్డి పాలన వస్తుందనుకున్నారు..అక్కడే పాలన గాడి తప్పిందని సూర్య ప్రకాష్ రెడ్డి అన్నారు.

* ఆహార భద్రతపై ఏపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి: సోమువీర్రాజు
ఆహార భద్రతపై ఏపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని బీజేపీ నేత సోమువీర్రాజు డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బియ్యం కావాలా.. డబ్బులు కావాలా అనే ధోరణి ఖండిస్తున్నామని ప్రకటించారు. మిల్లర్ల చేతిలో ప్రభుత్వం, సివిల్‌సప్లై అధికారులు కీలుబొమ్మల్లా మారారని ఎద్దేవాచేశారు. అక్రమ రవాణాకు కాకినాడ, విశాఖ, మచిలీపట్నం పోర్టులు అడ్డాగా మారాయని ఆరోపించారు. బ్లాక్ మార్కెట్ నిరోధానికి సీఎం జగన్‌ చర్య తీసుకోవాలని సోమువీర్రాజు డిమాండ్ చేశారు.

*అవినీతిపై ఫిర్యాదులకు ఏసీబీ ప్రత్యేక యాప్: సీఎం జగన్
రాష్ట్రంలో ఏసీబీ, దిశ, ఎస్‌ఈబీ కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, అధికారులను ఆదేశించారు. దిశ తరహాలో అవినీతి ఫిర్యాదులకుగానూ ఏసీబీ యాప్‌ తేవాలని ఆయన అధికారులకు సూచించారు. తాడేపల్లి సీఎం క్యాంప్‌ కార్యాలయంలో హోం శాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ఏసీబీకి యాప్‌ ద్వారా ఆడియో ఫిర్యాదు సైతం చేయొచ్చని పేర్కొన్నారు. అవినీతి చోటు చేసుకుంటున్న విభాగాలను క్లీన్‌ చేయాల్సిందేని ఆయన అధికారులను ఆదేశించారు. నెలరోజుల్లోగా ఏసీబీ యాప్‌ రూపకల్పన జరగనుందని, నేర నిర్ధారణకు ఫోరెన్సిక్‌ విభాగాన్ని బలోపేతం చేయాలన్నారు. అలాగే మండల స్థాయి వరకూ ఏసీబీ స్టేషన్లు ఉంటాయని చెప్పారు.

*మంత్రి కనుసన్నల్లోనే హనుమాన్ శోభాయాత్రపై దాడి: బీజేపీ నేత
మంత్రి కనుసన్నల్లోనే హనుమాన్ శోభాయాత్రపై దాడి జరిగిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ… అరెస్టు చేసిన బీజేపీ వీమెచ్‌పీ నాయకులను విడుదల చేయాలని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. హోంమంత్రి ఉత్సవ విగ్రహాంలా మారారని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అట్టహాసంగా కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ లక్ష కోట్లకు పైగా అప్పులు చేశారని ఆయన తెలిపారు. 7 లక్షల 76 వేల కోట్లు అప్పు చేసి ఏపీలో పుట్టె బిడ్డపై కూడా అప్పు పెట్టారని మండిపడ్డారు. ఏపీని చూసి బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వం కూడా భయపడుతోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే తప్పులకు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు కోర్టు చుట్టూ తిరుగుతున్నారన్నారు. వైసీపీకి ఇది ఆఖరి ప్రభుత్వమని వ్యాఖ్యలు చేశారు. పథకాల పేరుతో ప్రజలపై భారీగా అప్పులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.

*చంద్రబాబుతో నాకున్న అనుభవాలు మరువలేనివి: సోమిరెడ్డి
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మా నాయకుడు చంద్రబాబుతో వ్యవసాయ శాఖ మంత్రిగా నాకున్న అనుభవాలు మరిచిపోలేనివి. నెల్లూరులో ధాన్యం విరుగుళ్లు వచ్చినా, రాయలసీమలో చీనీ చెట్లు ఎండినా, గుంటూరులో మిర్చి ధర తగ్గినా ఆయన స్పందించిన తీరు అద్భుతం. రాత్రి 11 గంటలకు వెళ్లినా సమస్యను ఓపికగా విని అన్నదాతను ఆదుకునేలా ఉత్తర్వులిచ్చిన ప్రజా నాయకుడికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజులను మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని సోమిరెడ్డి తెలిపారు.

