DailyDose

TNI నేటి తాజా వార్తలు

TNI  నేటి తాజా  వార్తలు

*హైదరాబాద్‌ నగరంలోని ఫిల్మ్‌నగర్‌లో అక్రమ నిర్మాణాలను జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. దక్కన్‌ కిచెన్‌ సమీపంలో ఉన్న రెండు నిర్మాణాల కూల్చివేతను చేపట్టారు. ఈ నిర్మాణాలు ఎమ్మెల్యేకు ఎర కేసులో నిందితుడు నందకుమార్‌ గుర్తించారు. ‘దక్కన్‌ కిచెన్‌’ను ప్రమోద్‌ అనే భాగస్వామితో కలిసి నందకుమార్‌ నిర్వహిస్తున్నాడు. అక్రమ నిర్మాణాలు చేపట్టి వ్యాపారాలకు వాడుతున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు పేర్కొన్నారు. నోటీసులు ఇచ్చినా ఆపకుండా కొనసాగిస్తుండడంతో పోలీసు బందోబస్తు కూల్చివేస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేత చేపట్టారు. నందకుమార్ స్థలాన్ని లీజుకు తీసుకుని అక్రమ నిర్మాణాలు చేపట్టి.. వ్యాపారానికి వాడుతున్నాడని.. ఈ మేరకు కోర్టు ఆదేశాలతో కూల్చివేస్తున్నట్లు వివరించారు.

*దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ చేరుకుతుందని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లి గ్రామ సమీపంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. గతంలో రైతులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని, ఉమ్మడి ఏపీలో విద్యుత్ కోసం ధర్నా చేస్తే కాల్చి చంపిన సంఘటనలు మరిచిపోలేదన్నారు.

*నిజాం కళాశాలలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. కళాశాల ప్రాంగణంలో నిర్మించిన హాస్టల్‌లో డిగ్రీ బాలికలకు ప్రవేశం కల్పించాలని విద్యార్థులు శనివారమూ తమ నిరసన తెలిపారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాస్టల్‌లో యాబై శాతం సీట్లు యూజీ విద్యార్థులకు, మరో యాబై శాతం సీట్లు పీజీ విద్యార్థినులకు కేటాయిస్తూ జారీ చేసిన జీవో ప్రతులను, ఓయూ జారీ చేసిన సర్క్యులర్‌ను విద్యార్థులు చింపివేసి తమ నిరసన వ్యక్తం చేశారు. నిజాం కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ హాస్టల్‌ వార్డెన్‌ విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ససేమిరా అన్నారు. వారి ముందే జీవో ప్రతులను చింపివేయడం గమనార్హం. ప్రభుత్వం దిగివచ్చి డిగ్రీ విద్యార్థినులకు న్యాయం చేసేంతవరకు తమ పోరాటం ఆగదని విద్యార్థి సంఘాల నేతలు హెచ్చరించారు. హాస్టల్‌లో పూర్తిగా డిగ్రీ బాలికలనే చేర్చుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. ఇకనైనా మంత్రి కేటీఆర్‌ స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు.

*వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెలలో పుదుచ్చేరి వస్తున్నారని ఆ రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ సెల్వం తెలిపారు. ఆయన శనివారం మాట్లాడుతూ, పుదుచ్చేరిలో తొలిసారి ఏకంగా 128 మంది నోటరీ పబ్లిక్‌ న్యాయవాదుల నియామకానికి కేంద్రం అనుమతి ఇచ్చిందని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి ఎన్‌.రంగస్వామి, మంత్రులు, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అంతా కలిసి మొత్తం 225 మంది అడ్వకేట్ల పేర్లతో కేంద్రానికి ఒక జాబితాను పంపించగా, అందులో 128 మందిని నోటరీ పబ్లిక్‌లుగా నియమించేందుకు అనుమతి ఇచ్చిందన్నారు. అలాగే, పుదుచ్చేరి రాష్ట్ర శాసనసభకు కొత్త భవన నిర్మాణానికి భూమిపూజ, వైద్య విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవంతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోడీ వచ్చే నెల 15వ తేదీన పుదుచ్చేరికి వస్తున్నారని స్పీకర్‌ సెల్వం తెలిపారు.

