Politics

జీవీఎల్ కు గట్టి కౌంటర్ ఇచ్చిన పురందేశ్వరి..

జీవీఎల్ కు గట్టి కౌంటర్ ఇచ్చిన  పురందేశ్వరి..

జీవీఎల్ చేసిన కామెంట్స్ పైన దగ్గుబాటి పురందేశ్వరి గట్టి కౌంటర్ ఇచ్చారు. జూ ఎన్టీఆర్ తరహాలోనే స్పందించారు.

ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. ఏపీలో వైఎస్సార్ – ఎన్టీఆర్ కీర్తి పైన మరోసారి చర్చ మొదలైంది. బీజేపీలో ఇప్పుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు..జీవీఎల్ పైన సొంత పార్టీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీవీఎల్ నర్సింహారావు కొద్ది రోజులు కాపు రిజర్వేషన్లు..వంగవీటి రంగా పేరు జిల్లాకు ప్రతిపాదిస్తూ పార్లమెంట్ లో ప్రస్తావించారు. ఇదే సమయంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్య లు పార్టీ నేతలకు నచ్చటం లేదు. జీవీఎల్ తీరు పైన తాజాగా పార్టీకి రాజీనామా చేసిన కన్నా లక్ష్మీనారాయణ కూడా అభ్యంతరం వ్యక్తం చేసారు. ఇప్పుడు జీవీఎల్ చేసిన కామెంట్స్ పైన దగ్గుబాటి పురందేశ్వరి గట్టి కౌంటర్ ఇచ్చారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తరహాలోనే ఇప్పుడు పురందేశ్వరి కౌంటర్ కనిపిస్తోంది.

జీవీఎల్ వ్యాఖ్యలకు పురందేశ్వరి కౌంటర్

ఏపీ బీజేపీలో మరో వివాదం తెర మీదకు వచ్చింది. ఎంపీ జీవీఎల్ నర్సింహా రావు తాజాగా వంగవీటి రంగా పేరుతో జిల్లా ఏర్పాట గురించి రాజ్యసభలో ప్రస్తావించారు. ఇక, విజయవాడలో ఆయన అన్నింటికీ ఆ ఇద్దరి పేర్లేనే అంటూ ఎన్టీఆర్ – వైఎస్సార్ పేర్లు పైన ప్రశ్నించారు. ఆ ఇద్దరి పేర్లు జిల్లాలకు పెట్టినప్పుడు రంగా పేరు ఎందుకు పెట్టరని ప్రశ్నించారు. దీనికి కేంద్ర మాజీ మంత్రి..బీజేపీ ముఖ్యనేత పురందేశ్వరి స్పందించారు. అన్నింటికి ఆ ఇద్దరి పేర్లేనే అనే దానికి సమాధానంగా ఆ ఇద్దరు కాదు.. ఆ మహానుభావులు అంటూ పేర్కొన్నారు. ఎన్టీఆర్- వైఎస్సార్ ఇద్దరూ మహానుభావులని పురందేశ్వరి ట్వీట్ లోపరోక్షంగా స్పష్టం చేసారు. అదే సమయంలో ఇద్దరు నేతల ప్రత్యేకతలను తన ట్వీట్ లో స్పష్టం చేసారు. ఎన్టీఆర్ – వైఎస్సార్ తీసుకొచ్చిన పథకాలు..అమలు చేసిన నిర్ణయాలను అందులో ప్రస్తావించారు.

ఆన్నీ ఇద్దరి పేర్లేనా..అనే ప్రశ్నకు సమాధానం

అన్నీ ఇద్దరి పేర్లేనే అంటూ జీవీఎల్ ప్రశ్నకు పురందేశ్వరి సమాధానం ఇచ్చారు. ఈ మేరకు ట్వీట్ చేసారు. అందులో..
“ఒకరు తెలుగు జాతికి గుర్తింపుని తీసుకొని వచ్చి, పేదలకు నిజమైన సంక్షేమం– 2 రూపాయలకే కిలో బియ్యం, పక్కా గృహాలు, జనతా వస్త్రాలు, మహిళా విశ్వవిద్యాలయం వంటివీ ప్రజలకు అందిస్తే , మరో కరు ఫీజు రీయింబర్స్‌మెంట్, 108 ఉచిత అంబులెన్సు సేవలు,ఆరోగ్యశ్రీ అందించారు..” అని పేర్కొన్నారు. పేర్లు ప్రస్తావన చేయకపోయినా..ఈ పథకాలు ప్రస్తావన ద్వారా పురందేశ్వరి ఏం చెప్పదలచుకున్నారనేదీ స్పష్టం అవుతోంది. జీవీఎల్ ఇద్దరు నేతల గురించి ప్రస్తావనతో..పురందేశ్వరి సైతం ఇద్దరి నేతల కీర్తిని గుర్తు చేస్తూ ట్వీట్ చేసారు. ఇద్దరినీ మహానుభావులుగా పేర్కొన్నారు. ఇదే సమయంలో గతంలో ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు విషయంలో జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన విధానం చర్చకు వస్తోంది.

నాడు జూ ఎన్టీఆర్..నేడు పురందేశ్వరి
నాడు ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు జూ ఎన్టీఆర్ ఆ వివాద సమయంలో ఎన్టీఆర్ – వైఎస్సార్ ఇద్దరూ ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులుగా అభివర్ణించారు. ఒకరి పేరు తీసి మరొకరి పేరు పెట్టటం ద్వారా తెచ్చే గౌరవం వైఎస్సార్ స్థాయిని పెంచదు..ఎన్టీఆర్ స్థాయిని తగ్గిందంటూ ట్వీట్ చేసారు. ఇప్పుడు సరిగ్గా.. పురంధేశ్వరి ఇదే అభిప్రాయం వ్యక్తం చేసారు. ఎన్టీఆర్ – వైఎస్సార్ ఇద్దరూ మహానుభావులు గా పేర్కొన్నారు. నాడు ఎన్టీఆర్ – వైఎస్సార్ ను జూనియర్ ఒకే విధంగా ప్రస్తావించటం టీడీపీ నేతలకు రుచించలేదు. ఇప్పుడు పురందేశ్వరి సైతం అదే అభిప్రాయం వ్యక్తం చేసారు. బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా పురందేశ్వరి చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అటు టీడీపీ..వైసీపీతో పాటుగా బీజేపీలోనూ ఆసక్తి కర చర్చకు కారణమవుతోంది.