Politics

సీఎం సలహాదారుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎంతమంది?

సీఎం సలహాదారుల్లో ఎస్సీ,  ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎంతమంది?

విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సులర్లు గా ఆ వర్గాలకు అవకాశం కల్పించలేదెందుకు??

రాష్ట్రంలో సీఎం జగన్ కంటే సంపన్నుడు మరొకరు లేరు… అరాచకాలలోనూ ఆయనదే ఫస్ట్ ప్లేస్

అయినా… పేదలకు, పెత్తందారులకు యుద్ధమని వ్యాఖ్యానించడం హాస్యాస్పదం

వృక్షద్వేషికి పర్యావరణ ప్రేమికులు ఓట్లు వేయవద్దు

వైఎస్ వివేకా హత్య కేసులో మళ్లీ అవినాష్ రెడ్డి ని పిలిచే ఛాన్స్

టి ఎ, డి ఎ, పెండింగ్ జీతాల కోసం పోలీస్ అధికారుల సంఘం ప్రతినిధులు పోరాటం చేయాలి

డీజీపీగా సునీల్ పదోన్నతి లభించే అవకాశం లేదు.. ఒకవేళ నియమించాలని చూస్తే, ఆ నియామకాన్ని అడ్డుకొని తీరుతాం

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తరచూ తన వెనుక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉన్నారని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు విమర్శించారు. ఎంతమంది ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారిని తన సలహాదారులుగా నియమించుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. తన సలహాదారులుగా తన సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించుకున్నారు. ఇక రాష్ట్రంలో సింహభాగం నామినేటెడ్ పదవులను ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టారన్నారు. అయినా , తన వెనుక ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారంటే నమ్మడానికి ప్రజలు ఏమైనా అమాయకులా? అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సులర్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన ప్రొఫెసర్లను ఎంతమందిని నియమించారో చెప్పాలని డిమాండ్ చేశారు. కులానికొక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, నిధులు లేని ఆ కార్పోరేషన్లకు అదే సామాజిక వర్గానికి చెందిన నాయకులను చైర్మన్లు గా నియమిస్తే, ఎస్సీ, ఎస్ టి, బిసి, మైనారిటీ నాయకులకు పదవులు కట్టబెట్టినట్లేనా? అంటూ రఘురామకృష్ణంరాజు నిలదీశారు. సోమవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కంటే ఆస్తిపరుడు, అరాచక వాది మరొకరు లేరన్నారు. పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధమని తరచూ ఆయన పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అంటే రాష్ట్రంలోని పేదలకు తనకు మధ్యనే యుద్ధమని చెప్పకనే చెబుతున్నారా ? అంటూ సూటిగా నిలదీశారు.

వృక్షద్వేషిని త్వరగా ఇంటికి పంపిద్దాం…

రాష్ట్రం ఇప్పటికే ఆర్థిక విధ్వంసానికి గురైందని, ఇక ఇప్పుడు ప్రకృతి విధ్వంసానికి గురవుతోందని రఘురామకృష్ణం రాజు ఆందోళన వ్యక్తం చేశారు. వృక్షద్వేషిని త్వరగా ఇంటికి పంపించకపోతే పర్యావరణానికి హాని తప్పదు. తాను పార్టీ కంటే ఎక్కువగా పచ్చని చెట్లని ప్రేమిస్తాను. వృక్షాలను నరికే ఈ ప్రభుత్వానికి పర్యావరణ ప్రేమికులేవరు కూడా ఓట్లు వేయవద్దు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ బటన్ నొక్కడానికి వెళ్ళినా, అక్కడ రోడ్లపై ఉన్న పచ్చని చెట్లను నరికి వేస్తున్నారు. ఒక మొక్క చెట్టు కావడానికి ఎన్నో ఏళ్ల సమయం పడుతుంది. అటువంటి పచ్చటి చెట్లను నరకడం అమానుషం. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పర్యటనల వల్ల రాష్ట్రంలోని వివిధ నగరాలు, పట్టణాలు, గ్రామాలలో వేలాది చెట్లు నరికి వేయబడ్డాయి. గతంలో అశోకుడు చెట్లను నాటించెను అని చెప్పేవారు… ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెట్లను నరికిస్తున్నాడని చెబుతున్నారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో స్థానిక ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ వంటి వారు మొక్కలను నాటించడానికి ఎంతగానో ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇతర రాష్ట్రాలలో పచ్చదనం కోసం మొక్కలను నాటుతుంటే, మన రాష్ట్రంలో మాత్రం ఏపుగా ఎదిగిన చెట్లను రక్షణను సాకుగా చూపెట్టి నరికి వేయడం సిగ్గుచేటు. గతంలో జెడ్ ప్లస్ కేటగిరి కలిగి ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడులు రోడ్లపై తిరగ లేదా?, వారు ఇలాగే చెట్లను నరికించి వేశారా?? అంటూ రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు.

