Politics

పాకిస్థానీల హృదయాల్లో మోడీ

పాకిస్థానీల హృదయాల్లో మోడీ

ఆస్ట్రేలియా గడ్డపైనా అదే మాట!

మెల్బోర్న్ లో విశ్వ సద్భావన సభ

హాజరైన వివిధ మతాల ప్రజలు, ప్రతినిధులు

అన్ని వర్గాలను గౌరవించగలిగే సత్తా మోడీ కే ఉందన్న పాకిస్థానీలు

మోడీ ఎంతో ఛరిష్మా ఉన్న నేత అని కితాబు

మోడీ మార్గం అనుసరణీయం అని వెల్లడి

న్యూఢిల్లీ : భారత ప్రధానిగా పగ్గాలు చేపట్టిన ఈ 9 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ ఛరిష్మా ప్రపంచవ్యాప్తమైంది. వివిధ దశల్లో, పరిస్థితుల్లో భారత్ ను ఆయన నడిపించిన తీరు అనేక దేశాధినేతలనే కాదు, ఆయా దేశాల ప్రజలను కూడా ఆకట్టుకుంది. పొరుగున ఉన్న దేశాల ప్రజలు సైతం మోదీకి జై కొడుతుండడం ఇటీవల కాలంగా తరచుగా చూస్తున్నాం. తాజాగా ఆస్ట్రేలియాలోని పాకిస్థానీలు కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీని కొనియాడారు. ఇండియన్ మైనారిటీస్ ఫౌండేషన్, నామ్ ధారీ సిఖ్ సొసైటీ సహకారంతో ఎన్ఐడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెల్బోర్న్ లోని బంజిల్ ప్యాలెస్ లో నిన్న విశ్వ సద్భావన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముస్లింలు, క్రైస్తవులు, ఇతర మతాల వారు విచ్చేశారు. మత నాయకులు, మేధావులు, పండితులు, మత గురువులు, పరిశోధకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పాకిస్థాన్ అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీకి చెందిన డాక్టర్ తారిఖ్ భట్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీని కొనియాడారు.
అన్ని వర్గాలను సమానంగా చూడగలిగే సత్తా ఉన్న నాయకుడు నరేంద్ర మోడీ అని పేర్కొన్నారు. తనకు అనేకమంది భారతీయ స్నేహితులు ఉన్నారని, ఇప్పుడు వారంతా ఐక్యంగా అనేక కార్యక్రమాలు చేపడుతుండడం చూస్తున్నానని తారిఖ్ భట్ వెల్లడించారు. వారి కార్యక్రమాలలో తాము (పాకిస్థానీ ముస్లింలు) కూడా చేయి కలిపామని, మునుపటి కంటే ఇప్పుడు భారత్- పాకిస్థాన్ ముస్లింల మధ్య సంబంధాలు మరింత విస్తృతమయ్యాయని తెలిపారు. ఇప్పుడు విభేదాల కంటే సారూప్యతలకు పెద్ద పీట వేసేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన వివరించారు. ఇది మోదీకే సాధ్యమని కీర్తించారు. ఈ సద్భావన కార్యక్రమం గొప్పదని, హిందువులు, ముస్లింలను ఒక్కతాటిపైకి తీసుకువచ్చేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని డాక్టర్ తారిఖ్ భట్ అభిప్రాయపడ్డారు. అన్ని మతాల వారు ఒకరికొకరం అనుకునేలా, పరస్పరం కలుసుకునేలా ప్రోత్సహించడం ద్వారా ప్రధాని మోదీ సరైన విధంగా తన కార్యాచరణను ముందుకు తీసుకెళుతున్నారని ప్రశంసించారు. శాంతి, సామరస్యం పెంపొందించేందుకు నరేంద్ర మోడీ చర్యలు ఎంతగానో తోడ్పాడతాయని అన్నారు. “ప్రధాని మోడీ ఎంతో ఛరిష్మా ఉన్న నాయకుడు. ఏ మతం వారైనా సరే ఆయన అడుగుజాడల్లో నడిచేందుకు ప్రయత్నిస్తుండడం నిజంగా చాలా మంచి పరిణామం” అని పేర్కొన్నారు.