Devotional

గణపతి ముందు గుంజీళ్ళు ఎందుకు తీయాలి? – TNI ఆధ్యాత్మికం

గణపతి ముందు గుంజీళ్ళు ఎందుకు తీయాలి? – TNI ఆధ్యాత్మికం

1. పార్వతీదేవి, శ్రీమహావిష్ణువు అన్నచెల్లెళ్ళు. ఒకసారి శ్రీ మహావిష్ణువు తన బావగారైన శివుడిని కలవడానికి కైలాసానికి వెళ్ళాడు. వెళ్తూనే తన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని, గద మొదలైన ఇతర ఆయుధాలను ఒక పక్కన విడిచిపెట్టాడు.అక్కడే బాలగణపతి ఆడుకుంటున్నాడు. గణపతి చాలా అల్లరివాడు. బంగారు కాంతులతో వెలిగిపోతున్న సుదర్శన చక్రం చట్టుక్కున నోట్లో వేసుకుని, మౌనంగా కూర్చున్నాడు. మాటల మధ్యలో తన చక్రం గుర్తొచ్చిన విష్ణువు ఎక్కడుందని వెతకడం మొదలుపెట్టాడు. ‘ఏం వెతుకుతున్నావు మావయ్యా!’ అని గణపతి అనగా, సుదర్శన చక్రాన్ని వెతుకున్నా అన్నాడు శ్రీ మహావిష్ణువు.’ఇంకెక్కడుంది మావయ్యా చక్రం! నేను తినేశాగా!’ అని నవ్వేశాడు గణపతి. విష్ణువుకేమో గణపతి అంటే మహాఇష్టం. గణపతిని ఏమి అనలేడు. అందువల్ల ‘బాబ్బాబు! అది రాసక్షులను హడలుగొట్టి, సంహారం చేసే మహాసుదర్శనం, దాన్ని బయటకు విడిచిపెట్టు నాయనా’ అని నానారకాలుగా బ్రతిమాలాడు విష్ణువు. గణపతి పట్టువదల్లేదు.ఇక చేసేది లేక విష్ణువు తన కుడి చేతితో ఎడమ చెవిని, ఎడమ చేతితో కుడిచెవిని పట్టుకుని గణపతి ముందు గుంజీళ్ళు తీశాడు. విష్ణువు చేసే పని గణపతికి విచిత్రంగా అనిపించడమే కాకుండా, విపరీతమైన నవ్వు తెప్పించింది. గణపతి కడుపు నొప్పించేంతగా నవ్వాడు.ఇలా నవ్వడంలో ఆయన కడుపులో ఉన్న సుదర్శన చక్రం బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నాడు శ్రీ మహావిష్ణువు. అప్పటి నుంచి గణపతి ముందు గుంజీళ్ళు తీసే సంప్రదాయం వచ్చింది. గణపతి ముందు గుంజీళ్ళు మొట్టమొదట తీసింది విష్ణువే. ఈ విధంగా శ్రీమహావిష్ణువు చేత గుంజీళ్ళు తీయించిన గణపతి మనల్ని అనుగ్రహించుగాక. గణపతి ముందు తీసే గుంజీళ్ళలో ఆరోగ్య రహస్యం కూడా ఉంది. గుంజీళ్ళు తీయడం వల్ల మెదడుకు రక్తప్రసరణ బాగా జరిగి మేధస్సు వృద్ధి చెందుతుంది.

2. రాజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ
వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం సోమవారం భక్తులతో రద్దీగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయ కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. ఆలయ కళాభవన్‌లో స్వామివారి నిత్యకల్యాణం, సత్యనారాయణవ్రతం వంటి ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు. సోమవారం సందర్భంగా లఘుదర్శనం అమలు చేయడంతో భక్తులు నందీశ్వరుడి వద్ద నుంచి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఆలయ ఏఈవో బి.శ్రీనివాస్‌ నేతృత్వంలో ఏర్పాట్లు చేశారు.

3. వాడపల్లి వెంకన్నకు బంగారు కిరీటం
కోనసీమ జిల్లాలోని ప్రముఖ క్షేత్రమైన వాడపల్లి శ్రీవేంకటేశ్వర స్వామికి ఓ అజ్ఞాత భక్తుడు రూ.65 లక్షల వ్యయంతో వజ్రాలతో పొదిగిన బంగారు కిరీటాన్ని తయారు చేయించాడు. ఈనెల 21వ తేదీన దానిని స్వామివారికి సమర్పించనున్నారు. వాడపల్లి వెంకన్నకు ఇప్పటి వరకు ఇంత పెద్ద మొత్తంలో విరాళం అందడం ఇదే ప్రథమం.

4. వెయ్యికిపైగా ఆలయాల్లో మార్మోగిన సుప్రభాతం
కర్ణాటకలోని ఆలయాల్లో సుప్రభాతం మార్మోగింది. అజాన్‌కు వ్యతిరేకంగా శ్రీరామసేన ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలోని వెయ్యికిపైగా ఆలయాల్లో సుప్రభాతం, హనుమాన్‌ చాలీసా, భక్తిగేయాలు, ఓంకార నాదాలు తెల్లవారు 5 గంటలకే ప్రారంభమయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశా లున్నా రాష్ట్రమంతటా మసీదులపై లౌడ్‌స్పీకర్లను తొలగించడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ శ్రీరామసేనతోపాటు పలు హిందూ సంఘాలు నిరసనకు దిగాయి. మైసూరులోని ఆంజనేయస్వామి ఆలయం లో శ్రీరామసేన వ్యవస్థాపకుడు ప్రమోద్‌ ముతాలిక్‌ ఆధ్వర్యంలో హనుమాన్‌ చాలీసా ఏర్పాటు చేశారు. ఆలయాలు, మసీదుల వద్ద రాష్ట్రమంతటా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మైసూరు, పలు ప్రాం తాల్లో హిందూ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చే యడాన్ని ప్రమోద్‌ ముతాలిక్‌ తప్పుబట్టారు. కాగా కాంగ్రెస్‌ పార్టీ మైనారిటీ ఎమ్మెల్యేలు సీఎం బసవరాజ్‌ బొమ్మైతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో శాంతి సౌహార్ధ్రతను కాపాడాలని, అజాన్‌, హనుమాన్‌ చాలీ సా వివాదం తారస్థాయికి చేరకుండా కట్టడి చేయాలని కోరారు. వివాదాన్ని పరిష్కరించే దిశగా ప్రభుత్వం మార్గదర్శకాలను చేయదలిచింది.

