DailyDose

పెళ్లి కావడం లేదని చనిపోతున్న మగాళ్లే ఎక్కువట.

పెళ్లి కావడం లేదని చనిపోతున్న మగాళ్లే ఎక్కువట.

ఉదయాన్నే కొడుక్కు కాఫీ ఇద్దామని వెళ్ళిన ఓ తల్లి.. కొడుకు గది తలుపు తెరచి లోపలి సంఘటన చూసి నిర్ఘాంతపోయింది. బోరున ఏడుస్తూ లోపలికి పరిగెత్తింది. చెట్టంత కొడుకు ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. ఎంత ప్రయత్నం చేసినా పెళ్ళి కావడం లేదనే మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసుల విచారణలో తెలిసింది. ఇదొక కల్పిత కథనం అయినా ప్రస్తుతం దేశంలో అధిక శాతం మరణాలు ఇలాంటివేనని సర్వేలు చెబుతున్నాయి. పెళ్ళిళ్ళు కావడం లేదనే కారణంతో ఆత్మహత్య చేసుకుంటున్న వారిలో మగవారే అధికంగా ఉన్నారనే విషయం అందరినీ విస్తుపోయేలా చేస్తోంది. అయితే ఎందుకు ఈ పరిస్థితులు ఎదురవుతున్నాయి?? దీనికి మూలకారణం ఏమిటి వంటి వివరాల్లోకి వెళితే..

నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ప్రతి సంవత్సరం దేశంలో ఆత్మహత్యలకు సంబంధించిన లెక్కలు విడుదల చేస్తుంది. ఈ లెక్కల ప్రకారం 2021లో దేశంలో 2647 ఆత్మహత్యలు నమోదు కాగా అందులో 61శాతం మంది మగవారు ఉండటం అందరినీ కలవరపెడుతోంది. 2016 నుండి 2021 వరకు నమోదు అయిన లెక్కలను పరిశీలిస్తే ప్రతి సంవత్సరం మగవారి శాతం పెరుగుతూ వస్తున్నట్టు స్పష్టం అయింది. వీరిలో 25 నుండి 40 సంవత్సరాల వయసున్న వారే అధికం.
**అసలు దీనికి కారణం ఏంటని పరిశీలిస్తే..

1970లో భారతదేశంలో ప్రి-నేటల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇది అప్పట్లో చట్టబద్ధం చేయబడింది. దీని ప్రకారం బిడ్డ కడుపులో ఉండగానే లింగనిర్ధారణ పరీక్షలు చేసేవారు. అంతేకాకుండా 1971లో వైద్యుల సూచన మేరకు అబార్షన్‌లు చేయడం చట్టబద్ధమైంది. ఈ కారణం వల్ల ఆ సంవత్సరాల్లో ఆడపిల్లల జననాలు చాలా తక్కువ నమోదయ్యాయి. దీని వల్ల భారతదేశలో స్త్రీ-పురుష నిష్పత్తిలో తేడా ఏర్పడిపోయింది.

1990లో బేటీ బచావో ప్రచారం కారణంగా ఆడపిల్లలో పెళ్ళి కంటే విద్య, ఉద్యోగం ముఖ్యమనే అభిప్రాయం ఏర్పడింది. అది కాస్తా క్రమంగా పెరుగుతూ ఆడపిల్లలు నిర్ణీత వయసుకు రాగానే పెళ్ళిళ్ళ బాటలో వెళ్ళకుండా మంచి కెరీర్‌ను నిర్మించుకోవడం మొదలుపెట్టారు. దీంతో మగవారికి ఆడపిల్లలు దొరకడం కష్టమైపోయింది. దీనికి తోడు లింగ నిర్ధారణ పరీక్షలు రద్దు చేయాలనే చట్టం 1994లో అమలయ్యింది. అంటే 1970 నుండి 1994వరకు గడిచిన కాలంలో ఆడపిల్లల భ్రూణహత్యలు చాలా మొత్తంలో జరిగాయి. వీటి ఫలితంగా స్త్రీ-పురుషుల నిష్పత్తిలో తేడాలు నమోదు అవుతున్నాయి. ఇలా ఒకప్పుడు చేసిన పొరపాట్ల కారణంగా ఆ కాలానికి పుట్టిన వారు నేడు పెళ్ళి వయసుకు వచ్చినా, అమ్మాయిలు తమ జీవితంలో ప్రాధాన్యతలు పెరగడంతో వారి కెరీర్‌కు, అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇచ్చే వారినే ఎంచుకుంటున్నారు. ఏదో ఒకటిలే అనే నిర్లక్ష్య ధోరణి వారిలో లేదు. ఈ కారణంగా పెళ్ళికావలసిన అబ్బాయిల సంఖ్య అంతకంతకూ పెరిగిపోయి పెళ్ళిళ్ళు కాకుండా మిగిలిపోతున్నారు. ఇది క్రమంగా ఒత్తిడిగా మారి ఆత్మహత్యలకు దారితీస్తోంది