NRI-NRT

ఇండియా నుండి పారిపోతున్న కుబేరులు….

ఇండియా నుండి పారిపోతున్న కుబేరులు….

భారత్‌ నుంచి విదేశాలకు వెళ్లిపోయే సంపన్నుల (Millionaires Migration) సంఖ్య భారీగా ఉంటోంది. కేవలం 2023లోనే సుమారు 6500 మంది అత్యధిక ఆదాయం కలిగిన వ్యక్తులు (HNWIs) దేశం విడిచి వెళ్లే అవకాశం ఉందని తాజా అధ్యయనం పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులు, సంపన్నుల కదలికల తీరును విశ్లేషించే ‘హెన్లీ ప్రైవేట్‌ మైగ్రేషన్‌ నివేదిక-2023’ ఈ వివరాలను వెల్లడించింది. హెన్లీ అండ్‌ పార్ట్నర్స్‌ (Henley and Partners) ప్రకారం.. 10లక్షల డాలర్లు అంతకంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టే వారిని మిలియనీర్లు లేదా అత్యధిక సంపద కలిగిన వ్యక్తులుగా (హెచ్‌ఎన్‌డబ్ల్యూఐ) పరిగణిస్తుంది.

సంపన్నులను కోల్పోతున్న దేశాల జాబితాలో ఈ ఏడాది చైనా ముందు నిలిచింది. 2023లో చైనా నుంచి దాదాపు 13,500 మంది హెచ్‌ఎన్‌డబ్ల్యూఐలు వలస వెళ్తారని అంచనా. తర్వాతి స్థానంలో భారత్‌ ఉన్నప్పటికీ.. గతేడాదితో పోలిస్తే మాత్రం ఈ సంఖ్య తక్కువే. గతేడాదిలో భారత్‌ నుంచి 7500 సంపన్నులు వలస వెళ్లారని అంచనా. ఈ ఏడాది వెళ్లేవారిలో ఎక్కువగా.. దుబాయ్‌, సింగపూర్‌ దేశాలకు వలస వెళ్తున్నట్లు తేలింది. ఇక యూకే నుంచి 3200 మంది, రష్యా నుంచి 3వేల మంది వెళ్లిపోనున్నారట. బ్రిటన్‌లో ఈ సంఖ్య గతేడాదితో (1600 మంది) పోలిస్తే రెట్టింపుగా ఉంది. ఇలా గడిచిన దశాబ్ద కాలంగా మిలియనీర్ల వలసల్లో భారీ పెరుగుదల కనిపిస్తోందని హెన్లీ అండ్‌ పార్ట్నర్స్‌ సీఈవో డాక్టర్‌ జుయెర్జ్‌ స్టెఫెన్‌ పేర్కొన్నారు.