5. దుర్గమ్మకే టోకరా!
అమ్మలగన్న అమ్మ దుర్గమ్మకే టోకరా వేసేందుకు కొందరు ఆలయ సిబ్బంది ప్రయత్నించారు. సుమారు రూ.పది లక్షల విలువైన 12 తులాలపైనే బంగారు ఆభరణాలను అపహరించేందుకు సిబ్బంది ప్రయత్నించారు. ఎస్‌పీఎఫ్‌ పోలీసుల ఆకస్మిక తనిఖీల్లో ఈ ఉదంతం బట్టబయలైంది. సోమవారం ఉదయం శ్రీ దుర్గామల్లేశ్వర దేవస్థానం మహామండపం ఆరో అంతస్థులో అమ్మవారి హుండీల్లోని కానుకల లెక్కింపు కార్యక్రమం జరిగింది. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఎస్‌పీఎఫ్‌ సిబ్బంది పురుషులు ఉపయోగించే బాత్‌రూమ్‌ల వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా అక్కడ ఉన్న వెస్ట్రన్‌ టాయిలెట్‌ పక్కన రెండు చిన్న ప్లాస్టిక్‌ కవర్లను గుర్తించారు. వాటిలో ఒకదానిలో పది బంగారు ఉంగరాలు, మరొకదానిలో ఒక నెక్లెస్‌, ఒక బంగారు తాడు ఉన్నాయి. వీటిని వారు ఈవో భ్రమరాంబకు అప్పగించారు. దుర్గమ్మ భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం కావడంతోపాటు గతంలో వెండి సింహాల మాయమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా వివాదాస్పదం కావడంతో ఆలయ అధికారులు తాజా ఉదంతంపై గోప్యత పాటిస్తున్నారు.
దొంగలెవరు…అమ్మవారి హుండీల లెక్కింపు పకడ్బందీగా జరుగుతుంది. సీసీ కెమెరాల నిఘా, ఎస్‌పీఎఫ్‌ సిబ్బంది పహరా నడుమ లెక్కింపు ప్రాంతం వద్ద గట్టి నిఘా ఉంటుంది. కానుకలను లెక్కించడానికి డజన్ల కొద్దీ వచ్చే వ్యక్తులను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. లెక్కింపు పూర్తి చేసుకుని బయటకు వెళుతున్న సమయంలో కూడా మరోసారి క్షుణ్ణంగా పరిశీలిస్తారు. మరి ఇంత గట్టి బందోబస్తు ఉన్నప్పటికీ సుమారు రూ.10 లక్షల విలువైన అమ్మవారి కానుకలను దొంగిలించే ప్రయత్నం జరగడంపై ఆలయ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. దొంగలెవరు అన్నదానిపై అంతర్గతంగా సిబ్బందిని విచారించి ఆరా తీస్తున్నారు. సీసీ కెమెరాలను పరిశీలించి ఇంటి దొంగలెవరో నిగ్గు తేల్చే పనిలో ఆలయ అధికారులు నిమగ్నమయ్యారు. అయితే ఈ ఉదంతంపై సోమవారం రాత్రి వరకు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

6. శ్రీవారి ఆలయ పరకామణిలో చోరీ కలకలం
శ్రీవారి ఆలయ పరకామణిలో చోరీ కలకలం రేపింది. కరెన్సీ లెక్కింపు మండపంలో ఓ వ్యక్తి నగదును చోరీ చేశాడు. స్వదేశీ కరెన్సీతో పాటు విదేశీ కరెన్సీని కూడా సదరు వ్యక్తి చోరీ చేసినట్లు తెలుస్తోంది. గత కొద్ది నెలలుగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగి చోరీకి పాల్పడుతున్నట్లు సమాచారం. కాగా ఈ విషయాన్ని టీటీడీ విజిలెన్స్ గోప్యంగా ఉంచి దర్యాప్తు చేస్తున్నారు. పరకామణిలో చోరీ జరిగినట్లు పోలీసులకు ఆలయ విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు.

7. ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న దేవాదాయశాఖ మంత్రి
ఏపీ దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ బెజవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అమ్మవారి ఆలయంలో ఆలయ సిబ్బంది, సేవకుల చేతివాటంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సినీనటుడు రాంచరణ్ అభిమానులు ఉండి ఎక్కడంపై మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలపై మంత్రి స్పందించారు. అమ్మవారి సొమ్మును కాజేయాడానికి ప్రయత్నించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆలయంలో బందోబస్తును మరింత కఠినతరం చేస్తామన్నారు. మూడు సింహాల విషయంలో నిందితులకు త్వరలో శిక్షపడేలా చేస్తామని మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు