Devotional

TNI ఆధ్యాత్మికం.. భద్రాచలంలో విశ్వరూప సేవ

TNI ఆధ్యాత్మికం.. భద్రాచలంలో విశ్వరూప సేవ

అంతా రామమయం

భద్రాచలం: దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచలంలో గురువారం నిర్వహించిన విశ్వరూప సేవలో సర్వదేవతాలంకారాలను తిలకించిన భక్తులు భక్తి పారవశ్యంలో ఓలలాడారు. ‘‘అంతా రామమయం.. ఈ జగమంతా రామమయం’’ అంటూ దేవస్థానం విద్వాంసులు కీర్తనలను ఆలపిస్తుండగా సకల దేవతా అలంకారం (విశ్వరూప సేవ) నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి తరువాత వచ్చే బహుళ ద్వాదశి ఘడియల్లో ఉత్సవమూర్తులందరినీ ఒకేచోట చేర్చి ఆరాధాన నిర్వహించడం భద్రాద్రి దేవస్థానంలో ప్రత్యేకత. ఈ సమయంలో ఆలయంలోని 108 దేవతామూర్తులను ఒకేచోటకు చేర్చి ప్రత్యేక అలంకరణ చేయడంతో భద్రాద్రి కలియుగ వైకుంఠమైంది. అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అన్న రామదాసు కీర్తనలో భాగంగా రాముడే విశ్వరూపుడిగా భావించి ఆలయంలోని వరాహస్వామి, వేంకటేశ్వరస్వామి, కృష్ణుడు తదితర ఉత్సవమూర్తులతో పాటు ఆళ్వార్ల ఉత్సవ విగ్రహాలను అలంకరించారు. గరుఢ వాహనంపై శ్రీరాముడు ఆసీనులు కాగా సాయంకాలం సమయంలో ఆయన సన్నిధిలో ఇతర ఉత్సవమూర్తులకు ఆరాధాన నిర్వహించి ‘కదంబం’ అనే ప్రత్యేక ప్రసాదాన్ని నివేదన చేశారు. కార్యక్రమంలో భద్రాచలం ప్రథమశ్రేణి న్యాయమూర్తి నీలిమ, దేవస్థానం ఈవో బి.శివాజీ, ఏఈవోలు శ్రావణ్‌కుమార్‌ పాల్గొన్నారు.