DailyDose

నేనుసైతం అంటూ… ‘సుధాన్య’కు ‘రూప’మ్

నేనుసైతం అంటూ… ‘సుధాన్య’కు ‘రూప’మ్

మంచి ఆహారమే జీవశక్తిని ఇస్తుంది. అందుకే రుచి, శుచితో పాటు ఎలాంటి దుష్పరిణామాల్లేని ఆహారాన్ని సమాజానికి అందించాలనే తపనతో పని చేస్తున్నారు రూప మాగంటి. ఎన్నో అంతర్జాతీయ సంస్థల్లో పని చేసిన ఆమె సమాజహితం కోసం ‘నేను సైతం’ అంటూ అడుగులేస్తున్నారు. ‘సుధాన్య’ అనే సేంద్రియ ఉత్పత్తుల సంస్థను స్థాపించిన రూప మాగంటి తమ సంస్థ గురించి వివరించారు.
g3
*‘‘మాస్వస్థలం చెన్నై. పుట్టింది పెరిగింది కూడా అక్కడే. చదువు పూర్తయిన తర్వాత దేశ విదేశాల్లో అనేక అంతర్జాతీయ సంస్థల్లోను.. ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ)లోను పనిచేశా. పెళ్లయిన తర్వాత హైదరాబాద్‌ వచ్చేసా. నాకు ఎంతో ఇచ్చిన సమాజానికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశం నాకు చిన్నప్పటి నుంచి ఉంది. ఆ ఆలోచనల నుంచి పుట్టిందే ‘సుధాన్య’. చాలా మంది లాభాల కోసం వ్యాపారం చేస్తారు. కానీ మాకు లాభాల కన్నా పర్యావరణహితమే ముఖ్యం. నేను, నా వ్యాపార భాగస్వామి పెద్ది రామారావుతో కలిసి 2019లో ‘సుధాన్య’ ప్రారంభించాం. దీనికోసం చాలా పరిశోధన చేశాం. రైతులను కలసి సేంద్రియ సేద్యం ఆవశ్యకతను వివరించి వారితో కలసి పనిచేస్తున్నాం.
g2
**తమిళ రైతులతోనూ కలసి..
పుట్టి పెరిగింది చెన్నైలోనే కాబట్టి తమిళ భాష, అక్కడి ప్రాంతాలపై మంచి అవగాహన ఉంది. అందుకే పాండిచ్చేరి, తమిళనాడులోని పలువురు అభ్యుదయ సేంద్రియ రైతులను కలిసి వారి అనుభవాలు తెలుసుకున్నాం. మనం బిర్యానీకి బాస్మతీ రైస్‌ వాడుతుంటే వాళ్లు ఇంకా దేశీ వరి రకం చిట్టి ముత్యాలను వాడుతున్నారు. 2019లోనే సంప్రదాయ వరి వంగడం పొన్నిను సాగు చేయడం మొదలుపెట్టాం. లాక్‌డౌన్‌లో కషాయాలు, సిరిధాన్యాలు లాంటి ఆహార పోకడలపై అధ్యయనం చేశాం. ఇండియన్‌ మిల్లెట్‌ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌ తో కలిసి పనిచేస్తున్నాం.
g4
**వంటనూనె మార్చితేనే ఆరోగ్యం!
మితంగా తినడమే కాదు సరైన ఆహారం తినడం కూడా ముఖ్యమే. అందుకే సేంద్రీయ ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతోంది. ఆరోగ్యానికి ఎంతో మేలని సిరిధాన్యాలతో అనుబంధ ఉత్పత్తులు తయారుచేస్తున్నాం. మిల్లెట్స్‌తో రవ్వ, రెడీ టూ ఈట్‌ ప్రాడక్స్‌ తయారుచేస్తున్నాం. రాగి లడ్డూ లాంటి సంప్రదాయ తినుబండారాలు, రాగి మిక్షర్‌, గానుగ నూనె వాడిన సేంద్రియ పచ్చళ్లు తయారుచేస్తున్నాం. మనదేశంలో వరికన్నా ముందు సాగయ్యింది సిరిధాన్యాలే. మన వేదాలు, ఉపనిషత్తుల్లోనూ సిరిధాన్యాల ప్రస్తావనే ఉంది. లలితా సహస్రనామంలో అమ్మవారిని కుసుమ ప్రియ అని సంబోధించారు. అంటే ఆ కాలం నుంచే మనం కుసుమ, నువ్వులు వంటివి మనకు తెలుసు. అనారోగ్యకర పదార్థాలకు మా ఉత్పత్తుల్లో చోటు లేదు. మైదా, గోధుమ ఉత్పత్తులను అస్సలువాడం. పంచదార, అన్నం కంటే కూడా రిఫైన్డ్‌ ఆయిల్స్‌ ప్రజల ఆరోగ్యానికి హానికరం. వంటనూనె మార్చుకుంటే ఆరోగ్యం కాపాడు కోవచ్చు. అందుకే మేం గానుగ నూనెలు అందిస్తున్నాం.