బెంగుళూరులో చెట్లు నరికితే జైలు శిక్ష తప్పదు

బెంగళూరు నగరంలో మున్సిపల్ చట్టం ప్రకారం చెట్లను అకారణంగా నరికితే మూడు నెలలు జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానాను విధిస్తారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. వృక్షో రక్షతి రక్షిత అనేది పెద్దల నానుడి. వృక్షాలను రక్షించేవారు, రక్షింపబడతారనేది దాని అర్థం. మరి బైబిల్ లో ఇలా ఉందో లేదో జగన్మోహన్ రెడ్డి కే తెలియాలి. విజయవాడ నుంచి గన్నవరం వెళ్లే దారిలో గత ప్రభుత్వ హయాంలో దారి మధ్యలోపచ్చని చెట్లను పెంచడం జరిగింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి అదే దారిలో వెళ్తుండడం వల్ల, ఆ చెట్లను నేలమట్టం చేశారు. అసలు చెట్లను ఎందుకు కొట్టేస్తున్నారని ఒకరు ప్రశ్నించగా… చెట్లకు చెదలు పట్టి, ఆ చెదలు ముఖ్యమంత్రి కాన్వాయ్ పైన పడుతుందని మరొకరు అపహాస్యం చేశారట. ప్రస్తుతం విశాఖకు మరో ఉపద్రవం ముంచుకు రానుంది.. ఇప్పటికే పచ్చటి ప్రకృతికి నిలయమై, వేలాది చెట్లతో అలరారే ఋషికొండకు బోడి గుండు కొట్టారు. ఇక జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం కు త్వరలోనే తరలిరావడం ఖాయమని మంత్రులు చెబుతున్నారు. అదే జరిగితే, ఇప్పటికే విశాఖపట్నంలో ఎన్నో వృక్షాలను నేలమట్టం చేశారు. ఇకపై పచ్చటి విశాఖ మరింత బోసిపోవడం ఖాయం. వృక్ష వ్యతిరేకులు ప్రజలలో ఒక్క శాతం ఉండడం కూడా అరుదే. కానీ తన రక్షణను సాకుగా చూపించి జగన్మోహన్ రెడ్డి, ఇప్పటికే రాష్ట్రంలో
పచ్చని చెట్లను నరికించి ప్రకృతి విధ్వంసానికి పాల్పడ్డారు. ఒకవైపు పచ్చని చెట్లను నరికిస్తూనే, మరొకవైపు జగనన్న హరిత కాలనీల ఏర్పాటు గురించి చెప్పడం ఒక్క జగన్మోహన్ రెడ్డికే చెల్లింది. రాష్ట్రంలో ఫ్లెక్సీలు నిషేధం కూడా ఇతరుల ఫ్లెక్సీలను చూడవలసి వస్తుందన్న ఉద్దేశంతోనే కానీ పర్యావరణం పై ప్రేమతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిషేదించలేదు . హిందూ సాంప్రదాయంలో చెట్లను పూజిస్తారు. దానివల్ల చెట్లలో ఉన్న ఔషధ గుణాలు మనుషులకు చేరి, ఎటువంటి వ్యాధులు సోకవద్దన్నదే దాని ఉద్దేశమని, అటువంటి చెట్లను నేలమట్టం చేసే వారిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇంటికి పంపించడమే మంచిదని రఘురామకృష్ణం రాజు అన్నారు.

