Movies

నివేదా థామస్‌ వరుస సినిమాలు ఎందుకు చేయట్లేదు?

Auto Draft

అచ్చమైన అభినయంతో కట్టిపడేసే అతికొద్దిమంది హీరోయిన్లలో నివేదా థామస్‌ ఒకరు. ఈ బ్యూటీ కేరళ ప్రభుత్వం నుంచి ఉత్తమ నటి అవార్డు అందుకుంది. కథల ఎంపికలో ఆచితూచి అడుగులేసే నివేదా.. భిన్నమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు నిత్యం అందుబాటులో ఉంటుంది కూడా. నివేదా మనో నివేదన ఇది..
*పుట్టి పెరిగింది కేరళలోనే అయినా చిన్నప్పుడే సినిమాల్లోకి రావడంతో దక్షిణాది పరిశ్రమే పుట్టిల్లుగా మారింది. మలయాళంలో చాలా సినిమాలు చేశాను. కానీ నాకు సంతృప్తినిచ్చింది మాత్రం తెలుగు చిత్రాలే. తెలుగు ప్రజలు చూపించే అభిమానం చాలా ప్రత్యేకమైంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘జెంటిల్‌మన్‌’తో నేను టాలీవుడ్‌కు వచ్చాను. అప్పటి నుంచీ తెలుగువాళ్లు నన్ను ఆదరిస్తూనే ఉన్నారు.
*‘దర్బార్‌’లో రజనీకాంత్‌ కూతురిగా నటించడం గొప్ప అనుభవం. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. భారతీయ సినిమా పరిశ్రమలో దక్షిణాది పాత్ర కీలకమైంది. ఇక్కడ విడుదల అవుతున్న సినిమాలు ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. అంతగొప్ప పరిశ్రమలో నేనూ ఉన్నాను. గర్వించాల్సిన విషయమే ఇది. పవన్‌ కల్యాణ్‌తో నటించడం ఓ మంచి అనుభవం.
*కథల ఎంపికలో నేనెప్పుడూ జాగ్రత్తగానే ఉంటాను. అందుకే నా సినిమాల సంఖ్య తక్కువగా ఉంటుంది. ఏ మాత్రం గుర్తింపు ఇవ్వని పది పాత్రల్లో నటించడం కంటే, ప్రేక్షకుల మనసుదోచే ఒక్క పాత్ర చేయడం మేలని నా అభిప్రాయం. కాబట్టే, ఆచితూచి కథలను ఎంచుకుంటా. హీరోయిన్‌గానే చేయాలనే నియమం పక్కన పెట్టి, ప్రాధాన్యం ఉన్న ఏ పాత్రకైనా సిద్ధంగా ఉంటాను.
*ఒక మంచి కథను తెరకెక్కించడానికి మంచి నటీనటులు ముఖ్యం. అది మహిళలైనా, పురుషులైనా ఒకటే. మహిళా ప్రధాన చిత్రాలే చేయాలనే నియమం లేదు. ‘శాకిని ఢాకిని’ ఓ కొరియన్‌ సినిమాకు రీమేక్‌. ఆ సినిమాలో ఇద్దరు హీరోలు కథను నడిపిస్తారు. కానీ మహిళలకు సంబంధించిన విషయాన్ని వారి ద్వారా చెప్పించడం బాగుంటుందనే ఉద్దేశంతో నన్ను,
రెజీనాను ఎంచుకున్నారు. ‘శాకిని ఢాకిని’ సినిమా కోసం నేనూ, రెజీనా ప్రత్యేక కసరత్తు చేశాం. యాక్షన్‌ సన్నివేశాల్లో సహజంగా కనిపించేందుకు చాలా కష్టపడ్డాం. డూప్‌లు, రోప్‌లు, వీఎఫ్‌ఎక్స్‌ సహాయంతో చిత్రించే హీరోల యాక్షన్‌ సీన్స్‌ను ఆదరించే అభిమానులు మా కష్టాన్నీ గుర్తించారు.
*ప్రస్తుతం మలయాళంలో ఓ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగులోనూ కథలు వింటున్నా కానీ, ఇంకా ఫైనల్‌ కాలేదు. నిజంగా మంచి కథలు దొరకని పరిస్థితి వస్తే నేనే సొంతంగా ఓ కథ రాసి నటించేందుకు ప్రయత్నిస్తానే కానీ నచ్చని కథలను ఒప్పుకోను.