DailyDose

ఒమన్‌లో ఇద్దరు భారతీయ ఇంజినీర్లు మృతి – TNI నేర వార్తలు

ఒమన్‌లో ఇద్దరు భారతీయ ఇంజినీర్లు మృతి – TNI  నేర వార్తలు

* ఒమన్‌లో దారుణం చోటు చేసుకుంది. సుమారు 6 రోజుల క్రితం నుంచి ఆచూకీ లేకుండా పోయిన ఇద్దరు ఇంజినీర్ల మృతదేహాలను అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే వాళ్ల మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..ఇద్దరు భారత ఇంజినీర్లు ఒమన్‌లోని టెలికమ్యూనికేషన్ కంపెనీలో గత కొంత కాలంగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఎప్పటిలాగే గత నెల 28న కంపెనీ పని మీద ధోఫార్ గవర్నేట్‌కు వెళ్లారు. అనంతరం పై అధికారులతో వాళ్లకు జూన్ 29న కమ్యూనికేషన్ కట్ అయింది. పని మీద ధోఫార్ గవర్నేట్‌కు వెళ్లిన ఇద్దరు ఇంజినీర్లు తిరిగి రాకపోవడం, వారి గురించిన ఎటువంటి సమాచారం లేకపోవడంతో సంస్థ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఎయిర్ ఫోర్స్, ఆర్మీ అధికారులు.. ఎడారిలో గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే కొందరు స్థానికులు ఇద్దరి మృతదేహాలను గుర్తించినట్టు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న అధికారులు.. ఆ మృతదేహాలు భారత ఇంజినీర్లవే అని గుర్తించారు. అనంతరం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు వాళ్ల మరణానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. ఆ ఇంజినీర్ల పేర్లు, వాళ్లు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్లు అనే వివరాలను పోలీసులు వెల్లడించలేదు.

*ఎలాంటి అనుముతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 33 టన్నుల రేషన్‌ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం వల్లంపట్ల గ్రామ శివారులో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.

* వైఎస్సార్‌ కడప జిల్లా యర్రగుంట్లలో విషాదం చోటుచేసుకుంది. యర్రగుంట్లలోని నీటిగుంతలో కి దూకి తల్లి, ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోయిన వారిని లక్ష్మీదేవి, అక్షయ(8), రేవంత్(6) గా గుర్తించారు. వేంపల్లి రోడ్డులో ఉన్న ఆంజనేయస్వామి గుడి వెనుక తవ్వకాలు చేపడుతున్న గని వరద నీటిలో యర్రగుంట్లలో నివాసముంటున్న లక్ష్మీదేవి, తన ఇద్దరు పిల్లలతో కలసి దూకి ఆత్మహత్య చేసుకుంది.

*హిమాచల్‌ ప్రదేశ్‌లోని కులు జిల్లాలో సోమవారం ఉదయం ఘోర బస్సు ప్రమాదం జరిగింది. విద్యార్థులు, ప్రయాణికులతో వెళ్తున్న స్కూల్‌ బస్సు అదుపుతప్పి లోయలోపడిపోయింది. ఈ దుర్ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పాఠశాల విద్యార్థులు, కొందరు ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో బస్సు నుజ్జునుజ్జు అయింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కులు జిల్లా డిప్యూటీ కమిషనర్‌ అశుతోష్‌ గార్గ్‌ చెప్పారు. సయింజ్‌ వైపునకు వెళ్తున్న బస్సు ఉదయం 8.30 ప్రాంతంలో జంగ్లా గ్రామం వద్ద ప్రమాదానికి గురైందని తెలిపారు. జిల్లా అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని అన్నారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులు ఉన్నట్టు గార్గ్‌ వెల్లడించారు.

*సాగు కోసం చేసిన అప్పులు అన్నదాతల పాలిట మృత్యుపాశాలుగా మారుతున్నాయి. రాష్ట్రంలో ముగ్గురు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వెంకటరెడ్డిపల్లికి చెందిన చవ్వా చిన్నకుళ్లాయిరెడ్డి (79) ఆదివారం విష గుళికలు మింగి, శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం జక్కేపల్లికి చెందిన రంగస్వామి (65) చెట్టుకు ఉరేసుకుని, కర్నూలు జిల్లా దేవనకొండ మండలం గుడిమిరాళ్లకు చెందిన బోయ అంజనయ్య పురుగుమందు తాగి మరణించారు.

*నార్కట్‎పల్లి 65వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి తీవ్రగాయాలు కాగా, పలువురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానికులు కామినేని ఆస్పత్రికి తలిరంచారు. ప్రమాద సమయంలో 42 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నట్లు సమాచారం. రాజోలు నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

*డెన్మార్క్ దేశంలోని మాల్‌లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. ఈ కాల్పుల్లో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌లోని ఒక షాపింగ్ సెంటర్‌లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు.మాల్ లోపల ఉన్న వ్యక్తులు పోలీసుల సహాయం కోసం వేచి ఉండాలని డెన్మార్క్ పోలీసులు సూచించారు. డెన్మార్క్ రాజధాని నగరంలో రద్దీగా ఉండే షాపింగ్ మాల్‌లో సాయుధుడు కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు.కాల్పుల తర్వాత 22 ఏళ్ల డానిష్ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కాల్పుల్లో మరెవరి ప్రమేయం లేదని, అయినప్పటికీ తాము ఇంకా దర్యాప్తు చేస్తున్నామని కోపెన్‌హాగన్ పోలీసు ఇన్‌స్పెక్టర్ సోరెన్ థామస్సేన్ చెప్పారు.

