Devotional

ఆగస్టు 1న శ్రీవారి పవిత్రోత్సవాల టికెట్లు విడుదల

ఆగస్టు 1న శ్రీవారి పవిత్రోత్సవాల టికెట్లు విడుదల

ఆగస్టు 1న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాల టికెట్లు విడుదల కానున్నాయి. 600 టికెట్లు జారీ చేయనున్నట్లు తితిదే వెల్లడించింది. మూడ్రోజుల పాటు జరిగే స్నపన తిరుమంజ‌నం, చివ‌రిరోజు పూర్ణాహుతిలో పాల్గొనే అవకాశం కల్పించనున్నారు.భక్తుల సౌకర్యార్థం శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాల టికెట్లను తితిదే ఆగస్టు ఒకటిన ఉదయం 10గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. దాదాపు 600 టికెట్లను అందుబాటులో ఉంచనుంది. టిక్కెట్‌ ధర ఒకరికి రూ.2,500గా నిర్ణయించింది. పవిత్రోత్సవాలు ఆగస్టు 8 నుంచి 10వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న విషయం తెలిసిందే. మరింత సమాచారం www.tirumala.org, www.tirupatibalaji.gov.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

2. బోనాలు తెలంగాణ వైభవాన్ని చాటే పండుగ
బోనాల పండుగ తెలంగాణ రాష్ట్ర వైభవం, సంస్కృతిని చాటి చెబుతుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని దేవాదాయశాఖ ప్రధాన కార్యాలయంలో వెలసిన బంగారు మైసమ్మ అమ్మవారికి ఆ శాఖ ఉద్యోగులు శుక్రవారం బోనాలు సమర్పించారు. ఈ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి అల్లోల మాట్లాడుతూ బోనాల పండుగకు ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించిందన్నారు. అమ్మవార్లను దర్శనానికి ఆలయాలకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని చోట్ల ఏర్పాట్లు చేశామని వివరించారు.దేవాదాయశాఖ కమిషనర్ అనీల్ కుమార్, ఇతర అధికారులు ఈ బోనాల వేడుకల్లో పాల్గొన్నారు. కాగా, ఈ వేడుకల అనంతరం మంత్రిని కలిసిన అర్చక, ఉద్యోగ జేఏసీ సభ్యులు గ్రాంట్ ఇన్ ఎయిడ్ వేతనాల అంశంపై చర్చించారు. అంతేకాక, రాష్ట్రంలో ఆలయాల నిర్వహణకు ఈవో పోస్టుల సంఖ్య పెంచాలని ఈవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పురేంధర్ మంత్రిని కోరారు. ప్రస్తుతం ఒక్కో ఈవో ఒకటి కంటే ఎక్కువ ఆలయాల బాధ్యతలు చూసుకుంటున్నారనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

3.గండి క్షేత్రంలో వైభవంగా శ్రావణ మాసం ఉత్సవాలు
డప:జిల్లాలోని గండి క్షేత్రంలో శ్రావణ మాసం ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. గండి ఆంజనేయ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ప్రత్యేక అలంకారంలో అంజన్న భక్తులకు దర్శనం ఇస్తున్నారు. తొలి శ్రావణ శనివారం కావడంతో పెద్ద సంఖ్యలో స్వామి దర్శనం కోసం భక్తులు క్యూలైన్‌లో వేచి ఉన్నారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన పోలీస్ బందో బస్తును ఏర్పాటు చేశారు.

4. అన్నవరంలో సత్యదేవుణ్ని దర్శించుకున్న నేపాల్‌ ప్రధాని
ఏపీలోని కాకినాడ అన్నవరంలో వెలసిన సత్యదేవుణ్ని నేపాల్‌ ప్రధాని షేర్‌ బహదూర్‌, అరుణాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పెనూఖండు ఇవాళ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్‌, ఎగ్జిక్యూటీవ్‌ అధికారులు వారికి ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. ఆలయ అర్చకులు నేపాల్‌ ప్రధాని, సీఎంతో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శాలువాలతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

5. శ్రీ వేంకటేశ్వరస్వామికి అపర భక్తురాలైన భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 205వ వర్ధంతి ఉత్సవాలు వచ్చే నెల 5, 6వ తేదీల్లో తిరుమల, తిరుపతితోపాటు తరిగొండలో ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ బోర్టు ఏర్పాట్లు చేస్తున్నది. వెంగమాంబ జన్మస్థలమైన తరిగొండలో కొలువైన శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ఆగస్టు 5వ తేదీ సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు. మరుసటిరోజు సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీలక్ష్మీనృసింహస్వామి కల్యాణోత్సవం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.కాగా, తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో ఆగస్టు 5వ తేదీన ఉదయం 9 నుంచి 10 గంట‌ల వ‌ర‌కు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో భక్తి సంగీత కార్యక్రమాలు, ఉద‌యం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తరిగొండ వెంగమాంబ సాహిత్యంపై సదస్సు నిర్వహించనున్నారు. అదేరోజు సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదేవిధంగా ఆగస్టు 6వ తేదీ ఉదయం 9 గంటలకు ఎంఆర్‌పల్లి సర్కిల్‌ వద్ద ఉన్న తరిగొండ వెంగమాంబ విగ్రహానికి టీటీడీ అధికారులు పుష్పాంజలి ఘటిస్తారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రముఖ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆగస్టు 6వ తేదీ ఉదయం 11 గంటలకు తిరుమలలోని తరిగొండ వెంగమాంబ బృందావనంలో టీటీడీ ఉన్నతాధి కారులు పుష్పాంజలి సమర్పించనున్నారు. అనంత‌రం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గోష్టిగానం జ‌రుగుతుంది.తరిగొండ వెంగమాంబ క్రీ.శ 1730 లో చిత్తూరు జిల్లా వాయల్పాడు సమీపంలోని తరిగొండ గ్రామంలో కానాల మంగమాంబ, కానాల కృష్ణయామాత్యులు దంపతులకు జన్మించారు. శ్రీ వేంకటేశ్వరుని దయవల్ల కలిగిన సంతానం కావున ఈమెకు ‘వెంగమాంబ’ అని పేరు పెట్టారు. ఈమెకు పదేండ్ల వయసులోనే ఇంజేటి వేంకటాచలపతి అనే వ్యక్తితో బాల్య వివాహం జరిగింది. వివాహమైన కొన్నాళ్లకే భర్త వియోగం ఏర్పడింది. అయినా శ్రీ వేంకటేశ్వరుడే తన భర్త అని ప్రకటించి వెంగమాంబ ముత్తయిదువు చిహ్నాలు ధరించే ఉండేవారు. మదనపల్లికి చెందిన రూపావతారం సుబ్రహ్మణ్యయోగి వద్ద ఆధ్యాత్మిక విద్య, యోగవిద్య ఉపదేశం పొందారు. కొద్దికాలానికే ఆ విద్యల్లో ఎంతో అనుభవం సాధించారు. ఆధ్యాత్మిక, భక్తి, యోగ విషయాలకు సంబంధించి తరిగొండలో 5, తిరుమలలో 13 పుస్తకాలు రాశారు. ఇందులో యక్షగానాలు, సంకీర్తనలు, స్తోత్రాలు, పద్యరచనలు, ద్విపదరచనలు ఉన్నాయి. వెంగమాంబ తిరుమల శ్రీవారి ఆలయంలో ఏకాంతసేవలో ”ముత్యాలహారతి” అనే విశిష్ట నిత్యకైంకర్యాన్ని నెలకొల్పారు. ఈ సేవ నేటికీ జరుగుతూనే ఉంది. 1817 లో తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీవేంకటేశ్వరున్ని స్మరిస్తూ వెంగమాంబ సజీవసమాధి చెందారు.