*భారత నావికాదళానికి (Indian Navy) చెందిన 25 ఏళ్ల నావికుడు (sailar) ఒకరు విధి నిర్వహణలో ఉండగా సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేకున్నాడు. షిప్‌పై డిప్యూటేషన్‌లో ఉండగా శనివారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నట్టు ముంబై పోలీసులు తెలిపారు. ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఇండియన్ నావీ తెలిపింది. కొలబా పోలీసులు ఏడీఆర్ కింద కేసు నమోదు చేశారు. కాగా, ఆయన ఆత్మహత్యకు పాల్పడడానికి కారణం ఏమిటనేది తెలియలేదు. ఒత్తడి తట్టుకోలేక ఈ చర్యకు పాల్పడ్డాడా, వేరే కారణం ఏమైనా ఉందా అనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.

* బీజేపీతో సహా అన్ని రాజకీయ పార్టీల అంగీకారంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ ప్రొసీజర్ ఎలా నడుస్తుందో తెలియని ప్రధాని మోదీ తెలంగాణ బిల్లును తలుపులు మూసి ఆమోదించారని అవమానించారన్నారు. క్షమాపణలు చెప్పిన తరువాత తెలంగాణాలో అడుగు పెట్టాలని చెప్పామన్నారు. సిగ్గున్నవారు ఎవరూ బీజేపీలో ఉండరని, వారు తెలంగాణ డీఎన్ఏనా అని పరీక్ష చేసుకోవాలన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభం.. అయిపోయిన పెళ్లికి బాజాలు మోగించినట్టు ఉందని ఎద్దేవా చేశారు. రామగుండం మాత్రమే కాదని, ఇంకా నాలుగు ఫ్యాక్టరీలు అప్పటి ప్రభుత్వం పునఃప్రారంభంకు రూ. 18,400 కోట్లు కేటాయించిందన్నారు. ఈ విషయం బీజేపీ అజ్ఞానులకు తెలియదా? అని ప్రశ్నించారు. దేశంలో యూరియా, డీఎపీలు దిగుమతి చేసుకునే అవసరం ఉందని, ఆ రోజు లక్ష కోట్ల సబ్సిడీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందన్నారు.

*ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ ఆశించి భంగపడిన నేతలు అడపాదడపా ఆందోళనకు దిగడం చూస్తుంటాం. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మాజీ కౌన్సిలర్ హసీబ్-ఉల్-హసన్ ఆదివారంనాడు ఇదే పని చేశారు. ఎంసీడీ ఎన్నికల్లో తనకు టిక్కెట్ ఇవ్వకపోవడంతో మనస్తాపం చెందిన ఆయన శాస్త్రి పార్క్ మెట్రో స్టేషన్ సమీపంలోని ఓ ట్రాన్స్‌మిషర్ టవర్ ఎక్కి నిరసన తెలియజేశారు. దీంతో ఆ పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు.

*జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తెగిన గాలిపటంలా పవన్ పరిస్థితి మారిందన్నారు. ఎప్పుడు ఎవరితో కలుస్తారో.. ఏ పార్టీతో కలుస్తారో అర్థం కాని పరిస్థితి అని అన్నారు. ఎంతో అభిమానించే మోదీ.. పవన్ కళ్యాణ్‌ను పక్కన పెట్టారంటే ఆయన పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు. రౌడీయీజంతో రోజుకో పార్టీ వైపు మాట్లాడుతూ ఆయన ప్రవర్తన చూసి ప్రధాని దూరం పెట్టారన్నారు. ప్రజలు కూడా పవన్ గురించి ఆలోచించడమే పూర్తిగా మానేశారన్నారు. జనసేన నేత కిరణ్ రాయల్ తనపై చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఏవైనా ఆధారాలు ఉంటే బయట పెట్టవచ్చునన్నారు. రాయల్ అనే పేరు పెట్టుకోవడం వెనుక జనసేన పార్టీ నుంచి రాజకీయ లబ్ధి పొందడం కోసమేనని మంత్రి రోజా అన్నారు.

*కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) శనివారం ఇచ్చిన ట్వీట్‌లో అవాస్తవాలు ఉన్నాయని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఆదివారం ప్రకటించింది. భారతీయ రైల్వేలలోని 151 రైళ్ళను ప్రైవేటీకరించారని గాంధీ పేర్కొన్నారని, ఇది పూర్తిగా తప్పు అని తెలిపింది. నిరాధారమైన అంశాన్ని ట్వీట్ చేశారని పేర్కొంది. రైల్వేలు తన ఆస్తుల్లో దేనినీ ప్రైవేటీకరించలేదని స్పష్టం చేసింది.రాహుల్ గాంధీ శనివారం ఇచ్చిన ట్వీట్‌లో, రైల్వేలు భారత దేశాన్ని అనుసంధానం చేస్తాయని, రోజుకు 2.5 కోట్ల మంది ప్రయాణికులకు సేవలందిస్తాయని తెలిపారు. ఇది 12 లక్షల మందికి ఉపాధినిస్తోందన్నారు. ‘‘ప్రధాన మంత్రి గారూ, రైల్వేలు భారత దేశ ఆస్తి, దీనిని ప్రైవేటీకరించకండి, బలోపేతం చేయండి, అమ్మకండి’’ అని కోరారు. ఈ ట్వీట్‌తోపాటు జత చేసిన వీడియోలో భారత్ జోడో యాత్రకు సంబంధించిన సన్నివేశాలు ఉన్నాయి.తెలంగాణాలో రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నపుడు కొందరు రైల్వే యూనియన్ సభ్యులు ఆయనను కలిసినట్లు ఈ వీడియోలో ఉంది. రైల్వేల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వారు ఓ వినతిపత్రాన్ని ఆయనకు సమర్పించినట్లు కనిపిస్తోంది. రైల్వేల్లో ఏ భాగాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరిస్తోందని వారిని ఆయన ప్రశ్నించారు.

*‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినె్‌సలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో ఉంది. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు పూర్తి అనుకూల వాతావరణం ఉంది. పరిశ్రమలకు సింగిల్‌ విండోలోనే అనుమతులు ఇస్తున్నందున ప్రముఖ పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు’’ ..ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పదేపదే చేస్తున్న ప్రకటన ఇది. తాజాగా శుక్రవారం పల్నాడు జిల్లా వంకాయలపాడు వద్ద ఐటీసీ సంస్థ ఏర్పాటు చేసిన గ్లోబల్‌ స్పైసెస్‌ ప్రాసెసింగ్‌ ఫెసిలిటీ యూనిట్‌ ప్రారంభోత్సవం సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ తన ఏలుబడిలో రాష్ట్రం పారిశ్రామికంగా ఎంతో ప్రగతి సాధించిందని ప్రజలను నమ్మించేందుకు తనదైన శైలిలో అబద్దాలను చక్కగా చెప్పారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకింగ్‌లలో ఏపీ నెంబర్‌వన్‌ స్థానంలో నిలవడం రాష్ట్ర ప్రభుత్వ ఘనతగా జగన్‌ గొప్పలు చెప్పుకుంటున్నారు. తాను తీసుకుంటున్న నిర్ణయాల ఫలితంగానే రాష్ట్రం ఈ ఘనత సాధించినట్లు ప్రచారం చేసుకోవడంపై ఆ వర్గాల నుంచి తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

*సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మునగాల మండలంలోని నరసయ్య హోటల్ వద్ద అయ్యప్ప స్వాముల ట్రాక్టర్‎ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా..మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ట్రాక్టర్‎లో అయ్యప్ప స్వామిగుడిలో పూజ చేసుకుని తిరిగి రాంగ్ రూట్‎లో మునగాలకు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ట్రాక్టర్‎ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఢీకొట్టిన అనంతరం 50 మీటర్ల దూరం లారీ ట్రాక్టర్‎ను లాక్కెళ్లింది. మొత్తం ట్రాక్టర్‎లో 30 మంది ఉన్నట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు మారగోని కోటయ్య(60), చింతకాయల ఉదయ్ లోకేష్ (11), చింతకాయల ప్రమీల(32), తన్నీరు ప్రమీల(30), గండు జ్యోతి(36)గా పోలీసులు గుర్తించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

