Devotional

భక్తులతో కిక్కిరిసిన అన్నవరం – TNI ఆధ్యాత్మికం

భక్తులతో కిక్కిరిసిన అన్నవరం –  TNI ఆధ్యాత్మికం

1. తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. కార్మికమాసం, వరుస సెలవు రోజులు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఆలయం క్యూలైన్లలో గంటలకొద్దీ నిలబడడంతో భక్తుల మధ్య తోపులాట జరిగింది. దీంతో చిన్నపిల్లలతో తల్లులు, వృద్ధులు, మహిళలు ఇబ్బందులు పడ్డారు. రాజగోపురం వద్ద స్వల్ప తొక్కిసలాట జరిగింది.అయితే రద్దీ నియంత్రణపై ఆలయ సిబ్బంది దృష్టి సారించక పోవడంతో ఆలయం భద్రతా సిబ్బందిపై భక్తులు తిరగబడ్డారు. శనివారం ఆలయంలో వ్రతాలు, సర్వదర్శనాలకు వేలాధి సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసర ప్రాంతాలు కిక్కిరిసాయి.వ్రతాలు, పూజలు, దర్శనాలు, నిత్యకల్యాణం, ప్రసాద విక్రయాల ద్వారా ఒక్కరోజే రూ. 93.96లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.

2. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కంపార్టుమెంట్లన్నీనిండి క్యూ లైన్ల నుంచి భక్తులు వెలుపలికి వచ్చారు. శ్రీవారి సర్వదర్శనానికి 40 గంటల సమయం పట్టనుంది. శనివారం శ్రీవారిని 73,323 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 41,041 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శనివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.20 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

3. మన చుట్టూ ఉన్న ప్రజలతో పాటు రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో బ్రాహ్మణులంతా ఏకమై శాస్త్రం చెప్పినట్టుగా శతచండీ యాగాన్ని నిర్వహించడం శుభసూచకమని అన్నారు. అనంతరం నూతనంగా నిర్మించిన స్వామివారి ఆశ్రమాన్ని ప్రారంభించి భక్తులకు అనుగ్రహం ఇచ్చారు. యాగంలో భాగంగా రెండో రోజు శాంతిపఠనంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రహణ దోషాలు తొలిగిపోవడానికి పలు హోమాలు, తదితర స్థాపిత దేవతా పూజలు, పారాయణాలు, ప్రవచనాలు, హారతి కార్యక్రమాలు నిర్వహించారు. కర్ణాటక, శృంగేరి, వివిధ దైవ క్షేత్రాల్లో మహాయాగాలు చేసిన వేదపండితులు సుమారు వంద మంది ఈ చండీయాగం నిర్వహిస్తున్నారు. బెంగళూరు నుంచి వచ్చిన కార్తిక్‌ శర్మ మండలాలు వేశారు. యాగాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాన్ని స్వీకరించారు. భక్తుల కోసం నిత్యాన్నదానం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బ్రాహ్మణ సమైక్య సంఘం సభ్యులు, మండల బ్రాహ్మణ సంఘం సభ్యులు, భక్త జనం తదితరులు పాల్గొన్నారు.

4. భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు కొలువైన శ్రీశైలం ఆలయానికి భక్తుల పోటెత్తారు. కార్తీకమాసం ఆదివారం సెలవుదినం కావడంతో శ్రీశైలం మల్లన్న దర్శనానికి లక్షలాది మంది పైనే భక్తులు తరలివచ్చారు. దీంతో శ్రీశైలం సన్నిధి భక్తులతో కిటకిటలాడుతోంది. స్వామివారి దర్శనానికి 5 గంటల పైనే సమయం పట్టనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ కారణంగా స్వామివారి గర్భాలయ స్పర్శ దర్శనాలు గర్భాలయ అభిషేకాలు రద్దు చేశారు. భక్తులందరికి స్వామివారి దర్శనభాగ్యం కల్పించేందుకు అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నట్లు ఈఓ లవన్న తెలిపారు. అలాగే, కార్తీక మాసం కావడంతో శ్రీశైల క్షేత్రానికి కన్నడ భక్తులు కూడా పెద్ద ఎత్తున పోటెత్తారు..

5. బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో(Basara Srijnana Saraswati) భక్తుల రద్దీ పెరిగింది. కార్తీకమాసం ఆదివారం సెలవుదినం కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారి అభిషేకం, హారతి సమయంలో భక్తులు మధ్య తోపులాట జరిగింది. భక్తులను నియంత్రించేందుకు సిబ్బంది లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆలయ అధికారులపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.