NRI-NRT

అమెరికా నుంచి వ‌చ్చి మ్యూజిక్ కాంపిటీష‌న్‌లో ఇర‌గ‌దీస్తున్నాడు !

అమెరికా నుంచి వ‌చ్చి మ్యూజిక్ కాంపిటీష‌న్‌లో ఇర‌గ‌దీస్తున్నాడు !

‘ప్రణవ్‌.. నీ వాయిస్‌ చాలా ఫ్రెష్‌గా ఉంది. మంచి భవిష్యత్‌ ఉంటుంది’ సంగీత దర్శకుడు కోటి పొగడ్త. ‘ప్రణవ్‌ వాయిస్‌.. ఆకాశం నుంచి అంతరిక్షానికి ఎగబాకింది’ అంటూ అనంత శ్రీరామ్‌ అభినందన. ఇలాంటి సరైన వేదిక కోసమే అమెరికా నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు ప్రణవ్‌ కౌశిక్‌. ‘జీ తెలుగు సరిగమప’ కార్యక్రమంతో సింగర్‌గా తానేంటో నిరూపించుకున్నాడు. అందుకే క్రష్‌ కౌశిక్‌ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకుంటున్నారు.‘జీ తెలుగు సరిగమప’ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న వారిలో ప్రణవ్‌ కౌశిక్‌ ఒకరు. అమెరికా నుంచి వచ్చిన ఈ తెలంగాణ కుర్రోడి గొంతులో ఏదో మాయ ఉంది. అందుకే ఈ పాటగాణ్ని ‘క్రష్‌ కౌశిక్‌’ అంటున్నారు. తన ప్రతిభను నిరూపించుకునేందుకు మూలాలను వెతుక్కుంటూ వచ్చాడు ఈ పాటగాడు. అద్భుత గాత్రంతో అలరించడమే కాదు, త్వరలోనే వెండితెరపై హీరోగా కనిపించనున్నాడు కూడా.

ప్రణవ్‌ పుట్టింది ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని చేర్యాల. నాన్న వివేక్‌, అమ్మ మంజుల. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదివిన కౌశిక్‌ తండ్రి కొన్నాళ్లు హైదరాబాద్‌లోని డాక్టర్‌ రెడ్డీస్‌ సంస్థలో పనిచేశారు. తర్వాత అమెరికాకు వెళ్లారు. అప్పటికే ప్రణవ్‌ పుట్టాడు. కొడుక్కు నాలుగేండ్లు వచ్చాక అమెరికా తీసుకెళ్లాడు తండ్రి. ప్రణవ్‌ చదువంతా న్యూయార్క్‌లోనే సాగింది. బీఏ ఎకనామిక్స్‌ చేశాడు. చిన్నప్పటి నుంచీ పాటలు పాడటంలో దిట్ట. నాలుగేండ్లు కర్ణాటక సంగీతం కూడా నేర్చుకున్నాడు. 2018లో నాటా నిర్వహించిన పాటల పోటీల్లో టాప్‌ 5లో ఒకడిగా నిలిచాడు.
Pranav2
సంగీతంతోపాటు నటనలోనూ ఆసక్తి ఉండటంతో న్యూయార్క్‌లో థియేటర్‌ ఆర్ట్‌ వర్క్‌షాప్‌లకు హాజరయ్యేవాడు ప్రణవ్‌. స్క్రిప్ట్‌ రైటర్‌గా కొన్ని కథలు రాసుకున్నాడు. తానే హీరోగా సినిమా దర్శకత్వం వహించాలనుకున్నాడు. యూట్యూబ్‌ వేదికగా తన పాటలు, మాటలు, నటనతో అలరించేవాడు. ఆ వీడియోలకు మంచి స్పందన రావడంతో ఓ వెబ్‌ సిరీస్‌కు స్క్రిప్ట్‌ రాసుకున్నాడు. అదే సమయంలో కరోనా కల్లోలం మొదలైంది. దీంతో, ఇంటికే పరిమితమయ్యాడు.కరోనా సెకండ్‌ వేవ్‌ తర్వాత ‘జీ తెలుగు సరిగమప’ రూపంలో మరో అవకాశం ప్రణవ్‌ను పలకరించింది. ఈ కార్యక్రమానికి అమెరికా నుంచి ఆడియో ద్వారా ఆడిషన్‌ ఇచ్చాడు. చివరికి పోటీదారుల్లో ఒకడిగా నిలిచాడు. ఇప్పుడు వారం వారం తన ప్రతిభతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాడు. ప్రణవ్‌ పాటలకు మిలియన్ల కొద్దీ వ్యూస్‌ వస్తున్నాయి. పోటీ పూర్తవకుండానే ఓ ప్రముఖ దర్శకుడి సినిమాలో పాట పాడే అవకాశమూ దక్కించుకున్నాడు.

హీరోగా అవకాశం
రికార్డింగ్‌ స్టూడియోలో కౌశిక్‌ పాడుతున్న తీరుకు ఫిదా అయిన ఓ దర్శకుడు ‘కౌశిక్‌.. నువ్వు మా సినిమా ఆడిషన్స్‌కు రావాల్సింది. నిన్ను హీరోగా పరిచయం చేసేవాణ్ని’ అన్నారు. తర్వాత ఆయనే తన స్నేహితుడైన మరో దర్శకుడు కొత్త హీరో కోసం వెతుకుతున్నాడని తెలిసి.. ప్రణవ్‌ పేరును సూచించాడు. ఆడిషన్స్‌ తర్వాత అవకాశం ప్రణవ్‌నే వరించింది. మొత్తానికి మన తెలంగాణ నుంచి కొత్త గాయకుడు కమ్‌ కొత్తహీరో వెండితెరకు పరిచయం కాబోతున్నాడు.