Devotional

కల్యాణం కమనీయం

కల్యాణం కమనీయం

వేద మంత్రాలు.. వేదోక్తమైన తంత్రాలు.. సంప్రదాయాలు.. సదాచారాలు.. కమనీయమైన కల్యాణ క్రతువులో ప్రతి అంకమూ రమణీయంగా సాగిపోతుంది! రానున్న వైశాఖం, ఆపై వచ్చే జ్యేష్ఠ మాసం వివాహ ముహూర్తాలకు ప్రత్యేకం. ఈ సుముహూర్తాల్లో కొత్తగా జట్టుకట్టనున్న వధూవరులు పెండ్లి సందడిలోని గొప్పదనాన్ని తెలుసుకోగలిగితే.. పెండ్లినాటి ప్రమాణాలను జీవితాంతం పాటిస్తారు అనడంలో సందేహం లేదు.

*విదేశీయులు శతాబ్దాలపాటు పాలించడం వల్ల అన్ని వ్యవస్థలు నశించాయి. కానీ, మన వివాహ వ్యవస్థ మాత్రం చెక్కుచెదరలేదు. ఆ గొప్పదనం వివాహ వ్యవస్థలోనే ఉన్నది. హిందూ వివాహ క్రతువు వేదోక్తమైనది. ఇదొక పవిత్ర యజ్ఞం. తైత్తిరీయ బ్రాహ్మణంలో ‘అయజ్ఞి యో వా ఏషయో పత్నీకః’ అని ఉంది. అంటే భార్య లేనివాడు యజ్ఞహీనుడు అని అర్థం. అందుకే భార్యను అర్ధాంగి అంటారు. వివాహం ముఖ్య ఉద్దేశం.. ధర్మబధ్ధంగా తమ వంశాన్ని పెంపొందించుకోవడం. స్త్రీ, పురుషుల లైంగిక సౌఖ్యాలకు వివాహం ఒక కట్టుబాటు. అంతేకాదు, వివాహం ఒక ఆర్థిక వ్యవస్థకు పునాది కూడా. ఆ దంపతులకు వారసులు ఏర్పడి ఆస్తుల సంక్రమణానికి అవకాశం కల్పిస్తుంది.

*పెండ్లిలో ఏం జరుగుతుంది?
చాలామంది పెండ్లిలకు హాజరై, వధూవరులను దీవిస్తారు. విందు భోజనం తృప్తిగా ఆరగిస్తారు. కానీ, పెండ్లి అనేది అనేక ఘట్టాల సమాహారం. ఆయా సందర్భాల్లో పఠించే మంత్రాలు పవిత్రమైనవి. వివాహంలో 35 వరకు దశలున్నా.. వాటిలో ప్రధానమైనవి తొమ్మిది నుంచి పదిహేను. కలశపూజతో మొదలయ్యే పెండ్లితంతు ఎదురుకోలు ఉత్సవంతో సందడిగా మారుతుంది. వివాహ క్రతువులో ప్రతి కార్యక్రమం ప్రత్యేకమైనదే. మహా సంకల్పంతో కల్యాణ ఘడియలు మొదలవుతాయి.

*మహా సంకల్పం
అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాల గురించి తెలుసుకున్న తర్వాత గానీ, సంబంధం ఖాయం చేసుకోకూడదని వ్యవహారంలో అందరూ అంటుంటారు. వివాహ క్రతువులో మహా సంకల్పం వధూవరుల వంశ విశేషాలను తెలియపరుస్తుంది. ఇరుపక్షాల వారి ఏడు తరాలను స్మరిస్తూ వంశాభివృద్ధి అవిచ్ఛిన్నంగా కొనసాగాలని ఆశీర్వదిస్తూ పురోహితుడు వేదమంత్రాలు పఠిస్తాడు.సుముహూర్తానికి ముందు వధూవరులు ఒకరినొకరు చూసుకోకుండా మధ్యలో తెర పట్టుకుంటారు. వరుడు పరమాత్మగాను, వధువు జీవాత్మగాను భావిస్తారు. మధ్యలోని మాయతెరను సుముహూర్తానికి తొలగిస్తారు.

*కన్యాదానం
కన్యాదాత వరుడి కాళ్లు కడిగి కన్యాదానం చేస్తూ.. తన కూతురిని లక్ష్మీనారాయణునికే దానం చేశానని భావిస్తాడు. కొబ్బరికాయ, పండ్లు, పూలు, అక్షతలు ఉన్న వధువు కుడిచేతిని వరుడి కుడిచేతిలో ఉదకపూర్వకంగా ఉంచి సాలంకృత కన్యాదానం చేస్తారు. వరుడు ప్రతిగ్రహ మంత్రాలు చదువుతూ స్వీకరిస్తాడు. వధువు శరీర గుణగణవర్ణన చేస్తూ కన్యాదానం చేస్తారు ఆమె తల్లిదండ్రులు. పెండ్లి ప్రమాణాల్ని పురోహితుడు చెప్పగా వధూవరులు చేస్తారు.
కన్యాదాన సమయంలో
‘కన్యాం కనకసంపన్నాం కనకాభరణైర్యుతాం
దాస్యామి విష్ణవేతుభ్యం బ్రహ్మ లోక జిగీషయా
కన్యా మమాగ్రతో భూయా కన్యామే దేవి పార్శ్వయో
కన్యామే సర్వతో భూయాస్తద్దాన్మనాన్మోక్ష మాప్నుయాత్‌’ అనే మంత్రం చదువుతారు. ‘మాకు బ్రహ్మ లోకప్రాప్తి కలగాలని, తద్వారా మోక్షం సంప్రాప్తించాలని, పంచభూతాల సాక్షిగా నా పితృదేవతలు తరించాలని, ధర్మార్థకామ్యాలు సిద్ధించాలని నా కూతురును (కన్యను) వినయపూర్వకంగా నీకు దానం చేస్తున్నాం’ అని వరుడితో అమ్మాయి తల్లిదండ్రులు చెప్పే మంత్రమిది. కన్యాదానం చేస్తూ వధువు తండ్రి.. వరుణ్ని ఇలా మాటివ్వమని అడుగుతాడు..
‘ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరితవ్య’- ‘ధర్మార్థ కామాలనే పురుషార్థాలను సంపాదించడంలో.. నీకు అర్ధాంగి అయిన నా కుమార్తెను అతిక్రమించి వెళ్లకు’ అని దీని అర్థం. దీనికి వరుడు ‘నాతిచరామి (అతిక్రమించను)’ అని మూడుసార్లు అంటాడు. అలాగే, అత్తవారింట కాలుపెట్టిన వధువు ఆ ఇంటికి యజమానురాలేనని మరోమంత్రం చెబుతుంది.

*సుముహూర్తం
చాలామంది మాంగళ్య ధారణే సుముహూర్తం అని భావిస్తారు. కానీ, జీలకర్ర బెల్లం ధారణే అసలైన సుముహూర్తం. జీలకర్ర బెల్లం కలిపిన ముద్దను సుముహూర్త సమయంలో వధూవరులు పరస్పరం శిరస్సులపై ధరింపజేసుకుంటారు.
జీలకర్ర బెల్లం ధరింపజేసే సమయంలో..
‘ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః
ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువమ్‌’ అనే మంత్రాన్ని మంగళవాద్యాల మధ్య చదువుతారు. ‘దాంపత్య సామ్రాజ్యాన్ని అనుభవించే మీకు, రాజైన వరుణుడు, దేవుడు బృహస్పతి, ఇంద్రుడు, అగ్ని నిశ్చలత్వాన్ని కలగజేయాలి’ అని ఈ మంత్రానికి అర్థం. జీలకర్ర బెల్లం ధారణ సమయంలో ఒకరి తలపై మరొకరు చేతులు ఉంచడం ద్వారా అప్పటివరకు స్పర్శ ఎరుగని కొత్త దంపతుల్లో నూతన శక్తి ప్రవేశిస్తుంది. ఆకర్షణ అభిమానాలు పెరుగుతాయని మంత్రాలు చెబుతున్నాయి.

*మాంగళ్యధారణ
మంగళసూత్రం లక్ష్మీ పార్వతి సరస్వతీ శక్తులకు సంకేతం. సూత్రాలకు షోడశోపచార పూజ తర్వాత పండితులు
‘మాంగళ్యం తంతునానేన మమజీవన హేతునా కంఠేబద్నామి సుభగే త్వంజీవ శరదాం శతమ్‌’ అని మంత్రం పఠిస్తుండగా వరుడు.. వధువు ఎదురుగా నిలబడి మాంగళ్యధారణ చేస్తాడు. మూడుముళ్లూ వేస్తాడు. ‘నా జీవితం, జీవన విధానం దీనిమీదే ఆధారపడి ఉంది. నీవు దీనిని కంఠాన ధరించి నిండు నూరేండ్లూ జీవించెదవు గాక!’ అని ఈ మంత్రార్థం. మూడు ముళ్లూ స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలకు సంకేతంగా చెబుతారు.

