DailyDose

భారతీయులపై పుతిన్ సంచలన వ్యాఖ్యలు

Auto Draft

రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ మరోసారి భారత దేశంపై ప్రశంసల జల్లు కురిపించారు. భారతీయులు ప్రతిభావంతులని, అభివృద్ధిలో అద్భుత ఫలితాలను సాధించేందుకు అవసరమైన గొప్ప సమర్థత, విజయకాంక్ష కలవారని అన్నారు. నవంబరు 4న రష్యన్ యూనిటీ డే సందర్భంగా ఆయన ప్రసంగించారు.

100 కోట్లకు పైబడిన జనాభాగల భారత దేశ సత్తా పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య సుదీర్ఘ కాలం నుంచి సత్సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే.‘‘మనం భారత దేశాన్ని చూద్దాం. అంతర్గత అభివృద్ధి కోసం విజయకాంక్షగల గొప్ప ప్రతిభావంతులు అక్కడ ఉన్నారు. ఆ దేశాభివృద్ధిలో కచ్చితంగా అద్భుత ఫలితాలు వస్తాయి. సందేహాలేవీ అక్కర్లేదు. దాదాపు 150 కోట్ల మంది ప్రజానీకం ఉన్నారు. ఇప్పుడు అదే సత్తా’’ అని పుతిన్ చెప్పారు.

గత వారం పుతిన్ మాట్లాడుతూ, భారత దేశ విదేశాంగ విధానాన్ని ప్రశంసించిన సంగతి తెలిసిందే. మేధావులతో కూడిన వాల్డాయ్ క్లబ్ ప్లీనరీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాలను, భారత దేశ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని ప్రశంసించారు. భవిష్యత్తు భారత దేశానిదేనని కూడా అన్నారు. రానున్న రోజుల్లో అంతర్జాతీయంగా భారత్ పాత్ర పెరుగుతుందని కూడా చెప్పారు