Politics

సింగిల్ గానే పోటీచేస్తా: షర్మిల

సింగిల్ గానే పోటీచేస్తా: షర్మిల

ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నప్పుడు పొత్తుల ప్రస్తావన తెరమీదకి రావడం సాధారణం. తమ పార్టీ బలంగా లేదన్న ఉద్దేశంతోనో, లేక ఒక ప్రత్యర్థిని సెలక్ట్ చేసుకొని అతడ్ని ఓడించాలన్న ప్రణాళికలతోనో పొత్తులు పెట్టుకుంటుంటారు.అందుకే ఎన్నికలప్పుడు ప్రతీ పార్టీకి ‘పొత్తు’ ప్రశ్నలు ఎదురవుతుంటాయి. వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు కూడా అలాంటి ప్రశ్నే ఎదురవ్వగా తాను సింగిల్‌గానే పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోమని, తమ పార్టీ సింగిల్‌గానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. అన్ని రాజకీయ పార్టీలు కలిసి మహా కూటమిగా ఏర్పడినా సరే, తాము కలిసేదే లేదని ఖరాఖండీగా చెప్పారు.అలాగే ఈసారి తెలంగాణ రాష్ట్రంలో సాధారణ ఎన్నికలే జరుగుతాయని, ముందస్తు ఎన్నికల ముచ్చట ఉండనే ఉండదని షర్మిల వెల్లడించారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతాయని జోస్యం చెప్పారు. తాము చేపట్టిన పాదయాత్రం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కొనసాగుతుందని మరోసారి క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో తీసుకొచ్చిన ‘బీఆర్ఎస్’ (బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్) ఒక తుగ్లక్ ఆలోచన అని విమర్శించారు. పాదయాత్రంలో భాగంగా తమ వైఎస్సార్‌టీపీ పార్టీకి ప్రతీ గ్రామంలోనూ అనూహ్య స్పందన లభించిందని గ్రామగ్రామాన హారతులు పట్టారని జనాలు అక్కున చేర్చుకున్నారని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.