Politics

ఎంపీ అవినాష్ రెడ్డి లేఖకు సీబీఐ రిప్లై…

ఎంపీ అవినాష్ రెడ్డి లేఖకు సీబీఐ రిప్లై…

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కి సిబిఐ అధికారులు మరోమారు నోటీసులు జారీ చేశారు. ఈనెల 19వ తేదీన ఆయన విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ మేరకు ఆయనకు వాట్సప్ ద్వారా సందేశాన్ని పంపారు సిబిఐ అధికారులు.

నిన్న హైదరాబాద్లోని కోటి లో ఉన్న సిబీఐ కార్యాలయంలో వివేకానంద రెడ్డి హత్య కేసు కు సంబంధించి విచారణకు హాజరుకావాలని ఎంపీ అవినాష్ రెడ్డి కి సిబిఐ అధికారులు నోటీసులు పంపిన నేపథ్యంలో కడప వెళ్లిన ఎంపీ అవినాష్ రెడ్డి మళ్లీ హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. ఈ రోజు సిబిఐ ఎదుట హాజరు కావాల్సి ఉన్నప్పటికీ, ఆయన చివరి నిమిషంలో సిబిఐ ఎదుట హాజరుకాకుండా ట్విస్ట్ ఇచ్చ్చారు.

సీబీఐకి లేఖ రాశారు. షార్ట్ నోటీసు ఇచ్చినందున, విచారణకు మరింత సమయం కావాలని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. తనకు ముందస్తు కార్యక్రమాలు ఉన్న కారణంగా విచారణకు హాజరు కాలేనని పేర్కొన్నారు. మరో నాలుగు రోజుల పాటు తాను పార్టీ కార్యక్రమాలలో పాల్గొనవలసి ఉన్నదని, అందుకే తాను విచారణకు హాజరు కావాలంటే కొంత సమయం కావాలని ఎంపీ అవినాష్ రెడ్డి సిబిఐకి తెలిపారు.

ఈరోజు ఉదయం 11 గంటలకు ఆయన సిబిఐ ఆఫీస్ లో అధికారుల ఎదుట హాజరు కావాల్సి ఉన్నప్పటికీ ఆయన హాజరు కాలేదు. ఇప్పటికే నాలుగు సార్లు వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి ని విచారించారు సిబిఐ అధికారులు. ఇప్పుడు తాజాగా మరోమారు విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపించారు.

అయితే ముందే షెడ్యూల్లో ఉన్న కార్యక్రమాల వల్ల రాలేకపోతున్నానని ఆయన చెప్పడంతో సానుకూలంగా స్పందించిన అధికారులు తాజాగా మరోమారు ఆయన విచారణ తేదీని రీషెడ్యూల్ చేసి నోటీసులు పంపారు. ఈ క్రమంలో మే 19వ తేదీన ఎంపీ అవినాష్ రెడ్డి సిబిఐ అధికారుల ఎదుట హాజరు కావాల్సి ఉంది. అప్పుడైనా ఆయన వెళ్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.