Movies

షాకింగ్.. బాంబ్ బ్లాస్ట్‌లో స్టార్ హీరోకు గాయాలు.. ఎలా జరిగిందంటే?

షాకింగ్.. బాంబ్ బ్లాస్ట్‌లో స్టార్ హీరోకు గాయాలు.. ఎలా జరిగిందంటే?

బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సంజయ్ దత్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. కన్నడ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ కేజీఎఫ్ 2తో అటూ శాండల్ వుడ్, ఇటు టాలీవుడ్ లో కొత్త ఇమేజ్ సంపాదించుకున్నారు. గతంలో కూడా ఖల్ నాయకు గా విలన్ గా మెప్పించిన ఆయన కేజీఎఫ్ 2తో అధీరా పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దీంతో ఆయనకు సౌత్ మూవీ ఇండస్ట్రీల్లో అవకాశాలు రావడం స్టార్ట్ అయింది. అయితే తాజాగా ఓ సినిమా షూటింగ్ లో జరిగిన ప్రమాదం కారణంగా ఆయన గాయాలపాలయ్యారు.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో యష్ నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మూవీ కేజీఎఫ్ 2. ఇందులో అధీరా పాత్రతో క్రూరత్వాన్ని జోడించి పవర్ ఫుల్ విలన్ గా కొత్త కోణం చూపించారు బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్. ఈ పాత్రతో కన్నడ నుంచి సంజు బాబాకు చాలా ఆఫర్లు వచ్చాయి. అయితే ఆచితూచి పాత్రలను ఎంపిక చేసుకుంటున్నారు సంజయ్ దత్.

ఈ క్రమంలోనే యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా మేనల్లుడు ధ్రువ్ సర్జా హీరోగా రూపొందుతున్న కేడీ అనే సినిమాలో నటిస్తున్నారు సంజయ్ దత్. ఈ మూవీ షూటింగ్ లోనే సంజయ్ దత్ గాయపడినట్లు సమాచారం. ప్రస్తుతం బెంగళూరులో కేడీ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. అయితే ఫైట్ మాస్టర్ రవి వర్మ సారథ్యంలో ఓ భారీ బాంబు పేలుడు సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారు. అప్పుడే సంజయ్ దత్ గాయపడ్డారట. కేడీ మూవీ కోసం చిత్రీకరించిన బాంబ్ పేలుడు సన్నివేశంలో సంజయ్ దత్ ముఖానికి, చేతికి, భుజానికి గాయాలు అయినట్లు సమాచారం. దీంతో వెంటనే చిత్రీకరణ నిలిపివేసి హుటాహుటిన సంజు బాబాను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స జరుగుతోందని, సంజయ్ దత్ అభిమానులు ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని కన్నడ చిత్ర పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.

ఇదిలా ఉంటే కేడీ సినిమాకు ప్రేమ్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో రవితేజ సూపర్ హిట్ మూవీ అయిన ఇడియట్ హీరోయిన్ రక్షిత భర్తనే ప్రేమ్. ఈ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో కేడీ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగినట్లుగానే నటీనటులను ఎంపిక చేసుకున్నారట. అయితే వారు ఎవరనేది ఇంకా రివీల్ చేయలేదు. అర్జున్ జన్య సంగీతం అందించగా.. విలియం డేవిడ్ సినిమాటోగ్రాఫర్ బాధ్యతలు చేపట్టారు.