Agriculture

దేశవ్యాప్తంగా కిలో 100 దాటిన టమాట ధరలు

దేశవ్యాప్తంగా కిలో 100 దాటిన టమాట ధరలు

దేశంలో టమాటా ధరలు చుక్కల్ని అంటుతున్నాయి. సామాన్యుడికి అందుబాటులో టమాటా ధరలు లేవు. ఇప్పటికే కిలో టమాటా రేటు రూ. 100ను దాటింది. ఇది కొన్ని రాష్ట్రాలకే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా అన్ని మెట్రో సిటీలతో పాటు ప్రధాన నగరాల్లో టమాటా కిలో ధర సెంచరీని చేరింది. ఢిల్లీలో కిలో టమాటా రూ.80గా ఉంది. కాన్పూర్‌లో, టొమాటోల హోల్‌సేల్ ధర కిలోకు రూ.80-90 మరియు రిటైల్ దుకాణాలు కిలోకు రూ. 100 చొప్పున విక్రయిస్తున్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో టమాటా హోల్ సేల్ ధర కిలోకి రూ.50 ఉండగా.. రిటైల్ ధర రూ.100ను దాటింది. బెంగళూరులో టమాటా ధర కిలో రూ.100 మార్కుకు చేరుకుంది. టొమాటో ధర ఇటీవల కాలంలో కిలోకి రూ.30 నుంచి రూ.50కి పెరిగిందని అక్కడి స్థానికులు చెబుతున్నారు. హైదరాబాద్ లో కూడా టమాటా ధర కిలోకి రూ. 100 పలుకుతోంది.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ ఆధ్వర్యంలోని ధరల పర్యవేక్షణ విభాగం డేటాబేస్ ప్రకారం, రిటైల్ మార్కెట్‌లలో సగటున కిలో టొమాటో ధర ₹25 నుండి ₹41కి పెరిగింది. రిటైల్ మార్కెట్‌లలో టమాటా గరిష్ఠ ధరలు ₹80-113 మధ్య ఉన్నాయి. రుతుపవనాల రాక ఆలస్యం కావడం.. భారీ వర్షాలు, విపరీతమైన వేడి టమాటా పంటపై ప్రభావాన్ని చూపాయని నిపుణులు చెబుతున్నారు. రానున్న కాలంలో కిలో టమాటా ధర రూ.150కి చేరిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశానికి దక్షిణాది నుంచే టమాటా ఎగుమతి అవుతుంది. ముఖ్యంగా బెంగళూరు రూరల్, చిత్రదుర్గ, చిక్కబళ్లాపూర్, కోలార్, రామనగర వంటి జిల్లాల్లో టమాటా పంట ఆశించిన స్థాయిలో లేదు. దీంతో కొరత ఏర్పడుతుంది.కొన్ని రోజలు వరకు టమాటా ధర కిలోకి రూ. 20-30 ఉంటే ఇప్పుడు ధర రూ. 80-120 మధ్య ఉంది. అనిశ్చిత వాతావరణ పరిస్థితుల కారణంగా దాని సరఫరాపై ప్రభావం చూపడంతో టమోటా ధరలు అకస్మాత్తుగా పెరిగాయి. కొన్ని రోజులుగా కర్ణాటకలో వరసగా వర్షాలు పడుతున్నాయని, దీంతో పంట దిగుబడిపై ప్రభావం పడిందని నిపుణులు చెబుతున్నారు. అంతకుముందు వేసవిలో అత్యధిక వేడి కూడా పంటపై ప్రభావం చూపిందని రైతులు చెబుతున్నారు.