DailyDose

హైదరాబాద్‌లో అమెజాన్‌ భారీ పెట్టుబడి

హైదరాబాద్‌లో అమెజాన్‌ భారీ పెట్టుబడి

క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ప్లాట్‌ఫామ్‌ సర్వీస్‌లో అగ్రగామిగా ఉన్న అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ (ఏడబ్ల్యూఎస్‌) రెండో మౌలిక సదుపాయాల రీజియన్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. ఏడబ్ల్యూఎస్‌ ఆసియా-పసిఫిక్‌ రీజియన్‌గా నగరాన్ని ఎంపిక చేసింది. ఈ క్రమంలోనే రాబోయే ఎనిమిదేండ్లలో సుమారు రూ.36,300 కోట్లు (4.4 బిలియన్‌ డాలర్లు) పెట్టుబడులు పెట్టనున్నట్టు మంగళవారం ప్రకటించింది. తద్వారా ఏటా 48వేల పుల్‌టైమ్‌ ఉద్యోగాలు లభించనున్నాయని అంచనా. అదే విధంగా 2030 నాటికి సుమారు రూ.63,600 కోట్ల (7.6 బిలియన్‌ డాలర్లు) మేర దేశ జీడీపీకి తోడ్పాటునిస్తుందని భావిస్తున్నారు.

ఈ సందర్భంగా అమెజాన్‌ డాటా సర్వీసెస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సేవల ఉపాధ్యక్షుడు ప్రసాద్‌ కల్యాణరామన్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ రీజియన్‌ ప్రారంభంతో డిజిటల్‌ ఇండియాకు పెద్ద ఎత్తున మద్దతు ఉంటుందన్నారు. 2011లో తమ తొలి రీజియన్‌ను ముంబై కేంద్రంగా ప్రారంభించామని, అప్పట్నుంచి దేశంలో దీర్ఘకాలిక పెట్టుబడిలో ఇది ఒక భాగమని తెలిపారు. డాటా అనలిటిక్స్‌, సెక్యూరిటీ, మెషిన్‌ లెర్నింగ్‌, కృత్రిమ మేధస్సు (ఏఐ)తోసహా వివిధ ఆవిష్కరణలను చేపట్టడానికి కస్టమర్లకు అధునాతన ఏడబ్ల్యూఎస్‌ టెక్నాలజీలకు యాక్సెస్‌ లభిస్తుందని ఆయన వెల్లడించారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ శాఖల మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ అమెజాన్‌ పెట్టుబడులను స్వాగతించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చే నేషనల్‌ క్లౌడ్‌, డాటా సెంటర్‌ పాలసీ భారత సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న 565 మెగావాట్ల నుండి సమీప భవిష్యత్తులో 2,565 మెగావాట్లకుపైగా గణనీయంగా పెంచాలని భావిస్తోంది. దేశంలో విస్తరిస్తున్న ఆర్థిక వ్యవస్థను శక్తివంతం చేయడానికి పచ్చదనం మరియు మరింత స్థిరమైన డాటా సెంటర్ల కోసం కేంద్రం చర్యలు తీసుకుంటోందన్నారు.

క్లౌడ్‌ సేవలతో ప్రయోజనం
హైదరాబాద్‌ కేంద్రంగా ప్రతిష్ఠాత్మక స్థాయిలో ఏడబ్ల్యూఎస్‌ సేవలను ప్రారంభిస్తుండటంతో రకరకాల కంపెనీలకు ప్రయోజనం జరగనుంది. ఇందులో ప్రధానంగా స్టార్టప్‌లు, డెవలపర్‌లు, వ్యవస్థాపకులు, ఎంటర్‌ప్రైజెస్‌, ప్రభుత్వం, లాభాపేక్షలేని సంస్థలు ఇక్కడి డాటా సెంటర్‌ల నుంచి తమ అప్లికేషన్‌లను సమర్థవంతంగా నిర్వహించుకునేందుకు అవకాశం కలుగుతుంది. అదే సమయంలో తుది వినియోగదారులకు సేవలను అందించడానికి అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ ఒక గొప్ప ఎంపికగా ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్‌ కేంద్రంగా స్టార్టప్‌లు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి డాటా సేవలందించే కంపెనీలతో స్టార్టప్‌లకు ఎంతో లాభించనున్నది. ఖర్చులను నియంత్రించుకోవడం ద్వారా వ్యాపార వృద్ధి కూడా పెరుగుతుంది.

