DailyDose

ఒకే ఒక్కడు ఎన్టీఆర్‌.. భాగ్యనగరంతో విడదీయలేని అనుబంధం..

ఒకే ఒక్కడు ఎన్టీఆర్‌.. భాగ్యనగరంతో విడదీయలేని అనుబంధం..

నందమూరి తారక రామారావు.. వెండితెర చరిత్రలో అజరామరమైన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ. తెలుగు ప్రజల గుండెల్లో విరాజిల్లే ఆరాధ్య మూర్తి. రాజకీయాల్లో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన చైతన్య దీప్తి. ఆ మహనీయుడి రాజకీయ ప్రభంజనానికి హైదరాబాద్‌ వేదికైంది. ఇవాళ్టి నుంచి ఎన్టీఆర్‌ శత జయంత్యుత్సవాలు ప్రారంభం. ఆ మహనీయుడికి నగరంతో ప్రత్యేక అనుబంధం ఉంది.

*ట్యాంక్‌బండ్‌ మీద కొలువుదీరిన 33 మంది తెలుగు సాహిత్య, సాంస్కృతిక, వైతాళికుల విగ్రహాలు చూడగానే వీక్షకులకు ఎన్టీఆర్‌ గుర్తొస్తారు. ఆయన ముఖ్యమంత్రిగాఉన్న సమయంలో ప్రత్యేక శ్రద్ధతో ట్యాంక్‌బండ్‌ సుందరీకరణ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. తపాలాశాఖలోని అధికారి సైదులుని సమాచార శాఖ కమిషనర్‌గా నియమించి మరీ అతనికి విగ్రహాల నిర్మాణ బాధ్యతలను అప్పగించినట్లు సీనియర్‌ జర్నలిస్టు బండారు శ్రీనివాసరావు చెబుతున్నారు. హుస్సేన్‌సాగర్‌ మధ్య బుద్ధుని విగ్రహాన్ని ఎన్టీఆర్‌ హయాంలోనే ఏర్పాటు చేశారు.

చివరి వరకు..
నిమ్మకూరులో పుట్టి, గుంటూరులో చదివి, మద్రాసులో నటుడిగా ప్రస్థానం మొదలుపెట్టిన ఎన్టీఆర్‌ రాజకీయ జీవితానికి తొలి అడుగులు పడింది హైదరాబాద్‌లోనే. గండిపేట నుంచి ఆబిడ్స్‌ రామకృష్ణ స్టూడియోకి రోజూ తెల్లవారుజామున 4.30 గంటలకు కారులో వెళుతున్న ఎన్టీఆర్‌ను చూసేందుకు రోడ్డు వెంట అభిమానులు బారులుదీరేవారని ఆ సంఘటనకు ప్రత్యక్ష సాక్షి నాగభైరవ కోటేశ్వరరావు ‘ఎన్టీఆర్‌తో నా అనుభవాలు’ పుస్తకంలో రాశారు. ఎన్టీఆర్‌ తుదిశ్వాస విడిచిందీ ఇక్కడే. నెక్లెస్‌ రోడ్డులో ఆయన సమాధి మాత్రమే కాదు, ఆయన స్మారకంగా పార్కు నెలకొల్పిన సంగతి తెలిసిందే. అలా ఒకటా, రెండా…హైదరాబాద్‌ చరిత్ర పుటలో విశ్వవిఖ్యాత నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు స్మృతులెన్నో.

పార్టీ పుట్టిందీ ఇక్కడే..
టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీఆర్‌ చరిత్ర ఉంది. 1982 మార్చి 29 న ఆదర్శనగర్‌లోని న్యూఎమ్మెల్యే క్వార్టర్స్‌లోనే తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ముషీరాబాద్‌ నియోజకవర్గం గోల్కొండ చౌరస్తాలోని రామకృష్ణ సినీ స్టూడియో నుంచి జన చైతన్యయాత్రకు ఎన్టీఆర్‌ శ్రీకారం చుట్టారు. తొమ్మిది నెలలు యాత్ర తర్వాత 1983 జనవరి 5న జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్‌ ఘన విజయం సాధించారు. 1983 జనవరి 9న ఎల్బీ స్టేడియంలో తొలిసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఆబిడ్స్‌లోని ఎన్టీఆర్‌ నివాసం టూరిస్టు కేంద్రంగా మారింది.ఎన్టీఆర్‌ శత జయంత్యుత్సవాలు ప్రారంభం సందర్భంగా సేవా కార్యక్రమాలకు ఏర్పాట్లుచేసినట్లు నగర అధ్యక్షుడు పిన్నమనేని సాయిబాబా తెలిపారు.