*యూజీ ఆయుష్‌ వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటన జారీ చేసింది. ఈ వర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆయుష్‌ కళాశాలల్లోని కన్వీనర్‌ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. బీఏఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీఎన్‌వైఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ శనివారం యూనివర్సిటీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. నీట్‌ 2022లో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ నెల 13వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 20వ తేదీ రాత్రి 8 గంటల వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ర్టేషన్‌ చేసుకోవాలని సూచించింది. వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని వర్సిటీ వర్గాలు తెలిపాయి.

*మల్లన్నసాగర్‌ ముంపు గ్రామమైన ఎర్రవల్లి గ్రామస్థులు మంత్రి హరీశ్‌రావును శనివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను మంత్రికి వివరించారు. మల్లన్నసాగర్‌ పూర్తయి ఏడాది కావొస్తున్నా.. ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీలో తమకు కేటాయించిన ఇళ్లకు సంబంధించిన పట్టాలను ఇంకా ఇవ్వలేదని చెప్పారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయిన ఇళ్ల పట్టాలను వెంటనే పంపిణీ చేయాలని కోరారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీలో కనీస సౌకర్యాలైన రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్తు, విద్య, వైద్యం వంటివాటిని కల్పించాలన్నారు. గ్రామస్థుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన హరీశ్‌రావు.. పెండింగ్‌ సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

*కేరళలో గవర్నర్‌కు, ప్రభుత్వానికి మధ్య కొనసాగుతున్న వివాదం తారస్థాయికి చేరింది. యూనివర్సిటీల చాన్స్‌లర్‌ పదవి నుంచి గవర్నర్‌ను తొలగించేందుకు ఉద్దేశించిన ఆర్డినెన్స్‌ను ఆమోదం కోసం ప్రభుత్వం శనివారం రాజ్‌భవన్‌కు పంపించింది. చాన్స్‌లర్‌గా గవర్నర్‌ను తొలగించి ఆ స్థానంలో ప్రముఖ విద్యావేత్తలను నియమించాలని ప్రతిపాదిస్తున్న ఆర్డినెన్స్‌ గవర్నర్‌ కార్యాలయానికి చేరినట్లు రాజ్‌భవన్‌ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఆర్డినెన్స్‌ను గవర్నర్‌ ఆమోదించే అవకాశం లేదని తెలుస్తోంది. కాగా, ఈ ఆర్డినెన్స్‌ను కాంగ్రెస్‌, బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. యూనివర్సిటీలను కమ్యూనిస్టు అడ్డాలుగా మార్చేందుకే ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌ను రూపొందించిందని విమర్శించాయి. వైస్‌చాన్స్‌లర్ల నియామకాల విషయంలో ఇటీవల గవర్నర్‌కు, ప్రభుత్వానికి మధ్య విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే.