లాకప్ లో తనని చిత్రహింసలకు గురి చేసిన వీడియో కూడా ప్రజలకు చూపించి ఉంటే బాగుండేది

తన తమ్ముడిని విచారించేటప్పుడు న్యాయవాది ఉండాలని, వీడియో చిత్రీకరణ చేయాలన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తను లాకప్ లో చిత్రహింసలకు గురిచేసినప్పుడు తీసిన వీడియోను ఒక్కడే చూసి ఆనందించడం కంటే, రాష్ట్ర ప్రజలందరికీ చూపించి ఉంటే ఆయన నైజం ఎటువంటిదో అందరికీ తెలిసి ఉండేదని రఘురామకృష్ణం రాజు అన్నారు. మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తర్జన భర్జనల మధ్య చివరకు వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు. వైఎస్ అవినాష్ రెడ్డి యుద్ధానికి వెళ్తున్నట్లుగా ఆయన వెంట 130 వాహనాలలో , పలువురు ఎమ్మెల్యేలు వెళ్లడం, అంతకుముందు ఆయన, వైయస్ విజయమ్మ ఆశీర్వాదం తీసుకోవడం ఆశ్చర్యకరం. వైఎస్ అవినాష్ రెడ్డి అమాయకుడని చెబుతున్న ఎమ్మెల్యేలంతా, మరి అసలు దోషి ఎవరో చెప్పాలి. ఈనెల 10వ తేదీ నుంచి వైఎస్ వివేక హత్య కేసు ట్రయల్ మొదలు కానుంది. ఈ కేసులో మళ్లీ అవినాష్ రెడ్డిని విచారణకు పిలిచే అవకాశం ఉంది. అవినాష్ రెడ్డిని ఢిల్లీలోనే విచారిస్తే, వందలాది వాహనాలకు డీజిల్, పెట్రోల్ పోయించే ఖర్చు తప్పుతుంది. గతంలో తనకు కేంద్రం ఇచ్చిన సెక్యూరిటీని కూడా ఏపీ సిఐడి పోలీసులు బయటకు పంపించి వేశారు. సిబిఐ అధికారులు అంతటి సంస్కారహీనులు కాదనుకుంటా… అందుకే సెక్యూరిటీని అనుమతించారు. అక్రమ కేసులు నమోదు చేసి తనని లాకప్ లో చిత్రహింసలకు ఎందుకు గురి చేశారో చెప్పాలి. వైయస్ అవినాష్ రెడ్డికి నోటీసులు ఇవ్వగానే కుటుంబం గుర్తుకు వచ్చిందా జగన్మోహన్ రెడ్డి?. మాకు కుటుంబం ఉంది. తాను చేసిన తప్పేమిటి?, ఎందుకు అక్రమ కేసులు నమోదు చేశారు??.., రాజ్యాంగాన్ని యధా విధంగా అనుసరించమని చెప్పడమే తాను చేసిన నేరమా? అంటూ రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు. వైఎస్ వివేకా హత్య జరిగిన రోజు తెల్లవారుజామున రెండు గంటల 52 నిమిషాలకు ఎవరి ఫోను వచ్చింది… ఎవరి ఫోన్ నుండి ఆ ఫోన్ కాల్ వచ్చింది అనేది తేలితే కేసు ఒక కొలిక్కి వచ్చినట్లేనని అన్నారు. తండ్రి హంతకులను శిక్షించాలని కోరుతూ డాక్టర్ సునీత చేస్తున్న న్యాయ పోరాటం లో నిర్దోషులు బయటపడి, నిజదోషులు శిక్షించబడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

మా పార్టీ వాళ్లు మాట్లాడితే ఇంపుగా… ఇతర పార్టీల వాళ్లు మాట్లాడితే కంపు గానా?

