WorldWonders

పెళ్లి కొడుకుల సంత గురించి మీకు తెలుసా?

పెళ్లి కొడుకుల సంత గురించి మీకు తెలుసా?

పెళ్లి సంబంధాల కోసం.. సాధారణంగా బంధువుల ద్వారా విచారించడమో లేక మధ్యవర్తులను ఆశ్రయించడమో చేస్తుంటారు. ఇటీవల మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ల ద్వారా పెళ్లి సంబంధాలు చూడడం అందరికీ తెలిసిందే. కొన్నిసార్లు కొందరు తమ కుమార్తెలకు వివాహం చేసేందుకు చాలా ఇబ్బందులు పడుతుంటారు. సరైన సంబంధాలు రాకపోవడం, వచ్చినా అధిక కట్నాలు డిమాండ్ చేయడం తదితర కారణాలతో పెళ్లిళ్లు చేయడం కష్టమవుతుంటుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రాంతంలో ఇలాంటి సమస్యలు ఏవీ లేవు. అక్కడ తొమ్మిది రోజుల పాటు పెళ్లికొడుకుల సంత జరుగుతుంది. ఆడపిల్లల తల్లిదండ్రులు అక్కడికి వెళ్లి తమకు అనువైన సంబంధాలను చూసుకోవచ్చు. వింతగా ఉన్న ఈ పెళ్లికొడుకుల మార్కెట్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

బీహర్ రాష్ట్రం మధుబని జిల్లాలో ఈ వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. ఒకటి రెండు కాదు.. ఏకంగా 700సంవత్సరాల నుంచి వారు ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. పెళ్లి వయసుకు వచ్చిన యువకులంతా సాంప్రదాయ దుస్తులు ధరించి, ఓ చెట్టు కింద వరుసగా కూర్చుంటారు. వధువు తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి అక్కడికి చేరుకుంటారు. ముందుగా పెళ్లి కుమారులందరినీ చూసిన తర్వాత, ఇష్టమైన వారిని వధువు సెలెక్ట్ చేయగానే.. మిగతా విషయాలు పెద్దలు మాట్లాడుకుంటారు. వివాహం ఖాయం చేసుకునే ముందు.. వధూవరుల జనన ధ్రవీకరణ పత్రాలు , విద్యార్హత తదితర అంశాలపై చర్చించుకుంటారు.

ఈ తంతు పూర్తవగానే మిగతా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అప్పట్లో రాజా హరి సింగ్ అనే వ్యక్తి ఈ సాంప్రదాయాన్ని ప్రారంభించారని చెబుతున్నారు. వివాహాల కారణంగా ఆడపిల్లల తల్లిదండ్రులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఆయన ఈ పద్ధతిని ప్రవేశ పెట్టారట. అలాగే కట్నాలు తీసుకోవడం కూడా ఇక్కడ నిషేధం. అయితే ఇటీవల చాలా మంది అనధికారికంగా కట్నాలు తీసుకోవడం సాధారణమైందని స్థానికులు చెబుతున్నారు. మొత్తానికి ఈ పెళ్లికొడుకుల సంత.. సోషల్ మీడియాలో ఇటీవల హాట్‌టాపిక్‌గా మారింది.