*రాత్రి పూట ఇళ్ల బయట పార్క్‌చేసి ఉంచిన మోటారు సైకిళ్లను చోరీ చేసే ఐదుగురు దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. దొంగలతో పాటు స్వాధీనం చేసుకున్న ద్విచక్ర వాహనాలను కరకంబాడి మార్గంలోని అలిపిరి ఔట్‌పోస్ట్‌లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారి ఎదుట ప్రవేశపెట్టారు. ఈస్ట్‌ డీఎస్పీ మురళీకృష్ణ కథనం మేరకు.. తిరుపతి మారుతీనగర్‌కు చెందిన మట్లి రామకృష్ణ అలియాస్‌ నాని (21), తిరుపతి డీఆర్‌ మహల్‌ సమీపంలోని గాంధీపురానికి చెందిన పసుపర్తి హర్షవర్థన్‌ అలియాస్‌ జిలేబి (19), తిరుచానూరు పంచాయతీ పాడిపేట శ్రీపురానికి చెందిన ఆడమడుగుల రాజేష్‌ (21), చంద్రగిరికి చెందిన పాలపాటి అకిలేశ్వర్‌రెడ్డి (24), చిత్తూరు జిల్లా పీలేరు మండలం గుర్రంవారిపల్లెకు చెందిన రొంపిచర్ల హరిప్రసాద్‌ (24) చిన్పప్పటి నుంచే జల్సాలకు అలవాటుపడ్డారు. డబ్బుకోసం దొంగతనాలు చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో వారు తిరుపతి ఈస్ట్‌, ఎమ్మార్‌, పల్లి, అలిపిరి, శ్రీకాళహస్తి 1, 2 టౌన్‌, సూళ్లూరుపేట పోలీసు స్టేషన్ల పరిధిలో 15 మోటారు సైకిళ్లను చోరీ చేశారు. ఆదివారం అలిపిరి -జూపార్క్‌ రోడ్డులోని అరవింద కంటి ఆస్పత్రి వద్ద నిందితులు ఉన్నట్టు గుర్తించిన అలిపిరి సీఐ అబ్బన్న, ఎస్‌ఐ చిన్నరెడ్డెప్ప, సిబ్బంది రవిరెడ్డి, ప్రసాద్‌, రాజశేఖర్‌ మరి కొందరితో కలిసి నిందితులను చట్టుముట్టి పట్టుకున్నారు. వారి నుంచి 15 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ. 7.50 లక్షలు ఉంటుంది. నిందితులపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపనున్నట్టు డీఎస్పీ వెల్లడించారు.

*ఆన్‌లైన్‌ గేమ్‌లకు మరో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ బలైంది. ఆన్‌లైన్‌ గేమ్‌ల్లో భారీగా నష్టపోయిన ఓ యువతి చెరువులోకి దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట వద్ద చిల్లకల్లు చెరువులో ఆదివారం యువతి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. పోలీసుల కథనం మేరకు… గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు గ్రామానికి చెందిన జాస్తి సోమశేఖర్‌ రెండో కుమార్తె స్వాతి బీటెక్‌ పూర్తిచేసి ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. ప్రస్తుతం వర్క్‌ఫ్రం హోంలో ఉంది. ఇక అందరూ ఆఫీసుకు రావాలని కంపెనీ ఆదేశించడంతో సోమవారం హైదరాబాద్‌ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన స్వాతి.. రాత్రి ఏడు గంటల సమయంలో తాను చిల్లకల్లు చెరువు వద్ద ఉన్నానని, బాగా ఒత్తిడికి గురవడంతో ఆత్మహత్య చేసుకుంటున్నానని తల్లి ఫోన్‌కు వాట్సాప్‌ మెసేజ్‌ పెట్టింది. దీంతో కుటుంబసభ్యులు వెంటనే చిల్లకల్లు వచ్చి పోలీసులను ఆశ్రయించారు. చెరు వు వద్ద శనివారం అర్ధరాత్రి వరకు ఈతగాళ్లతో వెతికించినా స్వాతి కనిపించలేదు. ఆదివారం ఉదయాన్నే మరోసారి ప్రయత్నించగా స్వాతి మృతదేహం లభించింది. పోస్టుమార్టం నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేశారు. కాగా ఇటీవల ఆన్‌లైన్‌ గేమ్‌లో భారీగా నష్టపోయిన ఆమె ఒత్తిడి తట్టుకోలేకే ఆత్మహత్మకు పాల్ప డి ఉంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు.

*పాయకరావుపేట మండలం రత్నయ్యపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ప్రమాదంపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు వైస్ ఎంపీపీ కె. నల్లబ్బాయిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

*వైఎస్సార్‌ జిల్లా యర్రగుంట్లలో విషాదం చోటు చేసుకుంది. యర్రగుంట్లలోని నీటిగుంతలోకి దూకి తల్లి, ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోయిన వారిని లక్ష్మీదేవి, అక్షయ(8), రేవంత్(6)గా గుర్తించారు. స్థానికులు, పోలీసులు పెద్ద ఎత్తున ఘటనస్థలికి చేరుకున్నారు. పోలీసుల సహాయంతో గజ ఈతగాళ్లు ముగ్గురి మృతదేహాలను బయటికు తీశారు. కుటుంబ కలహాలతోనే ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం కోసం మూడు మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.