తమ పార్టీకి చెందిన నాయకులు, మంత్రులు, మాజీమంత్రులు పోలీసు అధికారులను ఉద్దేశించి అసభ్యకర పదజాలంతో మాట్లాడితే ఇంపుగా ఉన్నట్టు విని ఊరుకునే పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు, అదే ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు మాట్లాడితే మాత్రం కంపు గా ఉన్నట్లు వ్యవహరించడం హాస్యాస్పదంగా ఉందని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువ గళం పాదయాత్ర ప్రారంభోత్సవం రోజున, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చె నాయుడు ఉత్తరాంధ్ర మాండలికంలో మాట్లాడిన తీరుపై పోలీసు అధికారుల సంఘం అభ్యంతరం వ్యక్తం చేయడం విస్మయాన్ని కలిగించింది. తమ పార్టీకి చెందిన మంత్రులు, మాజీమంత్రులు, నాయకులు పోలీసులను అసభ్యకర పదజాలంతో దూషిస్తూ ఉన్న వీడియోలు ఎన్నో వెలుగు చూశాయి. అచ్చె నాయుడు సోదరుడే డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారని, అటువంటప్పుడు ఆయన పోలీసులను ఎందుకు అవమానిస్తూ మాట్లాడుతారు. పోలీసులకు టీ ఏ, డీ ఏ లు గత 14 నెలలుగా ప్రభుత్వం చెల్లించడం లేదు. అలాగే, గత 18 నెలలుగా అదనంగా పనిచేసిన పని దినాలకు జీతాలు చెల్లించడం లేదు. ఇటువంటి సమస్యలపై పోలీసు అధికారుల సంఘం పోరాడితే, తనలాంటి వారితో పాటు ప్రజల మద్దతు కూడా ఉంటుందని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

ఎదుటి వారిని విశ్వసించండి జగన్

ఎదుటివారిని విశ్వసించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రఘురామకృష్ణంరాజు సూచించారు. టెలిఫోన్ టాపింగ్ వ్యవహారాన్ని తాను గతంలోనే పేర్కొన్నానని గుర్తు చేశారు. తాజాగా తమ పార్టీకి చెందిన నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టెలిఫోన్ కూడా ట్యాప్ అయినట్లు ఆయనే పేర్కొన్నారు. ఎమ్మెల్యేల ఫోన్లను టాపింగ్ చేస్తున్న పోలీస్ అధికారుల ఫోన్లను కూడా ప్రభుత్వం ట్యాప్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో డిజిపి గౌతమ్ సవాంగ్ ఫోను కూడా ఇదే విధంగా టాప్ చేశారన్న వార్తలు వినిపించాయి. న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్ చేశారని న్యాయమూర్తులు సైతం వాపోయిన సంఘటనలు ఉన్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి, రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి అనుమతితో మాత్రమే ఫోన్ టాపింగ్ చేయాల్సి ఉండగా, ప్రభుత్వ పెద్దలు ఇష్టా రీతిలో ఎంపీలు ఎమ్మెల్యేలు, వారు వీరు అన్న తేడా లేకుండా అందరి ఫోన్లను టాపింగ్ చేస్తున్నారని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