*బియ్యం బదులు నగదు ఇస్తామనడంలో ప్రభుత్వం కుట్ర: సోము వీర్రాజు
జగన్ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రేషన్ బియ్యం బదులు నగదు ఇస్తామనడంలో ప్రభుత్వ కుట్ర కోణం ఉందన్నారు. ప్రజలపై బలవంతంగా ఒత్తిడి పెంచుతోందని విమర్శించారు. గాజువాక, అనకాపల్లి, నర్సాపురం, కాకినాడ నంద్యాల పట్టణంలో సర్వే నిర్వహిస్తే మెజార్టీ ప్రజలు బియ్యమే కావాలంటున్నారని, ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందన్నారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో కూడా లబ్దిదారులు బియ్యం కోరుకుంటున్నారన్నారు. నరసాపురంలో ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెలుగు చూసిందన్నారు. ఇంటింటి రేషన్ పథకాన్ని అటకెక్కించేదుకే ఈ తంతు జరుగుతోందని ఆరోపించారు. పోర్టుల ద్వారా బియ్యాన్ని విదేశాలకు పంపించే కుట్రలో భాగం ఇదని అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో దొడ్డిదోవన రేషన్ బియ్యాన్ని సన్నాలుగా మారుస్తున్నారని, వీటి వెనక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని సోము వీర్రాజు ఆరోపించారు.

*ఆ ఘటనలపై కేసీఆర్ సీబీఐ విచారణ కోరాలి: బండి సంజయ్
నిజాం కాలం నాటి అరాచకాలను తెరాస నేతలు ఇప్పుడు చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. ఖమ్మంలో తెరాస నాయకుల అరాచకాలకు వ్యతిరేకంగా భాజపా కార్యకర్త సాయిగణేశ్‌ పోరాడారని చెప్పారు. పోలీసుల వేధింపులు తాళలేకే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని సంజయ్‌ ఆరోపించారు. ‘ప్రజాసంగ్రామ పాదయాత్ర’లో భాగంగా మహబూబ్‌నగర్‌ జిల్లా మల్దకల్‌ వద్ద శిబిరంలో మీడియాతో ఆయన మాట్లాడారు. సాయిగణేశ్‌ వాంగ్మూలాన్ని పోలీసులు ఎందుకు తీసుకోలేదని సంజయ్‌ ప్రశ్నించారు. అతడికి ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్యేనని.. పోలీసులు ప్రణాళిక ప్రకారమే చేశారన్నారు. రామాయంపేటకు చెందిన తల్లీకుమారుడి ఆత్మాహుతి, కోదాడ అత్యాచార ఘటన, వామనరావు దంపతుల హత్య వెనుక ఉన్నది తెరాస నేతలేనని సంజయ్‌ ఆరోపించారు. ఈ ఘటనలపై సీఎం కేసీఆర్‌ సీబీఐ విచారణ కోరాలని.. ఆయనే బయటకు వచ్చి వీటిని ఖండించాలని డిమాండ్‌ చేశారు. భాజపా తరఫున న్యాయపోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పారు.

*గులాబీ మూకపై తిరుగుబాటుకు సమయం ఆసన్నమైంది: రేవంత్‌
రాష్ట్రంలో అరాచకానికి రాచబాటలు వేస్తున్నారంటూ గత కొద్ది కాలంగా తాను చెబుతూ వస్తున్న దానికి ఇటీవల సీఎం కేసీఆర్‌ ముఠా చేస్తున్న ఆగడాలే నిదర్శనమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. గులాబీ మూకపై ప్రజలు తిరుగుబాటు చేసే సమయం ఆసన్నమైందన్నారు. ఈ మేరకు మంగళవారం ట్వీట్‌ చేసిన ఆయన.. దానికి అనుబంధంగా ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన ‘అధికార ఆగడాలు’ కథనాన్ని పోస్ట్‌ చేశారు. కాగా, వరంగల్‌లో మే 6న జరిగే రాహుల్‌ గాంధీ సభకు కాంగ్రెస్‌ పార్టీ సన్నద్ధమవుతోంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లా నేతలతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించేందుకు ఈ నెల 22న రేవంత్‌రెడ్డి వెళ్తున్నారు. ఈ నెల 23న ఇందిరాభవన్‌లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. రాహుల్‌ సభను విజయవంతం చేయడంపై నేతలకు రాష్ట్ర నాయకత్వం దిశానిర్దేశం చేయనుంది. కాగా, ఖమ్మంలో బీజేపీ కార్యకర్త ఆత్మహత్యపై స్పందించి కేసులు పెట్టించాలని కేంద్ర మంత్రి అమిత్‌షాను కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రేణుకా చౌదరి కోరారు. బీజేపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నా స్పందించరా అని ప్రశ్నించారు.

*పదవులిచ్చి నోటికి ప్లాస్టర్‌ వేశారు: అచ్చెన్నాయుడు
సీఎం జగన్‌ బీసీలకు మంత్రి పదవులు ఇచ్చి నోటికి ప్లాస్టర్‌ వేశారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. శ్రీకాకుళంలో మంగళవారం జరిగిన సర్దార్‌ గౌతు లచ్చన్న వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. మీడియాతో మాట్లాడుతూ. రైతుల కోం సర్దార్‌ శ్రీకాకుళం నుంచి చెన్నై వరకు పాదయాత్ర చేసిన రైతు బాంధవుడని కొనియాడారు. టీడీపీ బీసీల పార్టీ అని.. బీసీలకు సమాజంలో గొప్ప స్థానం కల్పించిందని చెప్పారు. ‘వైసీపీ గాలివానలో పుట్టిన పార్టీ. బీసీల గొంతు నొక్కుతోంది. చంద్రబాబు బీసీలకు మంత్రివర్గంలో అన్యాయం చేశారంటూ వైసీపీ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. జగన్‌ బీసీలకు మంత్రి పదవులు ఇచ్చి నోటికి ప్లాస్టర్‌ వేశారు. వైఎ్‌సఆర్‌కు, జగన్‌కు బీసీలంటే కోపం’ అని వ్యాఖ్యానించారు. పోలీసులు రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాలని అచ్చెన్న హితవు పలికారు. అధికారంలోకి వచ్చాక ఎవరినీ విడిచిపెట్టేది లేదని, స్లేషన్ల వారీగా కార్యకర్తలను వేధింపులకు గురిచేసిన పోలీసులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

*వైసీపీ జిల్లా అధ్యక్షులను ప్రకటించిన సజ్జల రామకృష్ణారెడ్డి
వైసీపీ జిల్లా అధ్యక్షులను ప్రకటించినట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. చిత్తూరు- కేఆర్‌జే భరత్‌, అనంతపురం- కాపు రామచంద్రారెడ్డి, సత్యసాయి- శంకర్‌నారాయణ, ఎన్టీఆర్‌ జిల్లా- వెల్లంపల్లి, గుంటూరు- సుచరిత, కర్నూలు- బాలనాగిరెడ్డి, నెల్లూరు- మేమిరెడ్డి, బాపట్ల- మోపిదేవి, నంద్యాల- కాటసాని, గుంటూరు- కొడాలి నాని, అన్నమయ్య- శ్రీకాంత్‌రెడ్డి, కడప- సురేష్‌ బాబు, తిరుపతి- చెవిరెడ్డి, ప్రకాశం- ముధుసూదన్‌ యాదవ్‌ను వైసీపీ జిల్లా అధ్యక్షులుగా ప్రకటించారు.11 మంది రీజనల్‌ కో-ఆర్డినేటర్లను ప్రకటించిన సజ్జల ప్రకటించారు. చిత్తూరు, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య జిల్లాలకు పెద్దిరెడ్డి, కడప, తిరుపతి జిల్లాలకు అనిల్‌కుమార్‌, నెల్లూరు, బాపట్లకు బాలినేని, గుంటూరు- కొడాలి నాని, ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాలకు మర్రి రాజశేఖర్‌ని నియమించారు.

*ఏడాదిలో అన్ని జిల్లాల్లో పర్యటిస్తా: చంద్రబాబు
టీడీపీపై కోపంతో ఒక సామాజిక వర్గంపై కక్ష సాధిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామన్నారు. ‘బాదుడే బాదుడు’ నిరసనల్లో తాను పాల్గొంటానని వెల్లడించారు. మహానాడు వరకు ‘బాదుడే బాదుడు’ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. మే మొదటివారంలో తన పర్యటనలు ఉంటాయన్నారు. మహానాడు తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని తెలిపారు. నెలకు 2 జిల్లాల చొప్పున ఏడాదిలో అన్ని జిల్లాల్లో పర్యటిస్తానన్నారు.

*నెల్లూరు కోర్టులో ఫైల్స్‌ దొంగతనంపై స్పందించిన మంత్రి కాకాణి
కోర్టులో ఫైల్స్‌ దొంగతనంపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కోర్టు ఫైల్స్‌ చోరీ వెనుక కుట్ర ఉందన్నారు. ఓ పథకం ప్రకారమే నెల్లూరు కోర్టులో ఫైల్స్‌ చోరీ జరిగిందన్నారు. ఉద్దేశపూర్వకంగానే నన్ను బద్నాం చేయడానికే… కోర్టులో ఫైల్స్‌ చోరీ జరిగినట్టు అనుమానం వ్యక్తం చేశారు. ఆరోపణ చేసేవారు సీబీఐ విచారణకు డిమాండ్‌ చేయాలన్నారు. సీబీఐ విచారణను తాను స్వాగతిస్తానన్నారు.మాజీ మంత్రి అనిల్‌కుమార్‌తో తనకు విభేదాలు లేవని మంత్రి కాకాణి అన్నారు. అందరినీ కలుస్తామని, ఎవరితోనూ విభేదాలు లేవని తెలిపారు. తమ మధ్య విభేదాలు ఉన్నప్పుడు విద్రోహులు ప్రవేశిస్తారన్నారు. తన ప్లెక్సీలు చించి అనిల్‌కుమార్‌ యాదవ్‌పై… అలాగే అనిల్‌ ప్లెక్సీలు చించి తనపై ఆరోపణలు చేస్తారన్నారు. ఆనం వ్యాఖ్యలు ఎవరినీ ఉద్దేశించి చేసినవి కాదని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.

*అందుకే ఉషాశ్రీ చరణ్‌కు మంత్రి పదవి ఇచ్చారు: ఎంపీ గోరంట్ల
చదువు, సంధ్య లేని వ్యక్తి జేసీ ప్రభాకర్ రెడ్డిని, మంత్రి ఉషశ్రీకు మహిళా శిశు సంక్షేమ శాఖ గురించి తెలియదని మాట్లాడటం విడ్డూరంగా ఉందని హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మంత్రి ఉషాశ్రీ చరణ్ ఉన్నత చదువులు చదివిన బీసీ మహిళ అని, ఆమె ఉన్నత చదువును, ఇంటిగ్రేటిని చూసే.. సీఎం జగన్ ఆమెకు మంత్రి పదవి ఇచ్చారన్నారు. తెలుగుదేశం పార్టీ ఒక చావు చచ్చిన పార్టీ అని, ఆ పార్టీని ప్రజలు దిబ్బలోకి పడేశారని గోరంట్ల మాధవ్ అన్నారు.

*ప్రజలకు అవమానాలు, అప్పులే మిగిలాయి: గోరంట్ల
నేరస్తుడు, ఆర్థిక ఉగ్రవాది పాలకుడు కావడంతో ప్రజలకు అవమానాలు, అప్పులే మిగిలాయని టీడీపీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలు, ఆర్థికాంశాలు ముడిపెడితే మిగిలేది సంక్షోభమేనని జగన్ రెడ్డి తెలుసుకోవాలన్నారు. సంక్షేమం పేరుతో చేస్తున్న అప్పులతో ఏపీ దివాళా అంచులకు చేరిందన్నారు. ఇప్పటి వరకు ఏపీపై ఉన్న మొత్తం అప్పు రూ. 7.76 లక్షల కోట్లు అన్నారు. అంతసొమ్ము దేనికి ఖర్చుపెట్టారంటే పాలకులవద్ద సమాధానంలేదన్నారు. శ్రీలంకలో ఉన్న పరిస్థితులు మక్కీకి మక్కీ ఏపీలో ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక కాకూడదని కోరుకుంటున్నామని గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. బటన్లు నొక్కుతూ కూర్చుంటున్న సీఎం జగన్ ఎంత సొమ్ము ప్రజలకు ఇచ్చారంటే నీళ్లునములుతున్నారని విమర్శించారు. పరిశ్రమలకు పవర్ హాలిడేలు ప్రకటించారు.. ప్రజలకు విద్యుత్ కోతలు మిగిల్చారు. యువత మత్తులోజోగితే, తన ఆటలు యథేఛ్చగా సాగుతాయని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టున్నారన్నారు. వాలంటీర్లను నియమించింది…రాష్ట్రాన్ని రేప్‌ల రాజ్యం చేయడానికా? అని ప్రశ్నించారు. నగదు బదిలీ పథకంతో ప్రజలు అడుక్కుతింటుంటే, ముఖ్యమంత్రికి ఆదాయం పెరిగిందన్నారు. రాష్ట్రంలో అప్పులపై కేంద్రం జోక్యంచేసుకోవాలన్నారు. గవర్నర్ ఉత్సవ విగ్రహం పాత్రకు పరిమితం కావడం బాధాకరమన్నారు. రాజ్యాంగానికి రక్షకుడిగా ఉండాల్సిన గవర్నర్ రూ. 50 వేల కోట్ల దుర్వినియోగంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించరా? అని నిలదీశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కోర్టులోని సాక్ష్యాలు మాయమైతే, ఎస్పీ చిలుక పలుకులు పలుకుతున్నారని గోరంట్ల బుచ్చయ్యచౌదరి మండిపడ్డారు.