Movies

బింబిసార, కాంతారపై వెనక్కి నెట్టిన గాడ్‌ఫాదర్.. ఈ సినిమాల రేటింగ్ ఎంతంటే?

బింబిసార, కాంతారపై వెనక్కి నెట్టిన గాడ్‌ఫాదర్.. ఈ సినిమాల రేటింగ్ ఎంతంటే?

తెలుగు వినోద పరిశ్రమలో శాటిలైట్ ఛానెల్స్‌లో గత వారం ప్రదర్శించిన సినిమాలను ప్రేక్షకులు ఆదరించిన తీరుపై రేటింగ్స్‌ను బార్క్ వెల్లడించింది. గత కొద్దికాలంగా వెండితెరపై సంచలనాలు నమోదు చేసిన పలు చిత్రాలు గతవారం బుల్లితెరపై ప్రదర్శింపబడ్డాయి. అయితే బిగ్ స్క్రీన్‌పై భారీగా ఆకట్టుకొన్న ఈ చిత్రాలు బుల్లితెరపై పెద్దగా రేటింగ్స్‌ను నమోదు చేయలేకపోయాయి. 2023 సంవత్సరంలో 14వ వారం నమోదు చేసిన రేటింగ్ విషయానికి వస్తే..

తెలుగు టెలివిజన్ ఛానెల్స్‌లో గత వారం అంటే 14వ వారంలో బింబిసార, కాంతార, గాడ్ ఫాదర్ చిత్రాలు ప్రదర్శించారు. అయితే ఈ చిత్రాలు రికార్డు స్థాయి కలెక్షన్లను బాక్సాఫీస్ వద్ద నమోదు చేశాయి. అయితే ఈ సినిమాలు బుల్లితెరపై పెద్దగా ఆకట్టుకోలేకపోయాయనేది తాజా రేటింగ్స్ తెలియజెప్పాయి.

నందమూరి కల్యాణ్ రామ్ నటించిన బింబిసార చిత్రం భారీ విజయాన్ని అందుకొన్నది. తొలిసారి దర్శకత్వం వహించిన వశిష్ట ఈ సినిమాను కమర్షియల్ వ్యాల్యూస్ జొప్పించి కల్యాణ్ రామ్ బాడీ లాంగ్వేజ్‌కు తగినట్టుగా ఈ సినిమాను తెరకెక్కించారు. రెండు డిఫరెంట్ షేడ్స్‌తో కల్యాణ్ రామ్ భారీగా ఆకట్టుకొన్నాడు. అయితే ఈ సినిమా రూరల్ ప్రాంతంలో 3.85 రేటింగ్‌ను, అర్బన్‌లో 4.24 రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది. కన్నడ చిత్రం కాంతారా తెలుగు డబ్బింగ్ వెండితెరపై సంచలనాలు నమోదు చేసింది. థియేట్రికల్ రన్ అద్బుతంగా సాగడంతో భారీ కలెక్షన్లు నమోదు అయ్యాయి. అయితే గతవారం బుల్లితెరపై పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అర్భన్ ప్రాంతంలో ఈ చిత్రం 3.60 రేటింగ్, రూరల్ ప్రాంతంలో 4.02 రేటింగ్‌ను నమోదు చేసింది.

ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ చిత్రం మలయాళ చిత్రానికి రీమేక్‌గా రూపొందింది. అయితే ఈ సినిమా చిరంజీవి స్టార్ స్టామినాతో బాక్సాఫీస్ వద్ద కుమ్మేసింది. ఈ సినిమాకు కూడా పెద్దగా బుల్లితెరపై క్రేజ్ కనిపించలేదు. అర్బన్ ప్రాంతంలో 3.64 రేటింగ్, రూరల్ ప్రాంతంలో 4.41 రేటింగ్ నమోదైంది.

అయితే బుల్లితెరపై గతంలో మాదిరిగా పెద్దగా రేటింగ్ నమోదు కాకపోవడానికి కారణం ఓటీటీల ప్రభావమే అనే వాదన వినిపిస్తున్నది. సినిమా రిలీజ్ తర్వాత వెంటనే ఓటీటీల్లోకి సినిమాలు రావడంతో మెజారిటీ ప్రేక్షకులు అక్కడే చూస్తున్నారని, దాంతో ఆ ప్రభావం శాటిలైట్ ఛానెల్స్‌లో పడుతున్నదని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.