DailyDose

మనుమరాలికి జన్మనిచ్చిన నానమ్మ.. ఎక్కడో తెలుసా..?

మనుమరాలికి జన్మనిచ్చిన నానమ్మ.. ఎక్కడో తెలుసా..?

ఇటీవల కాలంలో సోషల్‌మీడియాలో ఎక్కువగా విన్న పదం సరోగసి. ఇందుకు ప్రధాన కారణం పలువురు సెలబ్రిటీలు ఈ పద్ధతి ద్వారా పిల్లల్ని కనడం. తాజాగా అమెరికాలో ఆశ్చర్యకర ఘటన ఒకటి చోటు చేసుకుంది. 56 ఏళ్ల మహిళ తన కుమారుడు, కోడలి కోసం సరోగసి ద్వారా ఐదో బిడ్డకు జన్మనిచ్చింది. ఆశ్చర్యపోతున్నారా… ? ఇలాంటి ఘటన ఎప్పుడూ విని ఉండరు కదూ..! అవును, మీరు విన్నది నిజమే. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

అమెరికాలోని ఉతహ్‌ ప్రాంతంలో నివాసం ఉండే జెఫ్‌ హౌక్‌‌, కేంబ్రియా దంపతులు. వీరికి ఇప్పటికే నలుగురు పిల్లలున్నారు. మరో బిడ్డను కనాలనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల కేంబ్రియా గర్భం తీసేయాల్సి వచ్చింది. దీంతో వారు మరో బేబీని పొందే అవకాశం లేకుండా పోయింది. ఇతర మార్గాల్లో బిడ్డను పొందేందుకు ప్రయత్నించారు. అయితే వారి ప్రయత్నం ఫలించలేదు. ఏం చేయాలా..? అని ఆలోచిస్తున్న సమయంలో జెఫ్‌ తల్లి 56ఏళ్ల నాన్సీ హౌక్‌ వారికి ఓ సలహా ఇచ్చింది.

సరోగసి ద్వారా ఐదో బిడ్డను తానే కంటానని తెలిపింది. అయితే ఇందుకు కుమారుడు, కోడలు ముందు ఒప్పుకోలేదు. చివరకు ఒప్పించి కొడుకు, కోడలి ఐదో బిడ్డకు నాన్సీ జన్మనిచ్చింది. ఆ పాపకు హన్హ అని నామకరణం కూడా చేశారు. ఈ విషయాన్ని కేంబ్రియా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపింది. నాన్సీ బేబీబంప్‌ ఫొటోలు సైతం పంచుకుంది. ప్రస్తుతం ఈ వార్త, ఫొటోలు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి.