Business

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు – TNI నేటి వాణిజ్య వార్తలు

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు  – TNI నేటి  వాణిజ్య వార్తలు

*దేశీయ స్టాక్‌ మార్కెట్‌లపై జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌ ప్రభావం చూపుతున్నాయి. క్రూడ్ ఆయిల్‌ 6 నెలల కనిష్టానికి పడిపోవడం, ఆశాజనకంగా త్రైమాసిక ఫలితాలు, ఫారెన్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్ల కొనుగోలు ఆసక్తిని ప్రోత్సహిస్తుండడం, గ్లోబల్ మార్కెట్లు లాభా పడ్డాయి. దీంతో సోమవారం ఉదయం దేశీయ స్టాక్‌ మార్కెట్‌లు స్తబ్ధుగా ప్రారంభమయ్యాయి.

* బంగారం, వెండి ధ‌ర‌లు భ‌గ్గుమంటున్నాయి. డాల‌ర్‌తో రూపాయి మార‌కం క్షీణించ‌డం, ఆర్ధిక మాంద్యం భ‌యాల‌తో ఖ‌రీదైన లోహాలకు డిమాండ్ ఎగ‌బాకింది. మ‌ల్టీ క‌మాడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్‌)లో సోమ‌వారం బంగారం, వెండి ధ‌ర‌లు భార‌మ‌య్యాయి. ప‌ది గ్రాముల బంగారం రూ 81 పెరిగి రూ 51,793 పలికింది.ఇక కిలో వెండి రూ 209 పెరిగి రూ 57398కి చేరింది. బంగారం ధ‌ర‌లు ఎక్సైజ్ సుంకం, మేకింగ్ చార్జీలు, రాష్ట్రాల ప‌న్నుల ఆధారంగా ప‌లు ప్రాంతాల్లో ఒక్కో రకంగా ఉంటాయి. మ‌రోవైపు ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ కేసులు పెరుగుతుండ‌టం, ఆర్ధిక మాంద్యం ఆందోళ‌న‌లు, క‌రెన్సీల ప‌త‌నం వంటి కార‌ణాల‌తో ప‌సిడి ధ‌ర‌లు పెరిగే అవ‌కాశం ఉంద‌ని బులియ‌న్ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

*అంతర్జాతీయం గా ఉక్కు ధరలు తగ్గిన ప్రభావంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి ఎన్‌ఎండీసీ నికర లాభం 54% క్షీణించింది. గత ఏడాది జూన్‌ త్రైమాసి కంలో రూ.3,193 కోట్ల లాభాన్ని ప్రకటించగా.. ఈ ఏడాది జూన్‌ త్రైమాసికంలో రూ.1,469 కోట్లకు పరిమితమైనట్లు కంపెనీ వెల్లడించింది. ఇతర, వడ్డీ ఆదాయంతో కలిపి మొత్తం ఆదాయం కూడా 26 శాతం క్షీణించి రూ.6,656 కోట్ల నుంచి రూ.4,913 కోట్లకు చేరింది.

*ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ (ఐఓబీ).. జూన్‌తో ముగిసిన త్రైSమాసికంలో రూ.392 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలం (రూ.327 కోట్లు)తో పోల్చితే లాభం 20 శాతం వృద్ధి చెందింది. త్రైమాసిక సమీక్షా కాలంలో బ్యాంక్‌ మొత్తం ఆదాయం మాత్రం రూ.5,607 కోట్ల నుంచి రూ.5,028 కోట్లకు తగ్గింది. ఈ కాలంలో ఎన్‌పీఏలు తగ్గటం.. లాభం పెరిగేందుకు దోహదపడిందని పేర్కొంది. కాగా నికర వడ్డీ మార్జిన్‌ 2.34ు నుంచి 2.53 శాతానికి పెరిగింది. బ్యాంక్‌ స్థూల ఎన్‌పీఏలు 11.48ు నుంచి 9.03 శాతానికి, నికర ఎన్‌పీఏలు 3.15ు నుంచి 2.43 శాతానికి తగ్గాయి.

*బీమా కంపెనీలపై వచ్చే ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్‌డీఏఐ) మరింత పటిష్ఠం చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఉన్న ఫిర్యాదుల సమగ్ర పరిష్కార వ్యవస్థ (ఐజీఎంఎస్‌) ను సమూలంగా పునర్‌వ్యవస్థీకరిస్తోంది. ‘బీమా భరోసా’ పేరుతో ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించనుంది. పాలసీదారులు ఈ పోర్టల్‌ ద్వారా బీమా కంపెనీలపై 13 ప్రాంతీయ భాషల్లోనూ ఫిర్యాదు చేయవచ్చు. తమ ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియ ఏ దశలో ఉందీ ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు. ఫిర్యాదుల నమోదు, పరిష్కార ప్రక్రియ, పరిష్కారం అంతా ఈ పోర్టల్‌ ద్వారానే జరగనుంది. నిర్ణీత గడువులోగా బీమా కంపెనీలు ఈ ఫిర్యాదులు పరిష్కరించాలి. పాలసీదారులు ఫిర్యాదు నమోదు చేసిన వెంటనే వారి మొబైల్‌/ఈ-మెయిల్‌కు సమాచారం వచ్చేలా ప్రత్యేక ఏర్పాటు చేస్తారు.