సునీల్ పై గృహహింస చట్టం చార్జిషీట్ పెండింగ్ లో ఉంది

డీజీపీగా ఇటీవల పదోన్నతి పొంది, ఏపీ సిఐడి చీఫ్ గా ఉద్వాసనకు గురైన పీవీ సునీల్ కుమార్ పై ఆయన భార్య గృహహింస చట్టం కింద పెట్టిన కేసు తో పాటు, తెలంగాణ సిఐడి పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్ పెండింగులో ఉన్నాయని రఘురామకృష్ణం రాజు తెలిపారు. సునీల్ కుమార్ పై ఆయన మామ కూడా పలు సెక్షన్ల కింద కేసుల నమోదుకు ఫిర్యాదులు చేశారు. తనపై చార్జిషీట్ పెండింగులో ఉండగా, ఆయన కంటే సీనియర్ ఐపీఎస్ అధికారులు రేసు లో ఉండగా, సునీల్ కుమార్ కు డీజీపీ పదవి కట్టబెట్టడం జగన్మోహన్ రెడ్డికి సాధ్యం కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఐదు మంది సీనియర్ ఐపీఎస్ అధికారుల జాబితాను కేంద్రానికి నివేదిస్తే, కేంద్ర ప్రభుత్వం ముగ్గురి పేర్లను సూచిస్తుంది. అందులో ఒకరిని మాత్రమే డిజిపిగా నియమించే వెసులుబాటు ముఖ్యమంత్రికి ఉంటుంది. అంతేకానీ సీనియర్ ఐపీఎస్ అధికారులను కాదని తాను కొట్టమన్న వారిని కొడుతున్నాడు… ఎత్తుకు రమ్మన్న వారిని ఎత్తుకొస్తున్నాడని జగన్మోహన్ రెడ్డి తన ఇష్టానికి డీజీపీగా ఎవరిని పడితే వారిని, ప్రత్యేకించి సునీల్ కుమార్ ను నియమించడానికి వీల్లేదు. గతంలో సునీల్ కుమార్ తనకు సినిమా చూపించాడని, ఇప్పుడు సినిమా తాను చూపిస్తాను. ఢిల్లీలో తాము ఉన్నది ఎందుకు?, డి ఓ టి పి అధికారులను కలుస్తాం… ఫిర్యాదు చేస్తాం. సునీల్ కుమార్ పై పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలను మరొకసారి అందజేస్తామని రఘురామకృష్ణం రాజు తెలిపారు. రాష్ట్రంలోని సీనియర్ ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు, ద్వారకా తిరుమలరావు, రాజేంద్రనాథ్ రెడ్డిలలో ఒకరికి డీజీపీగా అవకాశం లభిస్తుంది. అంతేకానీ సునీల్ కుమార్ కు డిజిపిగా ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లభించదు. అయినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తాను చూసుకో అంటే… చూసుకుందాం ట్రై చేసుకో అంటూ రఘురామకృష్ణం రాజు సవాల్ విసిరారు.

పెద్దలను గౌరవించడం నేర్చుకో

పెద్దలను గౌరవించడం నేర్చుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రఘురామకృష్ణంరాజు హితవు పలికారు. గతంలో ముసలోడు ఏమీ చేయలేదని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఆయన ఫైర్ అయ్యారు. చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి మోడీ ఒకే వయసు వారని గుర్తు చేశారు. అదే మోడీ అపాయింట్మెంట్ కోసం పడిగాపులు పడుతున్నది ఎవరో ప్రజలందరికీ తెలుసునన్నారు. చంద్రబాబు నాయుడుని విమర్శించాలని చూస్తే, ఆ మాటలు వేరొకరికి ఇబ్బందికరంగా పరిణమించే ప్రమాదం లేకపోలేదని హెచ్చరించారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కు 76 ఏళ్ళు ఉన్నప్పటికీ , ప్రజాదరణలో 76% మంది ప్రజల మనసులు గెలుచుకున్నారు. 52 ఏళ్ళు ఉన్న జగన్, కేవలం 37 శాతం ప్రజల మనసులను మాత్రమే ప్రభావితం చేయగలిగారు. వయసుకు పరిపాలన దక్షతకు సంబంధం లేదని గుర్తు చేశారు. ఇక ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ పెద్దల అపాయింట్మెంట్ జగన్ కు లభించాలని ఆకాంక్షించారు.