విస్తరణ దిశగా..
ప్రపంచవ్యాప్తంగా డిజిటలైజేషన్‌ సేవల కోసం అమెజాన్‌ విస్తృతంగా క్లౌడ్‌ కంప్యూటింగ్‌ టెక్నాలజీ డాటా సెంటర్‌లను ఏర్పాటు చేస్తున్నది. తాజాగా ఏడబ్ల్యూఎస్‌ ఆసియా-పసిఫిక్‌ (హైదరాబాద్‌) రీజియన్‌ ప్రారంభంతో 30 భౌగోళిక ప్రాంతాలలో ఏడబ్ల్యూఎస్‌కు 96 జోన్‌లు అందుబాటులోకి వచ్చినైట్టెంది. అదేవిధంగా మున్ముందు ఆస్ట్రేలియా, కెనడా, ఇజ్రాయెల్‌, న్యూజిలాండ్‌, థాయిలాండ్‌లలో మరో 15 జోన్‌లు, ఐదు ఏడబ్ల్యూఎస్‌ రీజియన్లను తెచ్చే యోచనలో అమెజాన్‌ ఉన్నది. ఇవి ప్రత్యేక మరియు విభిన్న భౌగోళిక స్థానాల్లో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు అందుబాటులో ఉంటాయి. ఇక ఏడబ్ల్యూఎస్‌ ఆసియా-పసిఫిక్‌ (హైదరాబాద్‌) రీజియన్‌లో 3 జోన్‌లు అందుబాటులో ఉన్నాయని కంపెనీ పేర్కొన్నది. హైదరాబాద్‌ రీజియన్‌ను ప్రారంభించడం వల్ల స్థానిక కస్టమర్‌లు డాటా రెసిడెన్సీ ప్రాధాన్యతలతో డాటాను సురక్షితంగా నిల్వ చేసుకోవచ్చు.

పెద్ద మొత్తంలో కస్టమర్లు..
క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సేవలను అందించే ఏడబ్ల్యూఎస్‌కు.. దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపార సంస్థలకు సేవలందించడంతో పాటు స్టార్టప్‌లు చేసే సరికొత్త ఆవిషరణలు వేగవంతం చేయడానికి అవకాశం కలుగుతుంది. ఇప్పటికే దేశంలోని ప్రముఖ వ్యాపార సంస్థలైన ఏంజెల్‌ వన్‌, అశోక్‌ లేలాండ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ క్యాపిటల్‌, బ్రాడ్‌ రిడ్జ్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ లాబొరేటరీస్‌, ఎడెల్‌వీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, టాటా ఎలక్సీ, టైటాన్‌ వంటివి ఏడబ్ల్యూఎస్‌కు కస్టమర్లుగా ఉన్నాయి. అదేవిధంగా పలు ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఉన్నాయి. వీటిలో సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌, కామన్‌ సర్వీస్‌ సెంటర్స్‌, క్రాప్‌ఇన్‌, డిజిటల్‌ ఇండియా కార్పొరేషన్‌, ఇంగ్లీష్‌హెల్పర్‌, తెలంగాణ ప్రభుత్వం, మహారాష్ట్ర స్టేట్‌ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌, నీతి ఆయోగ్‌, ఫిజిక్స్‌వాలా, ప్రసార భారతి న్యూస్‌ సర్వీసెస్‌లున్నాయి.