*గత వారం మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనప్పటికీ చివరి రెండు ట్రేడింగ్‌ సెషన్లలో లాభాల స్వీకరణ కారణంగా నెగిటివ్‌గా క్లోజయ్యాయి. నిప్టీ కీలకమైన 17500 స్థాయిని చేరుకోవటం ఒక్కటే సానుకూల అంశం. ఈ వారం కార్పొరేట్‌ ఆర్థిక ఫలితాలు, అంతర్జాతీయ ట్రెండ్స్‌.. దేశీయ మార్కెట్ల గమనాన్ని నిర్దేశించనున్నాయి. మంగళవారం మొహర్రం కారణంగా మార్కెట్లకు సెలవు. ఈ వారం కూడా గరిష్ఠ స్థాయిల వద్ద లాభాల స్వీకరణకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిఫ్టీ అప్‌ట్రెండ్‌ను కనబరిస్తే 17500-17650 వద్ద నిరోధ స్థాయిలుంటాయి. ఒకవేళ డౌన్‌ట్రెండ్‌ను సూచిస్తే 17300-17150 వద్ద మద్దతు స్థాయిలుంటాయి. ఈ వారం కూడా గరిష్ఠ స్థాయిల వద్ద కొంత కన్సాలిడేషన్‌కు అవకాశం లేకపోలేదు.

*హిందూస్థాన్ ఏరోనాటిక్స్ షేర్లు నేడు దూసుకెళ్లాయి. కంపెనీ షేర్లు సోమవారం బీఎస్ఈలో ఇంట్రాడేలో 5 శాతం ర్యాలీ చేసి సరికొత్త గరిష్టం రూ.2,094కి చేరాయి. గత ఆరు నెలల్లో.. 52 శాతం ర్యాలీ చేసింది. బెంచ్‌మార్క్ ఇండెక్స్‌ లో 1.4 శాతం లాభపడింది. ఏడాది కాలంలో హెచ్ఏఎల్ మార్కెట్ ధర 94 శాతం జూమ్ చేసింది.

*రాబోయే పండగల సీజన్‌పై కార్ల కంపెనీలు చాలా ఆశలు పెట్టుకున్నాయి. కొవిడ్‌ మహమ్మారి, చిప్‌ల కొరతతో గత రెండేళ్లుగా ఈ కంపెనీల అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. కొనుగోలుదారులూ గత రెండేళ్లుగా పొదుపు మంత్రం పాటించడం ఇందుకు మరో కారణం. ఇప్పుడు కొవిడ్‌ భయాలు లేవు. చిప్‌ల కొరత కూడా చాలా వరకు తగ్గింది. దీంతో ఈ నెల 11 నుంచి అక్టోబరు 25 (దీపావళి) వరకు ఉండే పండగల సీజన్‌పై కంపెనీలు చాలా ఆశలు పెట్టుకున్నాయి. ఇందుకోసం ఇప్పటికే రంగం సిద్ధం చేశాయి. దాదాపు 2.12 లక్షల లేటెస్ట్‌ మోడల్‌ కార్లను డీలర్ల వద్ద రెడీగా ఉంచాయి. దీనికి తోడు కొత్త మోడల్స్‌తోనూ సిద్ధమవుతున్నాయి.

*ఆర్బీఐ నిర్ణయం వెలువడిన వెంటనే ఐసీఐసీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) తమ రెపో ఆధారిత రుణాల వడ్డీ రేట్లు పెంచేశాయి. రెపో ఆధారిత రుణాల వడ్డీ రేటును పీఎన్బీ 7.40 శాతం నుంచి 7.90 శాతానికి పెంచింది. ఈ నిర్ణయం ఈ నెల 8 నుంచి అమల్లోకి వస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ కూడా తన రెపో ఆధారిత రుణాల వడ్డీ రేటును 9.10 శాతానికి పెంచింది. ఈ పెంపు శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చినట్టు బ్యాంక్ పేర్కొంది. త్వరలోనే మరిన్ని బ్యాంకులు ఈ రెండు బ్యాంకులను అనుసరించే వీలుంది.

