Devotional

ఆదివాసీలు ఇప్ప‌పూల‌తో భూదేవిని పూజించే ఈ పండుగ ప్ర‌త్యేక‌త ఏంటో తెలుసా !!

ఆదివాసీలు ఇప్ప‌పూల‌తో భూదేవిని పూజించే ఈ పండుగ ప్ర‌త్యేక‌త ఏంటో తెలుసా !!

ఆదివాసీలకు అడవి తల్లే సర్వస్వం. వ్యవసాయమే జీవనాధారం. సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. ప్రకృతిని అనుసరించి పనులు ప్రారంభిస్తారు. ఐదు రోజులపాటు ‘భూదేవి’ పండుగ నిర్వహించి.. సాగు ఆరంభిస్తారు. ఈ పూజల్లో తమ కల్పవృక్షమైన ‘ఇప్పపువ్వు’కు అగ్రతాంబూలం ఇస్తారు.
tarki
సంస్కృతీ సంప్రదాయాలకు, పండుగలకు ఆదివాసీలు చాలా ప్రాధాన్యం ఇస్తారు. అడవిని నమ్ముకొని జీవిస్తూ.. ప్రకృతిని, రుతువులను అనుసరించి పండుగలు జరుపుకొంటారు. అడవిలో పండు కోయాలన్నా, తేనె తీయాలన్నా, పోడు చేయాలన్నా ‘అమ్మవారి’ని కొలిచాకే పనులు మొదలుపెడతారు. ఇందుకు.. తొలకరికి ముందే ఐదు రోజులపాటు అత్యంత భక్తి శ్రద్ధలతో ‘భూదేవి’ పండుగ జరుపుకొంటారు.
tarki3
ఇప్పపువ్వు సేకరణ
ఇప్ప చెట్టును కల్పవృక్షంగా, దేవతా వృక్షంగా భావిస్తారు. సంప్రదాయ వేడుకలు, సంబురాల్లో ఇప్ప సారా తాగడం ఆచారం. ఏటా మార్చి నుంచి మే చివరి వరకూ ఇప్ప పువ్వు సీజన్‌లో పూలను సేకరిస్తారు. భూదేవి పండుగ కోసం ప్రత్యేకంగా ఒక ఇప్పచెట్టును ఎన్నుకుంటారు. ఆ చెట్టు పూలు నేల మీద పడకుండా సేకరిస్తారు. ఇందుకోసం ఒక కొత్త బట్టను ఇప్ప మొగ్గలకు కడతారు. ఆ బట్టలో రాలిన పూలను జాగ్రత్తగా సేకరించి ముడుపు కడతారు.
tarki1
భూదేవి పూజ
ఆదివాసీలకు వ్యవసాయమే జీవనాధారం. అందుకే, తమకు బతుకు దెరువునిచ్చే భూమిని దేవతగా పూజిస్తారు. తొలకరికి ముందే భూదేవి పండుగను జరుపుకొంటారు. దీన్నే విత్తనాల వేడుకగా వ్యవహరిస్తారు. గ్రామ పెద్దలంతా కలిసి ఓ తేదీని నిర్ణయిస్తారు. ముందుగా గ్రామంలోని ప్రతి కుటుంబం నుంచీ నవధాన్యాలను సేకరిస్తారు. వాటిని ఒకచోటికి చేర్చి, గ్రామపెద్దల సమక్షంలో గ్రామ దేవతకు పూజ చేస్తారు. ధాన్యాలతోపాటు వ్యవసాయ ఉపకరణాలనూ పూజిస్తారు. పూజలో భాగంగా అమ్మవారికి కోడిని బలి ఇస్తారు. అనంతరం గ్రామ పొలిమేర బయట ఉన్న దేవతకు పందిని బలి ఇస్తారు. ‘పండుగకు పందినిస్తే పైరుకు మేలు’ అని నమ్ముతారు. పంట పొలాలను పాడు చేసే పందులను దేవతకు బలిస్తే కరువు, క్షామం లాంటివి రావనీ, పంటలు బాగా పండుతాయని ఆదివాసీల విశ్వాసం. పండుగ సందర్భంగా ఊరు చుట్టూ కట్టడిచేస్తారు. దీన్ని ‘జడి’ అని వ్యవహరిస్తారు. పండుగ తర్వాత సగం మాంసాన్ని సహపంక్తి భోజనాలకు ఉపయోగించి, మరో సగం వాటాలు చేసుకుంటారు. అంతకుముందు గ్రామంలో సేకరించిన నవధాన్యాలను గ్రామస్తులందరికీ పంచుతారు. పురుషులంతా కలిసి గ్రామ సరిహద్దుల్లో సామూహికంగా విందు భోజనాలు చేస్తారు. ఆరోజు రాత్రంతా గిరిజన సంప్రదాయ రేలా పాటలతో, థింసా నృత్యాలతో ఆనందోత్సాహాల మధ్య గడుపుతారు. మరుసటి రోజు ఉదయం తమ ఇండ్లలోని కులదైవాలకు ధాన్యం సమర్పిస్తారు. తొలకరి రాగానే సాగు పనులు ప్రారంభిస్తారు. ముందుగా కొండ జొన్న విత్తనాలు నాటుతారు. కొర్ర, సామ, నల్ల అలసంద, కంది ఎక్కువగా సాగు చేస్తారు.
tarki2
వర్షపాతం అంచనా
ఆదివాసీలు సంప్రదాయ పద్ధతిలో వర్షపాతాన్ని అంచనా వేస్తారు. గ్రామ పెద్దలు, ముత్తయిదువుల సమక్షంలో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తారు. ఒక యువకుని కళ్లకు గంతలు కట్టి, గతంలో సేకరించిన ఇప్పపూల ముడుపులోంచి రెండు పూల చొప్పున రెండు చెంబుల్లో వేయిస్తారు. ఆ పూలు మునిగితే సరైన కాలంలో వర్షాలు పడతాయని, ఒకటి మునిగి మరొకటి తేలితే ఒక కార్తిలో వర్షాలు సరిగా పడవని భావిస్తారు. ఇది తరతరాల విశ్వాసం.