NRI-NRT

ఎన్నారైలకు కుచ్చుటోపి పెట్టిన వ్యాపారి

ఎన్నారైలకు కుచ్చుటోపి పెట్టిన వ్యాపారి

తాము చేస్తున్న వ్యాపారంలో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని విదేశాల్లో ఉంటున్న ఎన్నారైల నుంచి సుమారు రూ.20 కోట్లు కాజేసిన ఇద్దరు మోసగాళ్లను సీసీఎస్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. టోలీచౌకిలో ఉంటున్న ఖాజా ముజీబుద్దీన్‌ (61), మహ్మద్‌ జాజిమ్‌ ముజీబ్‌లు తండ్రీ కొడుకులు. వీరిద్దరూ 2016లో క్రిస్టల్‌ కన్‌స్ట్రక్షన్స్‌ పేరుతో సంస్థను స్థాపించారు. టోలీచౌకి పరిసర ప్రాంతాల్లో పలు ఖాళీ స్థలాల యజమానులతో డెవల్‌పమెంట్‌ పేరుతో అగ్రిమెంట్లు చేయించుకున్నారు. ఈ అగ్రిమెంట్‌ కాపీలతో వీరు టోలీచౌకితోపాటు గల్ఫ్‌దేశాల్లో పనిచేస్తున్న కొంతమంది ఎన్నారైలను సంప్రదించారు భవనాలు కట్టేందుకు పెట్టుబడి కావాలని, తమ వద్ద పెట్టుబడి పెడితే భారీ లాభాలు ఇస్తామని నమ్మించారు. పలువురు ఎన్నారైల నుంచి రూ.20 కోట్లు రాబట్టారు. ఆ డబ్బును సొంత అవసరాలకు, బినామీ ఆస్తులు కొనుగోలు చేసేందుకు కేటాయించారు. మోసపోయామని గ్రహించిన బాధితులు సీసీఎ్‌సలో ఫిర్యాదు చేయగా వీరిద్దరిపై 9 కేసులు నమోదు చేశారు. సీసీఎస్‌ ఈఓడబ్ల్యూ బృంద సభ్యులు గురువారం రామ్‌కోఠి ప్రాంతంలో ఇద్దరినీ అరెస్ట్‌ చేశారు.