NRI-NRT

అనాధ బాలునికి అమెరికా దంపతుల అండ.

అనాధ బాలునికి అమెరికా దంపతుల అండ.

మూడేళ్ల వయసులోనే అమ్మ చనిపోయింది. అప్పటికే నాన్న ఎక్కడికో వెళ్లిపోయాడు. అమ్మ మృతదేహం వద్ద ఆ బాలుడు రోదిస్తున్న దృశ్యం అందరినీ కలచివేసింది. కరోనా లాక్ డౌన్ సమయం కావడం.. ఎవరూ ఏమీ చేయలేని నిస్సహాయత. రెండేళ్ల క్రితం ఈ స్థితిలో సంగారెడ్డి శిశుగృహ అధికారులు ఆ బాలుడిని అక్కున చేర్చుకున్నారు. అంతా బాగుందనుకుంటున్న తరుణంలో ఆ బాలుడికి దీర్ఘకాలిక జబ్బు ఉన్నట్లు బయటపడింది. అయినా అధికారులు వైద్యం చేయిస్తూ కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఈ స్థితిలో బాలుడికి మరో పెద్ద అండ దొరికింది. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలను దత్తత తీసుకోవాలని చూస్తున్న అమెరికాకు చెందిన ప్రముఖ వైద్యుడు స్టీఫెన్ పాట్రిక్ బెర్గిన్ సంబంధిత ఏజెన్సీల నుంచి వివరాలు సేకరించి ఈ బాలుడిని ఎంచుకున్నారు. దత్తత తీసుకోవడానికి అవసరమైన అన్ని నిబంధనలను పూర్తిచేశారు. ఆమోదం లభించినప్పటి నుంచి ఆ బాలుడితో వీడియోకాల్లో మాట్లాడుతున్నారు. మందులతో పాటు బొమ్మలూ పంపుతూ అనుబంధం పెంచుకున్నారు. గురువారం బాలుడిని తీసుకెళ్లడానికి తన భార్య ఎరిన్ లిన్ బెరిన్తో కలిసి వచ్చారు . వారిని చూడగానే బాలుడు అమ్మానాన్నా అంటూ వెళ్లి వారిని హత్తుకున్నాడు. అడిషనల్ కలెక్టర్ రాజర్షిషా, జిల్లా సంక్షేమాధికారిణి పద్మావతి సమక్షంలో దత్తత పత్రాలు అందుకున్న ఈ దంపతులు తమతో పాటు బాలుడిని అమెరికా తీసుకెళ్లడానికి సిద్ధమయ్యారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ ఈ బాలుడిని దత్తత తీసుకునేందుకు ముందుకు రావడం విశేషం.