NRI-NRT

అమెరికా వీసాకు దరఖాస్తు చేసుకున్నారా.. మీకో శుభవార్త..

అమెరికా వీసాకు దరఖాస్తు చేసుకున్నారా.. మీకో శుభవార్త..

అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారా.. అయితే మీకో గుడ్ న్యూస్. కొన్ని కేటగిరీల వీసాల విషయంలో ఈఏడాది డిసెంబర్ 31 వరకూ ఇంటర్వ్యూలు రద్దు చేసేందుకు అమెరికా నిర్ణయించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ..కాన్సులార్ అధికారులకు అదేశాలు జారీ చేసింది. ఎఫ్, హెచ్-1, హెచ్-3, హెచ్-4, నాన్ బ్లాంకెట్ ఎల్, ఎమ్, ఓ, పీ, క్యూ వీసాలకు దరఖాస్తు చేసుకున్న వారితోపాటూ అకాడమిక్ జే వీసా దరఖాస్తుదారులకు కూడా ఈ మినహాయింపు వర్తించనుంది. అంతేకాకుండా.. తమ వీసా గడువు ముగిసిన 48 నెలల్లోపు రెన్యూవల్‌కు దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఇంటర్వ్యూల నుంచి మినహాయింపు ఇచ్చారు.

ఇదిలా ఉంటే..
వీసా అపాయింట్‌మెంట్ కోసం ఎదురు చూస్తున్న వారికీ మరింత ఆలస్యం తప్పేటట్టు లేదు. ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై కాన్సులార్ కార్యాలయ్యాల్లో దరఖాస్తు చేసుకున్న వారికి అపాయింట్ దొరకడం కొంత ఆలస్యం అవుతుందని అమెరికా అధికారులు తెలిపారు. త్వరిత గతిన వీసా అపాయింట్‌మెంట్ కావాలనుకుంటే.. యూఎస్ ఎంబసీ వెబ్‌సైట్ ప్రకారం.. ఎక్స్‌పిడైటెడ్ అపాయింట్‌మెంట్ కోసం అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎక్స్‌పిడైటెడ్ అపాయింట్‌మెంట్ లభించిన పక్షంలో అధికారులు ఈ మెయిల్ ద్వారా అభ్యర్థులకు సమాచారం అందిస్తారు. అయితే.. ఎక్స్‌పిడైటెడ్ అపాయింట్‌మెంట్ స్లాట్లు చాలా పరిమితంగా ఉన్నట్టు అమెరికా తెలిపింది. మరోవైపు.. ఇప్పటికే ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్న వారు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఎంబసీ కీలక ప్రకటన చేసింది. వారి చెల్లింపుల కాలపరిమితి 2023 సెప్టెంబర్ 30 వరకూ పొడిగిస్తున్నట్టు పేర్కొంది. సాధారణ కాన్సులార్ సర్వీసుల రద్దు కారణంగా వీసా అపాయింట్ మెంట్ పొందలేని వారికి మళ్లీ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించకుండానే వీసా అపాయింట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.