DailyDose

నేవీ మీద ఆరోపణలా.. హవ్వ!

నేవీ మీద ఆరోపణలా.. హవ్వ!

‘ఆడలేక మద్దెల ఓడన్నట్లు..’ అనే సామెత అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపు మంత్రిగారు చెబుతున్న మాటలు కూడా అచ్చం అలాగే ఉన్నాయి. ఏపీలో జగన్మోహన్ రెడ్డి పాలన ప్రారంభం అయిన తర్వాత.. పరిశ్రమలు ఏవీ రావడం లేదని, ఉన్నవి కూడా వెళ్లిపోతున్నాయని, అభివృద్ధి పడకేసిందనేది ప్రధాన ఆరోపణ. ఉపాధి అవకాశాలు కొత్తవి ఏర్పడకుండా ఉన్నవి దెబ్బతింటున్నాయనేది ప్రధాన విమర్శ. ఈ నేపథ్యంలో ఏపీ పరిశ్రమల మంత్రి అమర్నాధ్ చెబుతున్న మాటలు.. ఈ సామెతను గుర్తుచేసేలాగానే ఉన్నాయి.

విశాఖలో ఓ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. విశాఖలో పలు ప్రాజెక్టుల ఏర్పాటుకు దేశభద్రత పేరిట నౌకాదళ అధికారులు అనుమతులు ఇవ్వడం లేదని ఆరోపించడం సంచలనంగా కనిపిస్తోంది. సువిశాలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోలెడన్ని ఓడరేవులు కూడా ఉన్న రాష్ట్రంలో మరెక్కడా అంగుళం జాగా లేనట్లుగా.. విశాఖలోనే ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని అనుకోవడం ఏంటో అర్థం కాని సంగతి.సర్కారు వారు ప్రాజెక్టులు తేవాలనుకుంటే.. అందుకు దేశభద్రతను పణంగా పెట్టి అయినా.. నేవీ వారు ఒప్పుకోవాల్సిందేనని మంత్రి గారు సెలవివ్వడం ఆయన అవగాహన రాహిత్యమో, వాళ్లమీదకు నెట్టేసి తప్పించుకుపోవాలనే పలాయనవాద దృక్పథమో అర్థం కావడం లేదు.

బీచ్ ఐటీ నినాదంతో దావోస్ లో ప్రచారం చేస్తామని, సాఫ్ట్ వేర్ కంపెనీలను తీసుకువస్తామని మంత్రి సెలవిస్తున్నారు. అయితే.. విశాఖలు ఏర్పాటు అయి కార్యకలాపాలు కూడా ప్రారంభించిన ఐటీ కంపెనీలు ఈ మూడేళ్ల కాలంలోనే దుకాణం సర్దుకుని విశాఖనుంచి పలాయనం చిత్తగించేశాయి.. దీనికి మంత్రిగారు ఏమంటారు? వారు వెళ్లిపోవడానికి కూడా నాకౌదళం వేధింపులు కారణమని నెట్టేస్తారా? ఏమో ఆయన అవగాహన చూస్తే అలా కూడా చెప్పగల ఘటికులే అనిపిస్తోంది.