*కాఫీని ఎగు మతి చేస్తున్న సీసీఎల్ ప్రొడక్ట్స్ తిరుపతి సమీపంలో కొత్త కాఫీ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయనుంది. 100 శాతం సొంత అనుబంధ కంపెనీని ఏర్పాటు చేసి తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం కువ్వకొల్లి గ్రామంలో 16 వేల టన్నుల వార్షిక సామర్థ్యంతో స్ర్పే డ్రైడ్ ఇన్స్టంట్ కాఫీ తయారీకి కొత్త యూనిట్ను ఏర్పా టు చేయడానికి బోర్డు ఆమోదం తెలిపింది. ఇందుకు రూ.320 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు కంపెనీ వెల్లడించింది. దేశీయంగా కొత్త కాఫీ యూనిట్ను ఏర్పా టు చేయాలని భావిస్తున్నట్లు ఇటీవల సీసీఎల్ మేనే జింగ్ డైరెక్టర్ చల్లా శ్రీశాంత్ తెలిపారు. ఈ నేపథ్యంలో తిరుపతి సమీపంలో కొత్త కాఫీ యూనిట్ ఏర్పాటు చేయడానికి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది.

*ఇటీవలి కాలంలో ప్రైవేటు సెక్టార్ బ్యాంక్ కరూర్ వైశ్యా షేర్లు తమ ర్యాలీని కొసాగిస్తున్నాయి. నేడు కూడా ఈ ర్యాలీని కొనసాగించాయి. శుక్రవారం ఇంట్రా డేలో కరూర్ వైశ్యా బ్యాంకు స్టాక్ 4 శాతం లాభపడి రెండేళ్ల గరిష్టం రూ.63.35కి చేరుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్తో ముగిసిన త్రైమాసికంలో అదిరిపోయే ఫలితాలను వెల్లడించిన తరువాత ఈ బ్యాంకు అదరగొడుతోంది

* ప్రస్తుత ఆర్థిక సంవత్సంర జూన్తో ముగిసిన త్రైమాసికంలో బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో గత రెండు రోజులుగా కంపెనీ షేర్లు దారుణంగా పతనమవుతున్నాయి. శుక్రవారం ఇంట్రా డేలో 6 శాతం పడిపోయి రూ.2,190కి చేరుకున్నాయి. ముడి సరుకు ధరలు పెరగడంతో మార్జిన్ పనితీరును ప్రభావితం చేసింది. దీంతో త్రైమాసిక ఫలితాలు నిరాశాజనకంగా మారాయి.

*దేశీయ స్టాక్ మార్కెట్లో ఆరు రోజుల వరుస ర్యాలీకి తెరపడింది. ఆర్బీఐ ద్రవ్యపరపతి సమీక్ష నిర్ణయాలను శుక్రవారం ప్రకటించనున్న నేపథ్యంలో ఈక్విటీ ఇన్వెస్టర్లు బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇంధన రంగ షేర్లలో లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. రూపాయి పతనం మార్కెట్పై ఒత్తిడిని మరింత పెంచింది. దాంతో బీఎ్సఈ సెన్సెక్స్ గురువారం 51.73 పాయింట్లు తగ్గి 58,298.80 వద్ద స్థిరపడింది. ఎన్ఎ్సఈ నిఫ్టీ 6.15 పాయింట్ల నష్టంతో 17,382 వద్ద క్లోజైంది.

*దేశంలో 5జీ వాణిజ్య సేవలు వచ్చేనెల 29న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయని సమాచారం. ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2022’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా 5జీ సేవలను ఆరంభించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 1 వరకు జరగనున్న ఐఎంసీలో దేశీయ, అంతర్జాతీయ టెలికాం కంపెనీలు, వెండా ర్లు పాల్గొంటున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా కంపెనీలు తమ 5జీ టెక్నాలజీలను ప్రదర్శించనున్నాయి. ఇంతకు ముందు ప్రణాళిక ప్రకారం.

*ఫ్యూచర్ రిటైల్ లెక్కల ఖాతాలను మార్కెట్ నియంత్రణ మండలి సెబీ జల్లెడ పడుతోంది. ఆర్థిక విషయాలకు సంబంధించి కంపెనీ ఏమైనా అక్రమాలకు పాల్పడిందీ లేనిదీ తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ ఆడిట్కు ఆదేశించింది. ఇందుకోసం మెస్సర్స్ చోక్సీ అండ్ చోక్సీ ఆడిట్ సంస్థను నియమించింది. ఆర్థిక వివరాలు, లావాదావీల వెల్లడిలే ఫ్యూచర్ రిటైల్ నిబంధనలు తుంగలో తొక్కిందనే సముచిత అనుమానంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సెబీ తెలిపింది.