NRI-NRT

బ్రిటన్ ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గిస్తా : రిషి సునాక్

Auto Draft

ప్రజలపై పన్ను భారాన్ని తగ్గిస్తానని బ్రిటన్‌ ప్రధాన మంత్రి పోటీలో రెండో రౌండ్‌కు చేరిన మాజీ ఆర్థిక మంత్రి, రిషి సునాక్‌ స్పష్టం చేశారు. ఎన్నికల్లో విజయం సాధించడం కోసం పన్నుల్లో కోత విధిస్తానని చెప్పడం లేదన్నారు. ప్రజలను పేదరికంలోకి నెట్టివేస్తున్న ద్రవ్యోల్బణమే తన ప్రథమ శత్రువని తెలిపారు.

ప్రజలను పేదవారిగా మార్చుతున్న ద్రవ్యోల్బణానికి పగ్గాలు బిగించి.. వారిపై పన్నుల భారాన్ని సముచిత రీతిలో తగ్గిస్తానని బ్రిటన్‌ ప్రధాన మంత్రి పోటీలో రెండో రౌండ్‌కు చేరిన మాజీ ఆర్థిక మంత్రి, భారతీయ మూలాలున్న రిషి సునాక్‌ స్పష్టం చేశారు. ఎన్నికల్లో విజయం సాధించడం కోసం పన్నుల్లో కోత విధిస్తానని చెప్పడం లేదన్నారు. అధికార కన్జర్వేటివ్‌ పార్టీ ఎంపీల మధ్య జరిగిన తొలి, రెండో విడత రేసుల్లో రిషి మిగిలిన పోటీదారుల కన్నా అగ్రభాగంలో నిలిచారు. ఈ సందర్భంగా బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై తన అభిప్రాయాలను రిషి స్పష్టం చేశారు. ప్రజలను పేదరికంలోకి నెట్టివేస్తున్న ద్రవ్యోల్బణమే తన ప్రథమ శత్రువని, దానిని కట్టడి చేయడానికి తొలి ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. ‘పార్లమెంటు ఆమోదంతోనే పన్నుల్లో కోత విధిస్తా. అత్యంత బాధ్యతాయుతంగా ఆ పని చేస్తా. విజయం సాధించడం కోసం పన్నుల భారం తగ్గిసానని చెప్పడంలేదు. పన్నుల్లో కోత విధించేందుకే గెలుస్తాను’ అని వివరించారు. 2024లో పార్లమెంటు ఎన్నికల్లో విపక్ష లేబర్‌ పార్టీని ఓడించగల సమర్థుడైన టోరీ నేతను తానేనని ధీమా వ్యక్తంచేశారు.

దేశాన్ని నడిపించే సత్తా ఉంది:
బోరిస్‌ జాన్సన్‌ ప్రభుత్వంలో తాను చేరడానికి కొన్ని నెలల ముందు వరకూ అమెరికా గ్రీన్‌ కార్డును కలిగి ఉన్నానని, రాజకీయాల నుంచి విరమించుకున్న తర్వాత ఆ దేశంలోనే స్థిరపడతానని తనపై వస్తున్న విమర్శలను రిషి తోసిపుచ్చారు. ‘అమెరికాలో చదువుకున్నాను. అక్కడే ఉద్యోగం చేశాను. అయితే, సేవ చేయడం కోసం బ్రిటన్‌కు తిరిగి వచ్చాను. ఎంపీగా విజయం సాధించి మంత్రి పదవిని చేపట్టాను. అదృష్టం వరిస్తే బ్రిటన్‌ ప్రధాన మంత్రిని అవుతాను. పలు సవాళ్లతో కొట్టుమిట్టాడుతున్న దేశాన్ని సమర్థంగా నడిపించగలనని దృఢంగా విశ్వసిస్తున్నా. నిజాయితీగా, బాధ్యతాయుతంగా ఆ విధులను నిర్వర్తిస్తా. అందుకు అవసరమైన శక్తిసామర్థ్యాలు, అనుభవం, దేశాన్ని ఆర్థికంగా ప్రగతిపథంలో నడిపించగల దార్శనికత నాకుందని’ సునాక్‌ తెలిపారు.పనితీరు ఆధారంగానే నిర్ణయించాలి: అత్యంత ధనవంతుడినని, ప్రధాని పదవికి అర్హుడిని కానని తనపై వస్తున్న విమర్శలకు రిషి సునాక్‌ దీటుగా స్పందించారు. ‘సంపద ఆధారంగా వ్యక్తుల స్థాయిని నిర్ణయించడం తగదు.. ఎవరికైనా వ్యక్తిత్వమే గీటురాయి. రెండేళ్లు దేశ ఆర్థిక మంత్రిగా పనిచేశాను. ఆ సమయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నాను, వాటిని ఎలా అమలుపరిచానన్నది ప్రాతిపదికగా నేనేమిటో నిర్ధరణకు రావాలి’ అని ఆయన కోరారు. కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యుడిగా శ్రమను, జీవితంలో ఎదగాలన్న కలలను నమ్ముకున్న వ్యక్తిగా తనను అభివర్ణించుకున్నారు. దేశంలో అత్యంత ధనికుల జాబితాను ‘సండేటైమ్స్‌’ మీడియా ఇటీవల ప్రచురించింది. అందులో రిషి సునాక్‌, ఆయన భార్య అక్షతా మూర్తి పేర్లు ఉన్నాయి.

వలసలకు సానుకూలమే కానీ..:
బ్రిటన్‌కు వలస వచ్చి ఇక్కడే స్థిరపడిన వారికి పుట్టిన బిడ్డగా ఈ దేశం ఎటువంటి అవకాశాలను కల్పిస్తుందో తనకు బాగా తెలుసునని రిషి చెప్పారు. ఇతర దేశాల వారిని సాదరంగా స్వాగతించే సగర్వమైన చరిత్ర బ్రిటన్‌ సొంతమన్నారు. అయితే, దేశంలోకి వచ్చే వారిపై నియంత్రణ విధించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.