* ట్రాలీపై తరలిస్తున్న విమానం శనివారం రాత్రి బాపట్ల జిల్లా మేదరమెట్ల బైపా్‌సలోని అండర్‌పాస్‌ వద్ద పట్టక ఇరుక్కుపోయింది. కొచ్చిన్‌ నుంచి హైదరాబాద్‌కు ఈ విమానాన్ని తరలిస్తున్నారు. హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్‌ పిస్తాహౌస్‌ యాజమాన్యం ఆ విమానం హోటల్‌ ఆలోచనతో కొచ్చిన్‌లో పాత విమానాన్ని కొనుగోలు చేశారు. అక్కడే హోటల్‌గా తయారు చేయించి రెక్కలను విడదీసి విడివిడిగా హైదరాబాద్‌ తరలిస్తున్నారు. హైవేపై మేదరమెట్ల కొండ వద్ద రాళ్లను తొలగించే పనులు ప్రారంభించడంతో హైదరాబాద్‌వైపు వెళ్లే రోడ్డును మూసివేశారు. ఆ వైపు వెళ్లే వాహనాలను ఫ్లైఓవర్‌ మీదుగా కొరిశపాడు వరకు వెళ్లి తిరిగి వచ్చి అండర్‌పాస్‌ ద్వారా వెళ్లాలని దారిమార్చారు. అ నేపథ్యంలో విమానాన్ని తరలిస్తున్న ట్రాలీని నడిపిస్తున్న వారు కూడా వెళ్లడానికి ప్రయత్నించారు. కొంతదూరం వెళ్లిన ట్రాలీ మధ్యలో ఎత్తు ఎక్కువగా ఉండటంతో ఇరుక్కుపోయింది. దాదాపు రెండు గంటలకు నుంచి ట్రాలీ సిబ్బంది విమానానికి ఇబ్బంది జరగకుండా ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

* రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలుకు తెలంగాణ గడ్డపైనే కార్యాచరణ ప్రకటించాలని, లేని పక్షంలో ఈ అంశాలపైన పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కాంగ్రెస్‌ పోరాటం చేస్తుందని ప్రధాని మోదీని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు మోదీకి రేవంత్‌రెడ్డి శనివారం బహిరంగ లేఖ రాశారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాఽధ్యంకాదని కేంద్ర ప్రభుత్వం తేల్చేయడం యువతకు నిరాశ మిగిల్చిందన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని అటకెక్కించారన్నారు. గిరిజన వర్శిటీ ఏర్పాటుకు చొరవ లేదని, పునర్విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్లలో చేర్చిన సంస్థలు, ఆస్తులు విభజన కొలిక్కి రాలేదని పేర్కొన్నారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్తు ప్లాంటు ఏర్పాటు, పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక ఇన్సెంటివ్‌ హామీలనూ నెరవేర్చలేదన్నారు. ఐఐటీ, ఐఐఎం తదితర ఒక్క ఉన్నత విద్యా సంస్థ కూడా మంజూరు కాలేదన్నారు. ఐటీఏఆర్‌ను రద్దు చేశారని, సింగరేణిని ప్రైవేటీకరించే ఆలోచననూ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చలేదని, నవోదయ, సైనిక్‌ స్కూళ్ల ఏర్పాటు విషయంలో మొండి చేయి చూపుతున్నారని అన్నారు. చేనేతపై ఐదు శాతం జీఎస్టీ సమర్థనీయం కాదని, తక్షణం ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కాగా, రామగుండం ఎరువుల కర్మాగారం ఆధునికీకరణ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో చేపట్టిందేనని టీపీసీసీ మాజీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. దాన్ని పూర్తి చేయడానికి బీజేపీకి ఇన్నేళ్లు పట్టిందని విమర్శించారు.

*సుమారు 5 నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఇమామ్‌, మౌజంల గౌరవ వేతనాలను తక్షణం విడుదల చేయాలని చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. నెలల తరబడి గౌరవ వేతనం అందక వారు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రప్రభుత్వం గత జూలైలో నిధులు విడుదల చేసినప్పటికీ ఆర్ధిక శాఖ చెక్కులను క్లియర్‌ చేయడంలో జాప్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. అర్చకుల పేేస్కల్‌తో సమానంగా ఇమామ్‌-మౌజంల గౌరవ వేతనాన్ని పెంచడానికి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే రెండు నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఆసరా పెన్షన్‌లను విడుదల చేయాలని ఆయన కోరారు.