**వినియోగదారుల నమ్మకమే..
వినియోగదారులను కూడా కుటుంబ సభ్యులుగానే మేము భావిస్తాము. సీజన్‌ను బట్టి ఎలాంటి ఫుడ్‌ తీసుకోవాలి? ఆహారంలో ఎలాంటి మార్పులు చేర్పులు చేసుకోవాలనేది వారికి సలహాలు ఇస్తుంటాం. కుటుంబానికి అవసరమైన అన్ని ఉత్పత్తులను కలిపి ఫుల్‌బాస్కెట్‌ పేరుతో అందిస్తున్నాం. ఇందులో బియ్యం, సిరిధాన్యాలు, పండ్లు, గానుగ నూనె సహా అవసరమైన ఉత్పత్తులు అన్నీ ఉంటాయి. వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తోంది.
G6
**అందుకే ధర ఎక్కువ..
‘రసాయన ఎరువులు, పురుగుమందులు వాడరు కాబట్టి సేంద్రియ రైతులకు ఖర్చు తగ్గుతుంది. అలాంటప్పుడు ఎక్కువ ధర ఎందుకు చెల్లించాలి?’ అని కొందరు వాదిస్తుంటారు. కానీ ఆ వాదన నిజం కాదు. ప్రకృతిసేద్యం చేసే రైతులు కూడా ఆవుమూత్రం, పేడ కొనాల్సి వస్తుంది. దీనివల్ల ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. ఽధరలు కూడా పెరుగుతాయి. కానీ ఎక్కువ మంది ప్రజలు వాడితే ఎక్కువ ఉత్పత్తి జరిగి భవిష్యత్‌లో ధర తగ్గే అవకాశం ఉంది. తమ కుటుంబం ఆరోగ్యం గురించి రాజీ పడనివాళ్లు ధర ఎక్కువైనా సేంద్రియ ఉత్పత్తులను కొంటున్నారు. ఈ రంగంలోనూ పోటీ తీవ్రంగా ఉంది. మేం క్వాలిటీని నమ్ముకున్నాం. ధర కొంచెం ఎక్కువైనా క్వాలిటీ దీర్ఘకాలంలో మమ్మల్ని మార్కెట్‌లో నిలబెడుతుందని నమ్ముతున్నాం.

**త్వరలో కమ్యూనిటీ స్టోర్స్‌
సేంద్రియ ఉత్పత్తులకు సంబంధించి మరొక విషయాన్ని కూడా మనం గమనించాలి. ఎంత ఆరోగ్యకరం అయినా రుచిగా లేకపోతే వినియోగదారులు ఆ ఉత్పత్తులు కొనరు. అందుకే మేం అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ‘మార్కెట్లో సుధాన్య సేంద్రియ ఆహారానికి మంచి స్పందన ఉంద’ని అత్తయ్య విజయలక్ష్మి, మామయ్య మురళీమోహన్‌ చెప్పినప్పుడు సంతోషంగా అనిపిస్తుంది. వాస్తవానికి సేంద్రీయ రైతులు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. సూపర్‌ మార్కెట్లు తాము అమ్మిన ఉత్పత్తులకు 90రోజులకోసారి చెల్లింపులు చేస్తాయి. అమ్ముడయితే డబ్బులిస్తారు. లేదంటే ప్రొడక్ట్‌ వెనక్కి ఇస్తారు. చిన్న రైతులు, వ్యాపారవేత్తలకు ఈ పద్ధతి వల్ల అనేక ఇబ్బందులు ఉంటాయి. ఈ సమస్యని పరిష్కరించడానికి మేము కొన్ని కమ్యూనిటీ స్టోర్స్‌లను ప్రారంభించాలనుకుంటున్నాం. చిరుధాన్యాలతో విలువ ఆధారిత ఉత్పత్తులు, రెడీ టూ ఈట్‌ ప్రాడక్‌ ్ట్స తయారీపై ఎక్కువ ఫోకస్‌ పెట్టాం. ప్రస్తుతం 130 రకాల ఉత్పత్తులు విక్రయిస్తున్నాం. మా దగ్గర చిరుధాన్యాలతో పాటుగ బియ్యం, నూనెలు ఎక్కువగా అమ్ముడవుతాయి. బియ్యంలో చిట్టిముత్యాలు, సోనామసూరి, తంజావూరు ఇడ్లీ బియ్యాలకు ఎక్కువ ఆదరణ ఉంది. సేంద్రియ వ్యవసాయం రైతుల విషయానికొస్తే వారి పొలాలను జియో ట్యాగింగ్‌ చేస్తున్నాం. శాటిలైట్‌ ఇమేజెస్‌తో ట్యాగ్‌ చేయడం వల్ల పొలంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటాం. వాతావరణం, నేల పరిస్థితి, గోమూత్రంతో చేసిన కషాయాల తయారీ గురించి వారికి చెబుతున్నాం.