*తలంబ్రాలు
పెండ్లితంతులో తలంబ్రాల వేడుక చూడముచ్చటగా సాగుతుంది. వధూవరులు పోటాపోటీగా ఇందులో పాల్గొంటారు. తలంబ్రాలు అంటే ‘తలపైన పోసే బియ్యం’ అని అర్థం. ఇందులో విరిగిన బియ్యం వాడకూడదు. తలంబ్రాల వేడుకలో పఠించే మంత్రాల్లో విశేషమైన అర్థాలు ఉంటాయి. అవి సంసార బాధ్యతలను గుర్తుచేస్తాయి. మొదట తలంబ్రాలను కొబ్బరి కుడకలో పోసి, నేతిలో ప్రోక్షించి వధూవరులకు అందిస్తూ ‘కపిల గోవులను స్మరించి, దానం, పుణ్యం చేయాలని, శాంతి, పుష్టి, తుష్టి వృద్ధి కలగాలని, విఘ్నాలు తొలగి ఆయుష్షు, ఆరోగ్యం, క్షేమం, మంగళం కలగాలని, సత్కర్మలు వృద్ధి చెందాలని, నక్షత్రాలు, సోముని వల్ల దాంపత్యం సజావుగా సాగి, సుఖశాంతులు కలగాలని’ పురోహితుడు మంత్ర పఠనం చేస్తాడు. రెండోసారి వధువు ‘పశవోమేకామస్సమృధ్యతామ్‌- నాకిష్టమైన పశువులు, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలి’ అంటూ వరుడి తలపై తలంబ్రాలు పోస్తుంది. అలాగే వరుడు ‘యజ్ఞోమేకామస్సమృధ్యతామ్‌- నా కిష్టమైన త్యాగం సమృద్ధిగా ఉండాలి’ అనుకుంటూ తలంబ్రాలు వధువుపై పోస్తాడు. కొందరు చివరగా ఒకేసారి ‘శ్రీయోమే కామస్సమృధ్యతామ్‌- మాకు కావాల్సిన సిరిసంపదలు సమృద్ధిగా ఉండాలి’ అనే మంత్రం కలిసి చదువుతారు.

*సప్తపది
వివాహ క్రతువు అగ్నిసాక్షిగా జరుగుతుంది. అగ్ని హోత్రం చుట్టూ వధువు చిటికెన వేలును పట్టుకుని వరుడు మంత్ర సమన్వితంగా ఏడడుగులు నడుస్తాడు. దీనినే సప్తపది అంటారు. భార్యాభర్తలు పరస్పరం గౌరవించుకుంటూ, అన్యోన్యంగా, ఆదర్శవంతంగా జీవించాలనేదే సప్తపదిలోని అంతరార్థం. అందుకే వివాహబంధాన్ని ఏడడుగుల బంధం అన్నారు.

మొదటి అడుగు: ‘ఏకం ఇషే విష్ణుః త్వా అన్వేతు’ ఆ విష్ణువు మనిద్దరినీ ఒక్కటిగా చేయుగాక!
రెండో అడుగు: ‘ద్వే వూర్జే విష్ణుః త్వా అన్వేతు’ ఇద్దరికీ శక్తి లభించేలా చేయుగాక!
మూడో అడుగు: ‘త్రీణి వ్రతాయ విష్ణుః త్వా అన్వేతు’ వివాహ వ్రతసిద్ధి కోసం విష్ణువు అనుగ్రహం లభించుగాక!
నాలుగో అడుగు: ‘చత్వారి మయోభవాయ విష్ణుః త్వా అన్వేతు’ మనకు విష్ణువు ఆనందాన్ని కలిగించుగాక!
అయిదో అడుగు: ‘పంచ పశుభ్యో విష్ణుః త్వా అన్వేతు’ మనకు విష్ణుమూర్తి పశుసంపదను కలిగించుగాక!
ఆరో అడుగు: ‘షడృతుభ్యో విష్ణుః త్వా అన్వేతు’ ఆరు రుతువులు మనకు సుఖమిచ్చుగాక!
ఏడో అడుగు: ‘సప్తభ్యో హోతాభ్యో విష్ణుః త్వా అన్వేతు’ గృహస్థాశ్రమ ధర్మ నిర్వహణకు విష్ణువు అనుగ్రహించుగాక! ఇలా సప్తపదితో దేవాదిదేవుడైన విష్ణుమూర్తి అనుగ్రహం కోరుతారు వధూవరులు.