*మల్లన్నసాగర్‌ ముంపు గ్రామమైన ఎర్రవల్లి గ్రామస్థులు మంత్రి హరీశ్‌రావును శనివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను మంత్రికి వివరించారు. మల్లన్నసాగర్‌ పూర్తయి ఏడాది కావొస్తున్నా.. ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీలో తమకు కేటాయించిన ఇళ్లకు సంబంధించిన పట్టాలను ఇంకా ఇవ్వలేదని చెప్పారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయిన ఇళ్ల పట్టాలను వెంటనే పంపిణీ చేయాలని కోరారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీలో కనీస సౌకర్యాలైన రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్తు, విద్య, వైద్యం వంటివాటిని కల్పించాలన్నారు. గ్రామస్థుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన హరీశ్‌రావు.. పెండింగ్‌ సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

*రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం చెన్నై నగరానికి వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్‌షా(Amit Shah)ను మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే బహిష్కృత నేత ఒ. పన్నీర్‌సెల్వం ప్రత్యేకంగా భేటీ అయినట్లు సమాచారం. అయితే ఒ.పన్నీర్‌సెల్వం ప్రత్యర్థి ఎడప్పాడి పళనిస్వామి మాత్రం అమిత్‌షాతో భేటీకి దూరంగా ఉండడం చర్చనీయాంశమైంది. నగరంలో జరిగిన ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు అమిత్‌ షా శుక్రవారం రాత్రి చెన్నై చేరుకున్నారు. రాత్రి బసచేసి శనివారం ఉదయం 11.25 గంటలకు చేపాక్‌లోని కలైవానర్‌ అరంగంకు చేరుకున్నారు. ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కూడా ఓపీఎస్‌, ఈపీఎ్‌సలకు ఆహ్వానం వెళ్ళగా, ఓపీఎస్‌ మాత్రమే హాజరయ్యారు.

* గుజరాత్‌ గోద్రా అల్లర్ల తర్వాత జరిగిన నరోడా పాటియా మారణహోమం ఘటనలో దోషిగా తేలిన మనోజ్‌ కుక్రాణి కుమార్తెకు బీజేపీ అసెంబ్లీ టికెట్‌ ఇచ్చింది. అహ్మదాబాద్‌ జిల్లాలోని నరోడా స్థానం నుంచే మనోజ్‌ కుమార్తె పాయల్‌ కుక్రాణిని బరిలోకి దింపడం చర్చనీయాంశంగా మారింది. నరోడా పాటియా అల్లర్లలో 97 మంది ముస్లింలు ప్రాణాలు కోల్పోయారు.

* ఆదాయ మార్గాలు పెంచుకోవడంపై వివిధ పద్ధతులు అనుసరించడంలో భాగంగా.. మరో నూతన విధానానికి ఆర్టీసీ గ్రేటర్‌ అధికారులు శ్రీకారం చుట్టారు. నగరంలోని పలు ప్రాంతాలైన సికింద్రాబాద్‌, కూకట్‌పల్లి వంటి మార్గాల నుంచి సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ఉండే హైటెక్‌ సిటీకి ప్రత్యేక బస్సులు నడుపుతున్నది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల కోసం ఆర్టీసీ గ్రేటర్‌ అధికారులు ఈ మేరకు ఏర్పాటు చేశారు. అయితే ఈ సారి మరో అండుగు ముందుకు వేసింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి హైటెక్‌ సిటీ వరకు ప్రత్యేక బస్సులు నడిపిస్తూనే.. సాఫ్ట్‌వేర్‌ సంస్థలలో పని చేస్తున్న ఉద్యోగులకు అద్దె బస్సులు ఏర్పాటు చేసే నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈసీఐఎల్‌, ఉప్పల్‌, దిల్‌సుక్‌నగర్‌, సికింద్రాబాద్‌ ఇలా.. నగరంలోని పలు ప్రాంతాల నుంచి నేరుగా సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకే చేరుకునే విధంగా అద్దె బస్సులను ఏర్పాటు చేయనున్నారు. ఈ అంశంపై శుక్రవారం రాత్రి దాదాపు 20 పైగా సాఫ్ట్‌వేర్‌ కంపెనీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ గ్రేటర్‌ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌(ఈడీ) ఈ. యాదగిరి తెలిపారు. ఆర్టీసీ నుంచి అద్దెబస్సులు తీసుకున్న సాఫ్ట్‌వేర్‌ సంస్థలు కేవలం తమ సంస్థ ఉద్యోగుల కోసం వీటిని ఉపయోగించే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.